పొన్నాల వర్గానికి చెక్
పీసీసీ కమిటీల్లో దక్కని ప్రాధాన్యం
{పత్యర్థుల్లో ఎక్కువ మందికి పదవులు
11 మంది జిల్లా నేతలకు చోటు
వరంగల్ : పీసీసీ తాజా కమిటీల్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పొన్నాల వర్గంగా ముద్రపడిన జిల్లా నేతల్లో ఎవరికీ పీసీసీ కమిటీల్లో పదవులు రాలేదు. శనివారం పార్టీ అధిష్టానం పీసీసీ పదవులను ప్రకటించింది. అందులో 11 మంది జిల్లా నేతలకు పదవులు దక్కారుు. పీసీసీ మాజీ అధ్యక్షుడి హోదాలో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ కార్యనిర్వాహక కమిటీలో, సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే పీసీసీ కార్యనిర్వాహక కమిటీలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి చోటు కల్పించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పీసీసీ సమన్వయ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, ప్రధాన కార్యదర్శిగా బక్క జడ్సన్ నియమితులయ్యారు. పీసీసీ శాశ్వత ఆహ్వానితులుగా డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పొదెం వీరయ్య, మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్, పార్టీ నేతలు కొండపల్లి దయాసాగర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్‌లకు చోటు దక్కింది. కాగా, పీసీసీ కమిటీల్లో పదవులు వచ్చిన వారంతా పొన్నాలకు వ్యతిరేకంగా ఉన్న వారే కావడం గమనార్హం.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎంపీ బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మొదటి నుంచి పొన్నాల వ్యతిరేక వర్గంగానే ఉంటున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన బక్క జడ్సన్ 2014 ఎన్నికల్లో పొన్నాలపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పొన్నాలకు దూరంగా ఉంటున్న గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కొండపల్లి దయాసాగర్, నమిండ్ల శ్రీనివాస్ శాశ్వత ఆహ్వానితులుగా నియమితులయ్యారు. పీసీసీ కమిటీల్లో నియామకంతో జిల్లాలో పొన్నాల వర్గానికి పూర్తిగా చెక్ పెట్టినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కమిటీల నియామకంపై పొన్నాల వర్గం నేతల్లో అసంతృప్తి నెలకొంది.