అడవి బిడ్డలం ఆదుకోండి
► కూడు, గుడ్డ, చదువు, వైద్యం, నీరు అందని దైన్యం
► ఏళ్లుగా తీరని సమస్యలు
► కనీస వసతులూ కరువు
► నేడు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
► హాజరుకానున్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు
జిల్లా గిరిజనుల అరణ్యరోదన ఎవరూ పట్టించుకోవడం లేదు.. ప్రత్యేకించి వీరి కోసం గిరిజన సమగ్ర అభివృద్ధి సంస్థ ఉన్నప్పటికీ ఆ ఫలాలు ఆదివాసీల దరికి చేరిన దాఖలాలు లేవు. పుట్టకొకరు.. చెట్టుకొకరు అన్న చందంగా ఉన్న తండాల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. విద్య, వైద్యం సకాలంలో అందని పరిస్థితి. ఏటా గిరిజనుల అభివృద్ధికి రూ.లక్షలాదిగా విడుదల అవుతున్నా అవి ఎక్కడికి పోతున్నాయో కూడా ఎవరికీ తెలియదు. కాలంతో సంబంధం లేకుండా వ్యాధులు.. వేసవి వచ్చిందంటే దప్పిక తీర్చుకోలేనంత నీటి కరువు.. ఇలా నిత్యం ఆ గిరి బిడ్డలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. పది నెలల తర్వాత మరోసారి నిర్వహిస్తున్న ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలోనైనా గిరిజనుల సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉంది..!
కాగితాల్లోనే.. అభివృద్ధి
ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ద్వారా గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ వాటి ఫలాలు పూర్తిస్తాయిలో అందడంలేదు. ఈ విభాగంలో ప్రస్తుతం అర్టికల్ (275), నాబార్డ్ రోడ్లు, భవనాలు, రాష్ట్రీయ సమ వికాస్ యోజన, రూపాంతర్, ఉపాధిహామీ, ఐఏపీ(నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు), ఎన్ఆర్హెచ్ఎం, 13వ ప్రణాళిక, సీఎస్ఎస్, ఆర్వీఎం, ఆర్సీసీ-1 తదితర పథకాల ద్వారా వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించినా వాటి ఫలాలు పూర్తిగా గిరిజనులకు అందడం లేదు. ఇంజినీరింగ్ విభాగం ద్వారా వేసిన రోడ్లు చాలావరకు నాసిరకంగా ఉండటంతో గిరిజనులు మండిపడుతున్నారు.
హక్కు పత్రాలు.. కలే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయూంలో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అటవీ హక్కుల చట్టం బాగున్నా అధికారుల తీరుతో ఆశించిన ఫలితాలు రాలేదు. గిరిజనులు నేటికీ అటవీ సాగు భూములపై హక్కు పత్రాల కోసం ఐటీడీఏ చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. చట్టం అమలు నాటి నుంచి 37,372 మంది అర్హులైన గిరిజన లబ్ధిదారులను గుర్తించి 4,06,315.49 ఎకరాల అటవీ భూములు పంపిణీకి గుర్తించారు. దాదాపు పదేళ్లు గడుస్తున్నా అడవి బిడ్డలకు పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు అందించడంలో ఐటీడీఏ పూర్తిగా విఫలమైంది. సోమవారం వచ్చిందంటే పదుల సంఖ్యలో గిరిజనులు హక్కు పత్రాల కోసం ఐటీడీఏ నిర్వహించే దర్బార్‌కు వస్తున్న వారికి పూర్తిస్థాయిలో లాభం చేకూరడం లేదు.
ఏటా.. నీటి కష్టాలే
ఏజెన్సీలో కాలంతో సంబంధం లేకుండా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నారుు. వాగులు, వంకలు, చెలిమల్లో కలుషిత నీరు తాగుతూ అతిసార లాంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఏజెన్సీ వాసుల తాగు నీటి సమస్యలు తీర్చడానికి ఏర్పాటు చేస్తున్న నీటి పథకాలు ఆశించిన ఫలాతాలు ఇవ్వడంలేదు. రెండు రూపాయాలకే గిరిజనులకు 20 లీటర్ల సురక్షిత నీరు అందిస్తామని వాటర్ హెల్త్ ఇండియా, మండల సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో 2008లో నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు), జైనూర్ మండలాల్లో రూ. 96 లక్షల 75 వేల ఖర్చుతో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాలు మూతపడ్డాయి. కొమురం భీం ప్రాజెక్టు నుంచి పలు గ్రామాలకు నీరు అందించడానికి రూ.78 కోట్లతో ప్రారంభించిన పనులు నిలిచిపోయూరుు. ఆర్వో ప్లాంట్లు పూర్తిస్థాయిలో ప్రారంభానికి నోచుకోకుండానే మరుగునపడ్డాయి. ఈ వేసవిలో ఏజెన్సీలోని ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు), జైనూర్, కెరమెరి మండలాల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ఐటీడీఏ రూ.3.97 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపినా ఇంకా నిధులు రాలేదు.
గిరిజన వర్సిటీపై.. స్పష్టతేది?
2008లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార యంత్రాగం ఆదివాసీలకు కేంద్ర స్థానమైన ఉట్నూర్‌లో ప్రభుత్వానికి చెందిన 470 ఎకరాల పరం పోగు భూమిలో 300 ఎకరాలు, తదితర సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించారు. నాటి నుంచి యూనివర్సిటీ జిల్లాకు వస్తుందని గిరిజనులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన యూనివర్సిటీ వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో గిరిజనులు ఆందోళన బాట పట్టారు.