Nituprasad collector
-
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
కలె క్టర్ నీతూప్రసాద్ కరీంనగర్: జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా ముందస్తు చర్య లు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలి పారు. వివిధ శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు పడగానే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. వారంపాటు అన్ని గ్రామపంచాయతీలు, పట్టణాల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాధులు రాకుండా గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, రెవెన్యూ అధికారులు, ఆశావర్కర్లు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌శాఖ వారోత్సవాలపై షెడ్యూల్ విడుదల చేస్తారని అన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.5వేలు కేటాయించనున్నామని, వీటితో బ్లీచింగ్ పౌడర్, స్ప్రేలు కొనుగోలు చేసుకోవాలని అన్నారు. అన్ని మురికి కాలువలు, మంచినీటి ట్యాంకర్లను శుభ్రపరుస్తారని అన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని అన్నారు. సాధారణంగా వచ్చే వ్యాధులకు సంబంధించిన మందులను అన్ని వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యాధులు ప్రబలే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఆమె వివరించారు. 108లు అందుబాటులో ఉండాలి 108 అంబులెన్స్‌లో అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 32 అంబులెన్సులు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్‌కాల్ రాగానే వెంటనే స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులకు పంపినట్లు తెలిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించి వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని అన్నారు. గర్భిణులు నెలసరి పరీక్షలకు 108 సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి రాజేశం, సీపీవో సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, ఐసీడీఎస్ పీడీ వసంత, 108 రీజినల్ మేనేజర్ భవిత, జిల్లా కోఆర్డినేటర్ జితేందర్, ప్రభాకర్ పాల్గొన్నారు. -
రంజాన్ పండుగకు ఏర్పాట్లు
కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : జిల్లాలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో రంజాన్ ఏర్పాట్లపై అధికారులు, మత పెద్దలతో చర్చించారు. పండుగ సందర్భంగా మజీద్, ఈద్గా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచనున్నట్లు తెలిపారు. పట్టణప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామీ ణ ప్రాంతాల్లో పంచాయతీ అధికారులు శానిటేషన్ పనులు చేపట్టాలని ఆదేశిం చారు. మజీద్ఈద్గాల వద్ద లైటింగ్ ఏర్పా ట్లు చేస్తామన్నారు. తాగునీటికి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తగినంత బ్లీచింగ్ పౌడర్‌ను కొనుగోలు చేసుకోవాలని పంచాయతీ మున్సిపల్ అధికారులను కోరారు. నమాజు చేసే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఆదేశించారు. ఎస్పీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి చర్యలు చేపడతామని చెప్పారు. మజీదుల వద్ద నమాజ్ సమయంలో వాహనాల తనిఖీలు లేకుండా చేస్తామన్నారు. కొత్తవారికి అవకాశం కల్పించి పీస్ కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. కరీంనగర్ డీఎస్పీ రామారావు, నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాం క, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, ఆర్డీవోలు, మతపెద్దలు అక్బర్ హుస్సేన్, వహాజుద్దీన్, అబ్బాస్‌షమీ, మునీర్, మోసిన్, నయీమ్, సిరాజ్ హుస్సే న్, ముజాహిద్ హుస్సేన్, కమ్రొద్దీన్, అస్మత్ బేగ్, అఖిత్, వాజీద్ పాల్గొన్నారు. బడిబాటను విజయవంతం చేయాలి ముకరంపుర : రాష్ట్రవ్యాప్తంగా 3వ తేదీ నుంచి బడిబాటను చేపట్టినట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరిచామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యావాలంటీర్లను