7 మునిసిపాలిటీలుగా 35 పంచాయతీలు! | 7Municipalities, 35 panchayats! | Sakshi
Sakshi News home page

7 మునిసిపాలిటీలుగా 35 పంచాయతీలు!

Published Wed, Oct 2 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

7Municipalities, 35 panchayats!

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో శివారు గ్రామాల విలీనంపై సర్కారు వెనక్కి తగ్గింది. ఆయా పంచాయతీలను కలుపుతూ మునిసిపాలిటీలుగా చేయాలని భావిం చింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంగళవారం జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నగరీకరణ నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగాలంటే నగరపాలక సంస్థతోనే సాధ్యమని భావించిన ప్రభుత్వం.. 35 శివారు పంచాయతీలను గ్రేటర్ పరిధిలో చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, జీహెచ్ ఎంసీలో పంచాయతీలను కలిపేస్తే జిల్లా ఉనికికే భంగం కలుగుతుందని, మహానగర పరిధిని పెంచుకునేందుకు తాపత్రయపడుతున్న సర్కారు ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిధులివ్వడంలేదని ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 
 
విలీనాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళనకు అధికారపక్షం మద్దతుగా నిలవడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ కూడా ప్రతికూలంగా స్పందించడం, కేబినెట్ భేటీలో ఏకంగా మంత్రులు శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్‌లు ఈ అంశంపై అభ్యంత రం వ్యక్తంచేయడంతో ప్రభుత్వం దిగివచ్చింది. మరోవైపు ఉన్నత  న్యాయస్థానం కూడా పంచాయతీల విలీన తీరును తప్పుపట్టింది. చట్టపరంగా విలీన ప్రక్రియ జరగలేదని గుర్తించిన న్యాయస్థానం.. గ్రేటర్‌లోకి పంచాయతీలను చేరుస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓను కొట్టివేసింది. దీంతో పంచాయతీల విలీనంపై పునఃసమీక్షించాలని ప్రభుత్వం భావించింది.
 
నగర పంచాయతీలతో సమస్యలు
రాజకీయ ఒత్తిళ్లపై ఆధారపడి నగర పంచాయతీలు కూడా తెరమీదకు రావచ్చనే అభిప్రాయాలున్నాయి. రాజకీయ నిరుద్యోగుల కోసం వీటిని ఏర్పాటు చేస్తే సమస్యలు తప్పవని అంటున్నారు. ఆయా పంచాయతీలను విలీనం చేస్తూ మునిసిపాలిటీలుగా చేస్తేనే అన్నివిధాలుగా మేలు జరగుతుందని స్థానికపాలనపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. ఇప్పటికే 150 డివిజన్లతో ఉన్న గ్రేటర్లోని పలు డివిజన్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగర పంచాయతీలకు బదులు మునిసిపాలిటీలుగా చేస్తేనే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. విలీనం చేసిన 35 పంచాయతీల స్థానంలో ఏడు మునిసిపాలిటీల ఏర్పాటుకు వీలుం టుందని అంచనాలు వేస్తున్నారు.  ఆయా మండలాల పరిధిలోని మూడునాలుగు గ్రామాలను కలిపి, భౌగోళిక పరిస్థితుల కనుగుణంగా మునిసిపాలిటీగా మారిస్తే మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగైదు పెద్ద మునిసిపాలిటీలను ఏర్పాటు చేసినా ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు. వీటికి కేంద్రం నుంచి అందే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తదితర పథకాల నిధులతో మౌలికసదుపాయాలు కల్పించవచ్చని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని వివరిస్తున్నారు. 
 
ఇలా చేస్తే బాగు
రాజేంద్రనగర్ మండలంలోని గ్రామపంచాయతీలతో ఒక మునిసిపాలిటీ, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్ తదితర పంచాయతీలతో ఒక మునిసిపాలిటీ, కీసర సమీపంలోని దమ్మాయిగూడ, నాగారం తదితరాలతో కలిపి ఒక మునిసిపాలిటీ, ఘట్‌కేసర్ మండలంలోని ఐదు గ్రామాలతో ఒక మునిసిపాలిటీ ఏర్పాటు చేస్తే సదుపాయంగా ఉంటుందని మునిసిపల్ కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు. వాటికి తగిన సిబ్బంది, నిధులిస్తే ప్రజలకు  మేలైన సదుపాయాలు సమకూరతాయన్నారు. రాజకీయ పోస్టుల కోసం నగర పంచాయతీలను చేస్తే.. ప్రజలకు జరిగే మేలంటూ ఉండదన్నారు.  జనాభా, ఆదాయం తదితర అంశాలను కూలంకషంగా పరిశీలించి, శివార్లను నాలుగైదు పెద్ద మునిసిపాలిటీలు చేస్తే బాగుంటుందన్నారు. తద్వారా అవి గతంలో ఎంసీహెచ్ చుట్టూ ఉన్న మునిసిపాలిటీల తరహాలో అభివృద్ధి చెందుతాయన్నారు. భవిష్యత్ అవసరాల రీత్యా వాటిని గ్రేటర్‌లో కూడా విలీనం చేయవచ్చునన్నారు. ప్రత్యేక మునిసిపాలిటీలుగా ఉంటే త్వరితంగా అభివృద్ధికి ఆస్కారముంటుందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్‌ను మాత్రం నగర పంచాయతీగా చేయవచ్చునన్నారు. 
 
జీహెచ్‌ఎంసీకి చుక్కెదురు
ఆగమేఘాల మీద ఆయా పంచాయతీల రికార్డులు స్వాధీనం చేసుకొని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఉరుకులు పరుగులు తీసిన జీహెచ్‌ఎంసీ అధికారులకు బ్రేక్ పడింది. ఆయా గ్రామాల్లో జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పనులు చేయరాదని ఇటీవలి సర్వసభ్య సమావేశంంలో మేయర్ ఆదేశించడంతో.. తామేం చేయాలో చెప్పమంటూ ప్రభుత్వానికి లేఖ రాశా రు. సమాధానం వచ్చేలోపునే మంత్రు లు విలీనాన్ని వ్యతిరేకించారు. విలీనానికి హైకోర్టు బ్రేక్‌వేసింది. ఈ నేపథ్యంలో రికార్డులను ఆయా పంచాయతీలకు అప్పగించాలని సర్కారు నిర్ణయించింది. కాగా నగరానికి చేరువలో ఉన్న కొన్ని పంచాయతీలను మాత్రం జీహెచ్‌ఎంసీలో కలిపేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. న్యాయపర చిక్కులు తలెత్తకుండా ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement