సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
కలె క్టర్ నీతూప్రసాద్
కరీంనగర్: జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా ముందస్తు చర్య లు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలి పారు. వివిధ శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు పడగానే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. వారంపాటు అన్ని గ్రామపంచాయతీలు, పట్టణాల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాధులు రాకుండా గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, రెవెన్యూ అధికారులు, ఆశావర్కర్లు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌శాఖ వారోత్సవాలపై షెడ్యూల్ విడుదల చేస్తారని అన్నారు.
ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.5వేలు కేటాయించనున్నామని, వీటితో బ్లీచింగ్ పౌడర్, స్ప్రేలు కొనుగోలు చేసుకోవాలని అన్నారు. అన్ని మురికి కాలువలు, మంచినీటి ట్యాంకర్లను శుభ్రపరుస్తారని అన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని అన్నారు. సాధారణంగా వచ్చే వ్యాధులకు సంబంధించిన మందులను అన్ని వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యాధులు ప్రబలే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఆమె వివరించారు.
108లు అందుబాటులో ఉండాలి
108 అంబులెన్స్‌లో అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 32 అంబులెన్సులు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్‌కాల్ రాగానే వెంటనే స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులకు పంపినట్లు తెలిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించి వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని అన్నారు. గర్భిణులు నెలసరి పరీక్షలకు 108 సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి రాజేశం, సీపీవో సుబ్బారావు, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, ఐసీడీఎస్ పీడీ వసంత, 108 రీజినల్ మేనేజర్ భవిత, జిల్లా కోఆర్డినేటర్ జితేందర్, ప్రభాకర్ పాల్గొన్నారు.