
పురపాలికల్లో నీటి ఎద్దడికి అడ్డుకట్ట
♦ రూ.63 కోట్లతో వేసవి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
♦ మున్సిపల్ కమిషనర్లకుపురపాలక శాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ కిం ద ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని, అవసరమైతే కొత్త బోరుబావులను తవ్వి నీటి సరఫరాను కొనసాగించాలని సూచించింది. రాష్ట్రంలోని నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లతో పురపాలక శాఖ సంచాలకులు దాన కిశోర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వేసవి ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద ఇప్పటికే పట్టణ ప్రాంతాలకు రూ.36 కోట్లు విడుదల చేశామని, మరో రూ.64 కోట్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, రెండు మూడు రోజుల్లో నిధులు విడుదల కావచ్చన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, జగి త్యాల, కోరుట్ల పట్టణాలకు నీరు సరఫరా చేసే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు సైతం మరో 15 రోజుల్లో ఖాళీ కానున్నాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద కొత్త బోర్లను తక్షణమే వేయాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి నీటి కొరత తీర్చాలన్నారు. సింగూరు, మంజీర జలాశయాలు అడుగంటడంతో జహీరాబాద్, సదాశివపేట మున్సిపాలిటీలకు ప్రత్యామ్నాయంగా భూగర్భ జలాలను సరఫరా చేస్తున్నారన్నారు.
హల్దీ వాగు ఎండిపోవడంతో మెదక్ పట్టణంలో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి రామన్‌పాడు రిజర్వాయర్‌కు త్వరలో నీళ్లు విడుదల కానున్నాయని, దీంతో మహబూబ్‌నగర్‌తో పాటు వనపర్తి, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాలకు నీటి సరఫరా మెరుగవుతుంద న్నారు. నాగార్జునసాగర్ నుంచి పానగల్ ఉదయ సముద్రంలోకి ఒక విడతగా నీటిని విడుదల చేయనున్నారని, దీంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మంకు సరిపడా నీళ్లు ఉంటాయన్నారు.