నియమించుకోవడానికి కలెక్టర్లకు అధికారాలనిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాటను విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని తెలిపారు. మిషన్‌మోడ్‌లో ఐఎస్ఎల్ పూర్తి చేయాలి అన్ని మున్సిపాలిటీలు, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో మిషన్‌మోడ్‌లో పని చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్యాంపను కార్యాలయంలో కమిషనర్లతో సమీక్షించారు. అన్ని శాఖల సిబ్బందిని వినియోగించుకుని వారం రోజులలోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో డిసెంబర్ నాటికి ఐఎస్ఎల్ వంద శాతం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్ తదితరులున్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణాలకు యునిసెఫ్ సాయం
కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : జిల్లాలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి యునిసెఫ్ సహాయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై యునిసెఫ్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ యునిసెఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ప్రచారం కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించి పంపాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సూర్యప్రకాశ్‌రావు, యునిసెఫ్ స్టేట్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డెప్యూటీ ఈఈ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ వేగవంతం అనంతగిరి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయుటకు భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. అనంతరగిరి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.6లక్షలుగా ధర నిర్ణయించినట్లు తెలిపారు. వీటికి అదనంగా రైతుల భూములలో బోర్లు, బావులు, పైపులైన్లు, తోటలుంటే వేరుగా ధర చెల్లిస్తారన్నారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ పరిధిలో రెండోసారి భూములు కోల్పోతున్న రైతులకు మెట్ట భూములకు ఎకరాకు రూ.6లక్షలు, తరి భూములకు ఎకరాకు రూ.6.5లక్షలుగా ధర నిర్ణయించినట్లు చెప్పారు. స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు చంద్రశేఖర్, భిక్షానాయక్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శంకర్, నటరాజ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గడువులోగా టైటిల్‌డీడ్ జారీ చేయకుంటే షోకాజ్ నోటీసులు రైతులకు గడువులోగా టైటిల్డీడ్లు జారీ చేయకుంటే షోకాజ్ నోటీస్‌లు జారీ చేస్తామని తహసీల్దార్లను కలెక్టర్ నీతూప్రసాద్ హెచ్చరించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించారు. శంకరపట్నం నుంచి గంగారెడ్డి మాట్లాడుతూ 6 నెలల క్రితం మీసేవలో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా టైటీల్డీడ్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయగా.. దరఖాస్తులో వివరాలు సమర్పించకుంటే మెమో ద్వారా తెలుపుతామన్నారు.ఇలా పలువురి సమస్యలకు పరిష్కారం చూపారు. కమిషనర్ కృష్ణభాస్కర్, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, డ్వామా పీడీ గణేశ్, ఆర్డీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
బోరు రీచార్జి గుంతలు అభినందనీయం
