ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి
కలెక్టర్ నీతూ ప్రసాద్
జగిత్యాల అర్బన్ : ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి అని, ప్రతిఒక్కరూ ముందుకొచ్చి నిర్మించుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం జగిత్యాలలోని పొన్నాల గార్డెన్స్‌లో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సంపూర్ణ అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యూరు. మరుగుదొడ్ల ఆవశ్యకతను అధికారులు ప్రజలకు వివరించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 75 శాతం పూర్తయ్యూయని, మిగిలినవారూ త్వరంగా నిర్మించుకోవాలని సూచించారు. పనులు ప్రారంభించిన వెంటనే సంబంధిత ఎంపీడీవోను కలిసి ఫొటోలను ఆన్‌లైన్ చేయించుకోవాలని, పరిశీలించి బిల్లులు అందిస్తారని వివరించారు. కరీంనగర్‌ను స్వచ్ఛజిల్లాగా చేసేందుకు అధికారులందరూ కలిసికట్టుగా కృషి చేయూలని కోరారు. అలాగే కరువు నివారణకు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు.
100 శాతం పూర్తి చేయాలి : జెడ్పీచైర్‌పర్సన్
జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలను వందశాతం పూర్తిచేసేలా అధికారులు కృషి చేయాలని జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పూర్తిస్థాయి నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంకుడుగుంతలతో నీటి ఎద్దడి నివారణకు చెక్ పెట్టవచ్చన్నారు. అలాగే సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే
మరుగుదొడ్ల నిర్మాణం సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించే సహాయంతో నిమిత్తం లేకుండా ప్రజలు తామంతట తామే ముందుకురావాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో నేటికీ స్నానపుగదులు లేక చీరలు, తడకలు అడ్డుపెట్టుకుని మహిళలు స్నానం చేస్తున్నారని, అలాంటి కుటుంబాలకు ఉపాధి పథకం కింద నిధులు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఇంకుడుగుంతలను నీటి ప్రవాహం వచ్చే చోట నిర్మించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ శశాంక, పీడీ అరుణశ్రీ, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మీ, జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల జెడ్పీటీసీలు పెండెం నాగలక్ష్మీ, గోపి మాధవి, సరళ, ఎంపీపీలు, ఎంపీటీసీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు.