చితక్కొట్టారు!
ఫైనాన్‌స కిస్తీ కట్టలేదని దారుణం
► ఆటోడ్రైవర్ కాలు చేయి విరగ్గొట్టిన రిటైర్‌డ ఏఎస్సై
► కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
► కలెక్టర్ నీతూప్రసాద్ పర్యటనలో వెలుగుచూసిన దారుణం
► ఫిర్యాదు రాలేదన్న రూరల్ పోలీసులు
కరీంనగర్ హెల్త్/కరీంనగర్ క్రైం : గతంలో ఆయనో పోలీసు అధికారి. ఉద్యోగ విరమణ చేసినా పోలీసు పవర్ తగ్గలేదు. ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని ఓ ఆటోడ్రైవర్‌పై తన ప్రతాపం చూపించాడు. కాళ్లు చేతులు విరగ్గొట్టి ఆస్పత్రి పాలుచేశాడు. కలెక్టర్ నీతూప్రసాద్ సోమవారం ప్రభుత్వాస్పత్రిని ఆకస్మింగా తనిఖీ చేసిన సందర్భంగా ఈ దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రిని తనిఖీ చేస్తూ 13 వార్డులోని 7వ నంబరు బెడ్‌పై చికిత్స పొందుతున్న బాధితుడిని కలెక్టర్ పలకరించారు. ఏమైందని, వైద్యసేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా... బాధితుడు తనపై జరిగిన దాడి గురించి వెల్లడించాడు. గోదావరిఖనికి చెందిన నేదూరి కుమార్, వనజ దంపతులు. వీరు జీవనోపాధి కోసం కరీంనగర్‌కు వచ్చి ఆర్టీసీ వర్క్‌షాపు వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కుమార్ నగరంలోని ఓ ఫైనాన్స్‌లో అప్పు తీసుకుని ఆటో కొనుగోలు చేసి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైనాన్స్ కిస్తీ సకాలంలో చెల్లించలేకపోయూడు.
దీంతో ఈ నెల 11వ తేదీన ఓ రిటైర్డ్ ఏఎస్సైతో పాటు మరికొంతమంది కుమార్ ఇంటికి వచ్చి డబ్బుల కోసం నిలదీశారు. మాట్లాడుకుందామంటూ బయటకు తీసుకెళ్లి నగునూర్ సమీపంలో చితక్కొట్టారు. ఈ దాడిలో కుమార్‌కు ఒక కాలు, ఒక చేయి విరిగింది. అనంతరం రిటైర్డ్ ఏఎస్సై బాధితుడిని తీసుకుని వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో వేసి వెళ్లిపోయూడని తెలిపాడు. అతడి గోడు విన్న కలెక్టర్ చలించిపోయూరు. వెంటనే ఎస్పీతో మాట్లాడి కేసు వివరాలు కనుక్కుంటానని అన్నారు. ఫైనాన్స్‌లో అప్పు చెల్లించేలా చర్యలు తీసుకుంటానని, మంగళవారం తన కార్యాలయానికి వచ్చి కలువాలని వనజకు సూచించారు.
బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. కుమార్‌పై దాడి విషయమై కరీంనగర్ రూరల్ పోలీసులను సంప్రదించగా... తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. కుమార్ దంపతులు మాత్రం తాము పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దాడి చేసింది రిటైర్డ్ ఏఎస్సై కావడంతో పోలీసులు తమ ఫిర్యాదును పక్కన పడేశారని ఆరోపించారు.