► కలెక్టర్ నీతూప్రసాద్ ► భూగర్భ జలాల పెంపునకు కృషి చేయూలి ► నాబార్డు వాటర్ షెడ్డ్ పనులు పరిశీలన హుస్నాబాద్‌రూరల్: వర్షపు నీరు వృథా పోకుండా భూమిలోకి మళ్లించి భూగర్భజలాల పెంపునకు కృషి చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేట పంచాయతీ పరిధిలోని నాబార్డు సహకారంతో సతతహరిత, సహాయ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్డు పథకం పనులను శుక్రవారం పరిశీలించారు. గొల్లకుంటలో సహాయ ఎన్జీవో ఆధ్వర్యంలో చేపడుతున్న బోరువెల్ రీచార్జి గుంతల గురించి నాబార్డు ఏజీఎం రవిబాబు కలెక్టర్‌కు వివరించారు. రైతు శ్రీనివాస్‌ను మాట్లాడుతూ బోరు రీచార్జి గుంత తవ్వడం ద్వారా వర్షంపడ్డ తర్వాత అదనంగా 20 నిమిషాలు నీళ్లు పోసిందని చెప్పారు. వ్యవసాయభూముల్లో ఉపాధిహామీ పథకం ద్వారా నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవాలని రైతులకు సూచించారు. నీటికుంటల్లో నీరు ఉంటే సమీపంలోని అరకిలోమీటర్ వరకు భూమిలో తేమ ఉంటుందని తెలిపారు. జిల్లాలో 3 వేల వరకు నీటికుంటలు మంజూరు చేసినట్లు చెప్పారు. పత్తికి ప్రత్యామ్నాయం సాగు చేయూలి పత్తి పంటలు కాకుండా ప్రత్యామ్నాయంగా కూరగాయలు, మొక్కజొన్న, సోయూబీన్ సాగు చేసేలా చూడాలని ఎన్జీవోలను కోరారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే విత్తనాల గురించి వివరించాలన్నారు. జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ మెట్ట ప్రాంతమని, 700 ఫీట్ల వరకు బోర్లు వేసిన చుక్క నీరు రావడం లేదని, ఈ ప్రాంత అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎంపీపీ భూక్య మంగ మాట్లాడుతు అక్కన్నపేటను మండలం చేయాలని కోరారు. అనంతరం రూ.25లక్షల రుణమంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సర్పంచ్ జాగిరి వసంత, టీజీబీ ఆర్ఎం రవీందర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్, ఏడీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జి.రాంరెడ్డి,తహసీల్దార్ టి.వాణి, వ్యవసాయశాఖ ఏడీఏ మహేశ్, పశువైద్యులు విజయ్‌భార్గవ్, ఏవో శ్రీనివాస్, ఎంపీటీసీ బండి సమ్మయ్య, వాటర్‌షెడ్డు పథకం చైర్మన్ సూరం సమ్మిరెడ్డి, కట్కూర్ సర్పంచ్ రాంచంద్రం, భీమదేవరపల్లి వైస్ ఎంపీపీ మనోహర, సహాయ ఎన్జీవో సీఈవో రాజ్కమాల్రెడ్డి,జనవికాస ఎన్ జీవో అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌రావు, సంపత్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు కర్ణకంటి శ్రీశైలం, కంది రాంరెడ్డి పాల్గొన్నారు. -
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి
కలెక్టర్ నీతూ ప్రసాద్ జగిత్యాల అర్బన్ : ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి అని, ప్రతిఒక్కరూ ముందుకొచ్చి నిర్మించుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం జగిత్యాలలోని పొన్నాల గార్డెన్స్‌లో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సంపూర్ణ అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యూరు. మరుగుదొడ్ల ఆవశ్యకతను అధికారులు ప్రజలకు వివరించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 75 శాతం పూర్తయ్యూయని, మిగిలినవారూ త్వరంగా నిర్మించుకోవాలని సూచించారు. పనులు ప్రారంభించిన వెంటనే సంబంధిత ఎంపీడీవోను కలిసి ఫొటోలను ఆన్లైన్ చేయించుకోవాలని, పరిశీలించి బిల్లులు అందిస్తారని వివరించారు. కరీంనగర్‌ను స్వచ్ఛజిల్లాగా చేసేందుకు అధికారులందరూ కలిసికట్టుగా కృషి చేయూలని కోరారు. అలాగే కరువు నివారణకు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. 100 శాతం పూర్తి చేయాలి : జెడ్పీచైర్‌పర్సన్ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలను వందశాతం పూర్తిచేసేలా అధికారులు కృషి చేయాలని జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పూర్తిస్థాయి నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంకుడుగుంతలతో నీటి ఎద్దడి నివారణకు చెక్ పెట్టవచ్చన్నారు. అలాగే సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే మరుగుదొడ్ల నిర్మాణం సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించే సహాయంతో నిమిత్తం లేకుండా ప్రజలు తామంతట తామే ముందుకురావాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో నేటికీ స్నానపుగదులు లేక చీరలు, తడకలు అడ్డుపెట్టుకుని మహిళలు స్నానం చేస్తున్నారని, అలాంటి కుటుంబాలకు ఉపాధి పథకం కింద నిధులు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఇంకుడుగుంతలను నీటి ప్రవాహం వచ్చే చోట నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ శశాంక, పీడీ అరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ, జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల జెడ్పీటీసీలు పెండెం నాగలక్ష్మీ, గోపి మాధవి, సరళ, ఎంపీపీలు, ఎంపీటీసీలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
ఇంత అమానుషమా..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శిశుగృహ చిన్నారుల చేతులపై సిబ్బంది వాతలు పెట్టిన వైనంపై కలెక్టర్ నీతూప్రసాద్ మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించిన కలెక్టర్ చిన్నారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈనెల 15న శిశుగృహలోని ఆయాలు స్టవ్ వెలిగించి చెంచాలను వేడి చేసి అన్నం తింటున్న ఏడుగురు చిన్నారుల చేతులపై వాతలు పెట్టిన దృశ్యాలను సీసీ పుటేజీ ద్వారా పరిశీలించి చలించిపోయారు. ఈ దారుణం జరిగి ఐదురోజులైనా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు. ఈ విషయంపై పీడీ మోహన్‌రెడ్డి 17న ఫైలు పంపానంటూ నీళ్లు నమలడంతో వెంటనే ఫైలు తెప్పించి చూడగా 19న ఫైలు పంపినట్లుగా ఉంది. దీంతో అబద్ధాలెందుకు చెబుతున్నావంటూ మోహన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన ఆయాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. బాధ్యులైన ముగ్గురు ఆయాలకు మెమో ఇచ్చానని మోహన్‌రెడ్డి బదులిచ్చారు. అయితే ఆయాలు శుక్రవారం రాత్రి వరకు విధులు నిర్వహించిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్... మోహన్‌రెడ్డి తీరును తప్పుపట్టారు. తక్షణమే ఆ ముగ్గురు ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసుపెట్టి అరెస్టు చేయాలంటూ అధికారులను, పోలీసులను ఆదేశించారు. శిశుగృహ మేనేజర్ దేవారావు, ఇతర సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తున్నందున వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఆయనను విధుల నుంచి తప్పించి హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తున్నట్లు తెలిపారు. స్పందించిన బాలల హక్కుల కమిషన్ మరోవైపు శిశుగృహలో జరిగిన ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు సీరియస్‌గా పరిగణిస్తూ కేసును సుమోటోగా స్వీకరించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి మే 2లోగా నివేదిక పంపాలని కలెక్టర్‌కు నోటీసు పంపారు. శిశుగృహలో పిల్లల సంరక్షణ విషయంలో అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి భవానీచంద్ర సైతం బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. పట్టించిన సీసీ కెమెరాలు శిశుగృహలోని గదుల్లో ప్రభుత్వం గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఆయాల దురాగతం బయటపడింది. ఈనెల 15న సా యంత్రం చిన్నారుల చేతులపై ఆయాలు వాత లు పెట్టిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయినప్పటికీ ఐదు రోజులపాటు ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఐసీడీఎస్ అధికారులు గోప్యంగా ఉంచడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 16న సాయంత్రం సామాజిక కార్యకర్త శ్రీలత జరిగిన విషయాన్ని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఆయన ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. కనీసం కలెక్టర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆయాలు శుక్రవారం రాత్రి వరకు డ్యూటీలోనే ఉండటం గమనార్హం. ఈ విషయం వెలుగులోకి వచ్చాక పోలీసులతోపాటు ఆర్డీవో చంద్రశేఖర్ పలువురు అధికారులు వచ్చి విచారణ జరుపుతుండటంతో ఆయాలు అక్కడినుంచి పరారైనట్లు శిశుగృహ సిబ్బంది చెబుతున్నారు. -
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
డీవైసీలో కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ స్పందించి నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ బోర్లు, బావులను అద్దెకు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి వెంకటేశం మాట్లాడుతూ గురుకుల పాఠశాల బోరులో నీరుందని, 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటున్న నేపథ్యంలో 7, 8 వార్డులకు తాగునీరు అందించేందుకు అనుమతించాలని కోరారు. గ్రామానికి వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిగురుమామిడి మండలం సుందరగిరి నుంచి రాజయ్య మాట్లాడుతూ రెండోవార్డులో బోరు ఎండిపోయిందని, తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని, బోర్లు లోతు చేయించాలని కోరారు. బోరును ఫ్లషింగ్ చేయించాలని ఎంపీడీవోను ఆదేశించారు. వేములవాడ నుంచి రాజేశ్ మాట్లాడుతూ లే అవుట్లు లేకుండా ప్లాట్లు చేసి అమ్ముతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలుపగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేసీ పౌసుమి బసు, నగరపాలక కమిషనర్ కృష్ణబాస్కర్, డీఆర్వో వీరబ్రహ్మయ్య, జడ్పీ సీఈవో సూరజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛభారత్‌లో జిల్లాకు ప్రశంస
ఢిల్లీ సదస్సులో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ కరీంనగర్ సిటీ : స్వచ్ఛభారత్‌లో రాష్ట్రంలోనే ఉత్తమ ప్రతిభ కనపరిచిన కరీంనగర్ జిల్లాకు ఢిల్లీ సదస్సులో ప్రశంస లభించింది. స్వచ్ఛభారత్ మిషన్ రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఐఐపీఈ, తాగునీటి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 32 జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. జిల్లానుంచి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్ హాజరయ్యారు. ఇతర జిల్లాలతో పోల్చితే సత్వర ఫలితాలు సాధించిన కరీంనగర్ జిల్లాకు సదస్సులో ప్రశంసలు లభించాయి. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మంచి ఫలితాలు సాధించాయని, త్వరలో మిగిలిన పది నియోజకవర్గాల్లోనూ పూర్తిస్థాయి మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతామని చైర్పర్సన్ తుల ఉమ వివరించారు. స్వచ్ఛభారత్ అమలులో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ కృషిని తెలియచేశారు. -
భూసేకరణకు రైతులు సహకరించాలి
ముకరంపుర : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, రైతులతో భూముల ధరల నిర్ణయంపై సమావేశం నిర్వహించారు. 123 జీవో ప్రకారం రైతులకు నష్టం జరగకుండా రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుని ధర నిర్ణయిస్తామన్నారు. నిర్ణయించిన ధరకు రైతులు భూములిచ్చి సహకరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దనే అధికారులు చెక్కులు అందజేస్తారన్నారు. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్, వేములవాడ, కరీంనగర్ మండలం ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల గ్రామాల్లోని భూములకు ధర నిర్ణయించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెగ్యాం గ్రామంలో పెండింగ్‌లో ఉన్న కట్టడాలకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్, జూలై వరకు ప్రాజెక్టుల్లో నీరు నిలుస్తుందని, పరిహారం చెల్లిస్తే నిర్వాసితులు త్వరగా ఇళ్లు నిర్మించుకుంటారని తెలిపారు. రుద్రారం పునరావాస కాలనీలో త్రీ ఫేజ్లైన్ ఏర్పాటు చేయాలని, పునరావాస కాలనీలలో మిగిలి ఉన్న ప్లాట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, చింతల్‌ఠాణా నిర్వాసితులకు పునరావాస కాలనీలో ప్లాట్లు కేటాయించి, కాలనీలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు. స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రిజిస్ట్రార్ రమణారావు, కరీంనగర్, సిరిసిల్ల, ఆర్డీవోలు చంద్రశేఖర్, భిక్షానాయక్, నారాయణరెడ్డి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్, శంకర్, నటరాజ్ పాల్గొన్నారు. -
చితక్కొట్టారు!
ఫైనాన్స కిస్తీ కట్టలేదని దారుణం ► ఆటోడ్రైవర్ కాలు చేయి విరగ్గొట్టిన రిటైర్డ ఏఎస్సై ► కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ► కలెక్టర్ నీతూప్రసాద్ పర్యటనలో వెలుగుచూసిన దారుణం ► ఫిర్యాదు రాలేదన్న రూరల్ పోలీసులు కరీంనగర్ హెల్త్/కరీంనగర్ క్రైం : గతంలో ఆయనో పోలీసు అధికారి. ఉద్యోగ విరమణ చేసినా పోలీసు పవర్ తగ్గలేదు. ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని ఓ ఆటోడ్రైవర్‌పై తన ప్రతాపం చూపించాడు. కాళ్లు చేతులు విరగ్గొట్టి ఆస్పత్రి పాలుచేశాడు. కలెక్టర్ నీతూప్రసాద్ సోమవారం ప్రభుత్వాస్పత్రిని ఆకస్మింగా తనిఖీ చేసిన సందర్భంగా ఈ దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రిని తనిఖీ చేస్తూ 13 వార్డులోని 7వ నంబరు బెడ్‌పై చికిత్స పొందుతున్న బాధితుడిని కలెక్టర్ పలకరించారు. ఏమైందని, వైద్యసేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా... బాధితుడు తనపై జరిగిన దాడి గురించి వెల్లడించాడు. గోదావరిఖనికి చెందిన నేదూరి కుమార్, వనజ దంపతులు. వీరు జీవనోపాధి కోసం కరీంనగర్‌కు వచ్చి ఆర్టీసీ వర్క్‌షాపు వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కుమార్ నగరంలోని ఓ ఫైనాన్స్‌లో అప్పు తీసుకుని ఆటో కొనుగోలు చేసి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైనాన్స్ కిస్తీ సకాలంలో చెల్లించలేకపోయూడు. దీంతో ఈ నెల 11వ తేదీన ఓ రిటైర్డ్ ఏఎస్సైతో పాటు మరికొంతమంది కుమార్ ఇంటికి వచ్చి డబ్బుల కోసం నిలదీశారు. మాట్లాడుకుందామంటూ బయటకు తీసుకెళ్లి నగునూర్ సమీపంలో చితక్కొట్టారు. ఈ దాడిలో కుమార్‌కు ఒక కాలు, ఒక చేయి విరిగింది. అనంతరం రిటైర్డ్ ఏఎస్సై బాధితుడిని తీసుకుని వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో వేసి వెళ్లిపోయూడని తెలిపాడు. అతడి గోడు విన్న కలెక్టర్ చలించిపోయూరు. వెంటనే ఎస్పీతో మాట్లాడి కేసు వివరాలు కనుక్కుంటానని అన్నారు. ఫైనాన్స్‌లో అప్పు చెల్లించేలా చర్యలు తీసుకుంటానని, మంగళవారం తన కార్యాలయానికి వచ్చి కలువాలని వనజకు సూచించారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. కుమార్‌పై దాడి విషయమై కరీంనగర్ రూరల్ పోలీసులను సంప్రదించగా... తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. కుమార్ దంపతులు మాత్రం తాము పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దాడి చేసింది రిటైర్డ్ ఏఎస్సై కావడంతో పోలీసులు తమ ఫిర్యాదును పక్కన పడేశారని ఆరోపించారు. -
ఆస్తిపన్ను చెల్లించకుంటే సౌకర్యాలు కట్
వసూలులో విఫలమైన సిబ్బందిపై చర్యలు గ్రామాల్లో ప్రత్యేక బృందాల నియూమకం కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లోని ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. ఆస్తిపన్ను చెల్లించని వారికి ప్రభుత్వపరంగా అందే సౌకర్యాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. అలాగే నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆస్తిపన్ను వసూలులో విఫలమైన గ్రామకార్యదర్శులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆమె ఆస్తిపన్ను వసూలుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఆస్తిపన్నే ప్రధాన ఆధారమన్నారు. పన్ను వసూలు కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కార్యదర్శి, సాక్షరభారత కో ఆర్డినేటర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్వయం సహాయక బృందం గ్రామ కో ఆర్డినేటర్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఉంటారన్నారు. రాష్ట్రంలో ఆస్తిపన్ను వసూలులో మనజిల్లా 52 శాతంతో 2వ స్థానంలో ఉందన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోపల 80 శాతం పన్ను వసూలు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. రైస్‌మిల్లర్స్, గిడ్డంగులు తదితర వ్యాపార సముదాయాలు తమ ఆస్తిపన్నును వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు ట్రాన్స్‌కో కూడా ఆస్తిపన్ను చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో 50 శాతం కంటే తక్కువ పన్ను వసూలు చేసిన మండలాలు ఎల్కతుర్తి, గంగాధర, జమ్మికుంట, కమలాపూర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్, శంకరపట్నంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్లు ఏర్పడకుండా గ్రామకార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములలో భవనాలు నిర్మించకుండా చూడాలన్నారు. గ్రామకార్యదర్శుల నిర్లక్ష్యంతో అనేక ఫిర్యాదులు కలెక్టర్ కార్యాలయానికి అందుతున్నాయని, వీటిని చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.