డీవైసీలో కలెక్టర్ నీతూప్రసాద్
ముకరంపుర : ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ స్పందించి నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ బోర్లు, బావులను అద్దెకు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి వెంకటేశం మాట్లాడుతూ గురుకుల పాఠశాల బోరులో నీరుందని, 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటున్న నేపథ్యంలో 7, 8 వార్డులకు తాగునీరు అందించేందుకు అనుమతించాలని కోరారు.
గ్రామానికి వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిగురుమామిడి మండలం సుందరగిరి నుంచి రాజయ్య మాట్లాడుతూ రెండోవార్డులో బోరు ఎండిపోయిందని, తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని, బోర్లు లోతు చేయించాలని కోరారు. బోరును ఫ్లషింగ్ చేయించాలని ఎంపీడీవోను ఆదేశించారు. వేములవాడ నుంచి రాజేశ్ మాట్లాడుతూ లే అవుట్లు లేకుండా ప్లాట్లు చేసి అమ్ముతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలుపగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేసీ పౌసుమి బసు, నగరపాలక కమిషనర్ కృష్ణబాస్కర్, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, జడ్పీ సీఈవో సూరజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.