ఆస్తిపన్ను చెల్లించకుంటే సౌకర్యాలు కట్
వసూలులో విఫలమైన సిబ్బందిపై చర్యలు
గ్రామాల్లో ప్రత్యేక బృందాల నియూమకం
కలెక్టర్ నీతూప్రసాద్
ముకరంపుర : మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లోని ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. ఆస్తిపన్ను చెల్లించని వారికి ప్రభుత్వపరంగా అందే సౌకర్యాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. అలాగే నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆస్తిపన్ను వసూలులో విఫలమైన గ్రామకార్యదర్శులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆమె ఆస్తిపన్ను వసూలుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఆస్తిపన్నే ప్రధాన ఆధారమన్నారు. పన్ను వసూలు కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కార్యదర్శి, సాక్షరభారత కో ఆర్డినేటర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్వయం సహాయక బృందం గ్రామ కో ఆర్డినేటర్, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు ఉంటారన్నారు.
రాష్ట్రంలో ఆస్తిపన్ను వసూలులో మనజిల్లా 52 శాతంతో 2వ స్థానంలో ఉందన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోపల 80 శాతం పన్ను వసూలు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. రైస్‌మిల్లర్స్, గిడ్డంగులు తదితర వ్యాపార సముదాయాలు తమ ఆస్తిపన్నును వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు ట్రాన్స్‌కో కూడా ఆస్తిపన్ను చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో 50 శాతం కంటే తక్కువ పన్ను వసూలు చేసిన మండలాలు ఎల్కతుర్తి, గంగాధర, జమ్మికుంట, కమలాపూర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్, శంకరపట్నంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్లు ఏర్పడకుండా గ్రామకార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములలో భవనాలు నిర్మించకుండా చూడాలన్నారు. గ్రామకార్యదర్శుల నిర్లక్ష్యంతో అనేక ఫిర్యాదులు కలెక్టర్ కార్యాలయానికి అందుతున్నాయని, వీటిని చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.