ఇంత అమానుషమా..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శిశుగృహ చిన్నారుల చేతులపై సిబ్బంది వాతలు పెట్టిన వైనంపై కలెక్టర్ నీతూప్రసాద్ మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించిన కలెక్టర్ చిన్నారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈనెల 15న శిశుగృహలోని ఆయాలు స్టవ్ వెలిగించి చెంచాలను వేడి చేసి అన్నం తింటున్న ఏడుగురు చిన్నారుల చేతులపై వాతలు పెట్టిన దృశ్యాలను సీసీ పుటేజీ ద్వారా పరిశీలించి చలించిపోయారు.
ఈ దారుణం జరిగి ఐదురోజులైనా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు. ఈ విషయంపై పీడీ మోహన్‌రెడ్డి 17న ఫైలు పంపానంటూ నీళ్లు నమలడంతో వెంటనే ఫైలు తెప్పించి చూడగా 19న ఫైలు పంపినట్లుగా ఉంది. దీంతో అబద్ధాలెందుకు చెబుతున్నావంటూ మోహన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన ఆయాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. బాధ్యులైన ముగ్గురు ఆయాలకు మెమో ఇచ్చానని మోహన్‌రెడ్డి బదులిచ్చారు. అయితే ఆయాలు శుక్రవారం రాత్రి వరకు విధులు నిర్వహించిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్... మోహన్‌రెడ్డి తీరును తప్పుపట్టారు.
తక్షణమే ఆ ముగ్గురు ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసుపెట్టి అరెస్టు చేయాలంటూ అధికారులను, పోలీసులను ఆదేశించారు. శిశుగృహ మేనేజర్ దేవారావు, ఇతర సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తున్నందున వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఆయనను విధుల నుంచి తప్పించి హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తున్నట్లు తెలిపారు.
స్పందించిన బాలల హక్కుల కమిషన్
మరోవైపు శిశుగృహలో జరిగిన ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు సీరియస్‌గా పరిగణిస్తూ కేసును సుమోటోగా స్వీకరించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి మే 2లోగా నివేదిక పంపాలని కలెక్టర్‌కు నోటీసు పంపారు. శిశుగృహలో పిల్లల సంరక్షణ విషయంలో అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి భవానీచంద్ర సైతం బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు.
పట్టించిన సీసీ కెమెరాలు
శిశుగృహలోని గదుల్లో ప్రభుత్వం గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఆయాల దురాగతం బయటపడింది. ఈనెల 15న సా యంత్రం చిన్నారుల చేతులపై ఆయాలు వాత లు పెట్టిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయినప్పటికీ ఐదు రోజులపాటు ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఐసీడీఎస్ అధికారులు గోప్యంగా ఉంచడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 16న సాయంత్రం సామాజిక కార్యకర్త శ్రీలత జరిగిన విషయాన్ని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఆయన ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు.
కనీసం కలెక్టర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆయాలు శుక్రవారం రాత్రి వరకు డ్యూటీలోనే ఉండటం గమనార్హం. ఈ విషయం వెలుగులోకి వచ్చాక పోలీసులతోపాటు ఆర్డీవో చంద్రశేఖర్ పలువురు అధికారులు వచ్చి విచారణ జరుపుతుండటంతో ఆయాలు అక్కడినుంచి పరారైనట్లు శిశుగృహ సిబ్బంది చెబుతున్నారు.