సాక్షి, హైదరాబాద్: మునిసిపాలిటీల్లో పలు పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. మునిసిపాలిటీ లేదా మునిసిపల్ కార్పొరేషన్‌ల్లో విలీనం చేయడానికి ముందు ఓ గ్రామ పంచాయతీని డీ నోటిఫై చేసే అధికారం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 3(2)(ఎఫ్) కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తీర్పునిచ్చింది. విలీనం తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణంతో వాటిని కొట్టేయజాలమని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం వల్ల వ్యక్తిగత హక్కులు ప్రభావితం కావని తేల్చి చెప్పింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు లేదా పరిధి దాటి అధికారాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే ఓ చట్టాన్ని కొట్టేయడానికి వీలవుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారానికి లోబడే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని స్పష్టం చేసింది. చిన్న లేదా పెద్ద పట్టణ ప్రాంతాలుగా మార్చేందుకు వీలుగా గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేసే నిమిత్తం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం రాజ్యాంగంలోని అధికరణలు 14, 73, 74లకు ఎంతమాత్రం విరుద్ధం కాదంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
100కు పైగా వ్యాజ్యాలు...
రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు గ్రామపంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. విలీనం నిమిత్తం ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం (యాక్ట్ 4 ఆఫ్ 2018)లోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాదాపు 100 పిటిషన్ల వరకు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం వాదనలు విని గత నెల 4న తీర్పు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
విధి విధానాలన్నీ పూర్తి
గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియలో చట్టప్రకారం చేయాల్సిన విధివిధానాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపింది. సవరణ చట్టం అధికరణ 243 క్యూ(2)కు అనుగుణంగానే ఉందని స్పష్టం చేసింది. చట్టం లేదా చట్ట సవరణ చేసే విషయంలో శాసనసభకున్న అధికారం గవర్నర్ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారంకన్నా మిన్న అని తెలిపింది. వాస్తవానికి ఈ సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర కూడా వేశారని గుర్తు చేసింది.
ఏకపక్ష చట్టంగా చెప్పజాలం
మునిసిపాలిటీలు లేదా మునిసిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయడానికే పంచాయతీలను విలీనం చేశారని, అది కూడా ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతనే సవరణ చట్టం తీసుకొచ్చారని తెలిపింది. అందువల్ల ఈ సవరణ చట్టాన్ని ఏ రకంగా చూసినా ఏకపక్షంగా తీసుకొచ్చిన చట్టంగా చెప్పజాలమంది.
రాజ్యాంగంలో ఎక్కడా నిషేధం లేదు...
చిన్న లేదా పెద్ద పట్టణ ప్రాంతాలుగా చేసేందుకు గ్రామపంచాయతీలను మునిసిపాలిటీ లేదా కార్పొరేషన్లలో విలీనం చేయరాదని రాజ్యాంగంలో ఎక్కడా నిషేధం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రజల అభిప్రాయాలను అధికారులు తెలుసుకో కుండా ఏకపక్షంగా విలీన నిర్ణయం తీసుకున్నారన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందన్న వాదనను సైతం తోసిపుచ్చింది. పంచాయతీలను విలీనం చేసి మునిసిపాలిటీలు, మునిసి పల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయడమన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment