మున్సిపాల్టీల్లో తల‘సిరి’ తక్కువే  | NITI Aayog study report revealed On Per Capita Income | Sakshi
Sakshi News home page

మున్సిపాల్టీల్లో తల‘సిరి’ తక్కువే 

Published Sun, Feb 5 2023 5:09 AM | Last Updated on Sun, Feb 5 2023 5:09 AM

NITI Aayog study report revealed On Per Capita Income - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో 15 రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల మొత్తం ఆదాయంలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్‌ అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీల జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.4,624 కాగా.. 15 రాష్ట్రాల్లో ఈ సగటు ఇంకా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పట్టణ జనాభా పెరుగుతున్నప్పటికీ జీడీపీలో మున్సిపాలిటీల వ్యయం 0.44 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.

మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితులు, అకౌంటింగ్‌ విధానంపైనా నీతి ఆయోగ్‌ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో పాటు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక, పరిపాలన సంస్కరణలు చేపట్టాలని పేర్కొంది.  


ఏపీలో స్థానిక సంస్థలకు 16 అంశాలు బదిలీ 
74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలను బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే 18 అంశాలను బ­ది­లీ చేశాయని, ఆంధ్రప్రదేశ్‌ 16 అంశాలను బదిలీ చేసిందని నివేదిక వెల్లడించింది. అలాగే, పట్టణ స్థా­ని­క సంస్థల్లో ఏటా తప్పనిసరిగా అకౌంటింగ్‌ విధానం ఉండాలని నివేదిక సూచించింది. అలాగే, నీతి ఆయోగ్‌ ఇంకా ఏం సూచించిందంటే.. 

► రాష్ట్రాల తరహాలోనే పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం అమలుచేయాలి. 
► పట్టణ స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరుల­ను పెంచుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. 
► దేశంలో 223 క్రెడిట్‌ రేటింగ్‌లు ఇస్తే కేవలం 95 ప­ట్టణ స్థానిక సంస్థలకే పెట్టుబడి రేటింగ్‌ ఉంది. ఇందులో కేవలం 41 మున్సిపాలిటీలే బాండ్ల ద్వా­రా రూ.5,459 కోట్ల నిధులు సమీకరించాయి. 
► 2036 నాటికి పెరిగే జనాభాలో 73 శాతం పట్టణాల్లోనే ఉంటుందని, అందుకనుగుణంగా మౌలిక వసతుల కోసం అవసరమైన నిధుల సమీకరణకు మున్సిపల్‌ బాండ్ల జారీతో పాటు ఇతర మార్గాలను అనుసరించాలి. ఇందుకోసం మున్సిపాలిటీల సొంత ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు క్రెడిట్‌ రేటింగ్‌ సాధ్యమవుతుంది. 
► స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, వినియోగ రుసుం చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే, దేశ జీడీపీలో మున్సిపాలిటీల ఆస్తి పన్ను కేవలం 0.2 శాతమే ఉంది. 
► మున్సిపాలిటీలు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా­లు బదిలీచేసే నిధులపైనే ఆధారపడుతున్నాయి.  
► మెరుగైన మున్సిపల్‌ పాలన కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి.  
► మున్సిపల్‌ అకౌంటింగ్‌ రికార్డులు, వార్షిక ఖాతాలు కచ్చితత్వంతో ఉండాలి.  
► వాస్తవ ఆదాయం, వ్యయంతోనే అకౌంటింగ్‌ ఉండాలి తప్ప ఇంకా రాని ఆదాయం, చేయని వ్యయాలను అకౌంటింగ్‌లో ఉండకూడదు.  
► ఏటా ఆదాయంలో 5 శాతం నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. 
► రుణ స్థాయిలో చట్టబద్ధమైన సీలింగ్‌ను విధించుకోవాలి. 
► జీతం, పెన్షన్‌ వ్యయాలను 49 శాతానికి పరిమితం చేయాలి. 
► 51 శాతం ఆస్తుల సృష్టి, రుణ సేవలు, పెట్టుబడికి వ్యయం చేయాలి. 
► క్రెడిట్‌ రేటింగ్‌తో బాండ్‌ల జారీని ప్రోత్సహించాలి. 
► ఫలితాల ఆధారిత బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. 
► ఆదాయ అంచనాలు సగటు వార్షిక వృద్ధి కంటే ఎక్కువగా ఉండకూడదు. 
► స్థానిక సంస్థలు ఆర్థిక డేటాబేస్‌ను ఏర్పాటుచేయాలి. 
► సొంత పన్నులు, కేంద్ర.. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం, వ్యయంతో పాటు అన్ని వివరాలు పౌరులకు ప్రదర్శించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement