Mayor, Chairperson Elections in AP, Held on 18th March 2021 - Sakshi
Sakshi News home page

మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

Published Thu, Mar 18 2021 3:23 AM | Last Updated on Thu, Mar 18 2021 8:18 AM

Election of Mayor and Chairpersons in AP is on 18th March - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్లు గురువారం కొలువుదీరనున్నాయి. కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీలకు చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు  మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు. అదేవిధంగా 75 మునిసిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకుంటారు. అందుకోసం పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.

ఎన్నిక ప్రక్రియ ఇలా..
ముందుగా నగరపాలక సంస్థల కార్పొరేటర్లు, మునిసిపల్‌ కౌన్సిలర్లతో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. ఫలితాలను వెంటనే ప్రకటిస్తారు. మేయర్, చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించేందుకు కనీసం 50 శాతం సభ్యుల హాజరును కోరంగా పరిగణిస్తారు. కోరం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ప్రిసైడింగ్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. వారి ఆధ్వర్యంలో ఆయా సంస్థల సమావేశ మందిరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్, జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఒక్కొక్క పోస్టుకే నేడు ఎన్నికలు
ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా నగరపాలక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో ఇద్దరు వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్డినెన్స్‌ రూపొందించి గవర్నర్‌ ఆమోదానికి పంపించింది. ఈ లోగా ఒక్కొక్క మేయర్, ఒక్కొక్క వైస్‌ చైర్‌పర్సన్‌ నియామకానికి గురువారం ఎన్నిక నిర్వహిస్తారు.   ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభించింన తరువాత మరో డిప్యూటీ మేయర్, మరో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అనంతరమే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement