![Congress executive appointment process has reached its final stage in Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/congress.jpg.webp?itok=H8DY2P4I)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ అధిష్టానంతో పలుమార్లు జరిగిన చర్చల అనంతరం బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీలు అన్ని కోణాల్లో కస రత్తు చేసి తుది జాబితాను సిద్ధం చేశారు. తాజాగా ఏఐసీసీ ఆమోదం కోసం ఈ జాబితాను ఢిల్లీకి పంపారు. అధిష్టానం ఆమోదం లభించిన వెంటనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో టీపీసీసీ కార్యవర్గాన్ని జాగ్రత్తగా కసరత్తు చేసి ఎంపిక చేశా రనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. దీంతో కీలక పదవులు ఎవర్ని వరిస్తాయనే దానిపై ఆశావహులు, పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
ఐదుగురు కాదు.. నలుగురే
పార్టీ అధ్యక్ష పదవి తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న పదవి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ హోదా కోసం పార్టీలోని చాలామంది సీనియర్లు పోటీ పడుతున్నారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్)గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చిన నేపథ్యంలో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయ కులు, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చాలా మంది ఈ పదవిని కోరుకుంటు న్నారు. గత కార్యవర్గంలో మొత్తం ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో పాటు జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్‌లు ప్రస్తుతం ఈ హోదాలో ఉన్నారు.
ఈసారి ఆ 4 కేటగిరీల వారికి..
గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉండడంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ఎమ్మెల్యే కోటాలో జగ్గారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఈసారి బీసీ వర్గాలకు చెందిన నాయకుడు అధ్యక్షుడిగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన నలుగురు నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ రేసులో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ (ఎస్టీ) పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
మరోవైపు ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నాగరిగారి ప్రీతం, అద్దంకి దయాకర్, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, మైనార్టీ కోటాలో ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, నాంపల్లి నియోజకవర్గ నేత ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌లలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తే మరొకరికి అధికారిక పదవి వస్తుందని తెలుస్తోంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఈ కోణంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు సామాజికవర్గాల వారీగా రెండేసి చొప్పున పేర్లు ఢిల్లీకి పంపినట్టు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా రెండు వైస్‌లు
వర్కింగ్ ప్రెసిడెంట్‌లతో పాటు పీసీసీ ఉపాధ్యక్ష పదవులకు కూడా డిమాండ్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పీసీసీలో ముఖ్య హోదా అయిన వైస్ ప్రెసిడెంట్ పదవి వచ్చినా బాగానే ఉంటుందనే ఆలోచనలో చాలామంది కాంగ్రెస్ నేతలున్నారు. ఈ పదవులను పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇవ్వాలని తొలుత భావించినా సామాజిక, ప్రాంతీయ సమీకరణలు కుదరకపోవడంతో ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.
కొన్ని జిల్లాల్లో సమీకరణలను బట్టి రెండు పదవులను కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింపజేయనున్నారు. ప్రస్తుతమున్న 33 జిల్లాలకు జిల్లాకో ప్రధాన కార్యదర్శిని నియమించాలని అనుకున్నా ఉపా«ధ్యక్షుల తరహాలోనే ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా అవసరాన్ని బట్టి రెండు పదవులు ఇవ్వాలని నిర్ణయించారు.
సీనియర్ వైస్ లేనట్లే..
గతంలో ఉన్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదా ఈసారి ఉండదని, ఆ హోదాలో ఉన్న ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను ముఖ్యమైన కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తారని తెలుస్తోంది. అధికార ప్రతినిధుల విషయానికి వస్తే గతంలో కాకుండా 10 మంది వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ జాబితాలో ఈసారి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశముందని అంటున్నారు. కాగా పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రచార కమిటీ చైర్మన్ నియామకం ఇప్పుడా.. తర్వాతా?
పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నందున ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి టీపీసీసీలో కీలకమైన ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో రేవంత్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీసీ వర్గాలకు చెందిన మధుయాష్కీ గౌడ్‌ను ఈ పదవిలో నియమించారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన మహేశ్‌గౌడ్ పీసీసీ అ«ధ్యక్షుడిగా ఉన్నందున యాష్కీకి సముచిత పదవి ఇచ్చి ప్రచార కమిటీ చైర్మన్ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి అప్పగిస్తారని అంటున్నారు. ఈ పోస్టు రేసులో మొదటి నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుండడం గమనార్హం. అయితే ఈ పదవిని ఇప్పుడే భర్తీ చేయాలా? లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతా అన్న విషయంలో అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment