Property tax payment
-
అనుమతిలేని ఇళ్లకు అదనపు పన్ను
సాక్షి, మిర్యాలగూడ: మున్సిపాలిటీలలో అనుమతి లేని నివాసాలపై ప్రభుత్వం కొరడా ఝులిపించనుంది. మున్సిపల్ అనుమతులు లేకుండా నివాసాలు నిర్మించుకున్న వారికి అదనపు పన్ను రూపంలో ఆస్తిపన్ను పెంచారు. అనుమతి ఉన్న భవనాలలో అనుమతికి మించి అదనపు గదులు గానీ, అంతస్తులు గానీ నిర్మించినా అదనపు పన్ను చెల్లించాల్సిందే. 2019–20వ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ అదనపు పన్నును అమలు చేయనున్నారు. నివాసాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించిన సంవత్సరాల ఆధారంగా ఆస్తి పన్నులో 10 శాతం నుంచి వందశాతం వరకు పెంచారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి రూపాయల ఆస్తిపన్ను చెల్లించే వారికి ఇకనుంచి రెండు వేల రూపాయల బిల్లు వస్తుంది. అంతా ఆన్లైన్లోనే జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ పాత మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా చిట్యాల, చండూరు, హాలియా, నందికొండను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలలో నివాసాలు, కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర నివాస సముదాయాలను గత ఏడాది ఆన్లైన్లో జియో ట్యాగింగ్ చేశారు. నిర్మాణాల విస్తీర్ణం, భవన అంతస్తులు, ఇతర నిర్మాణాలు పూర్తిగా ఆన్లైన్లో నమోదయ్యాయి. దీంతో అనుమతి తీసుకున్న సమయంలో ఇంటి నిర్మాణం ఎన్ని అంతస్తులు, ప్రస్తుతం ఎన్ని అంతస్తులు ఉందనే విషయంతో పాటు నిర్మాణానికి అనుమతి ఉందా? లేదా? అనేది కూడా గూగుల్‌లో అధికారులు చూసే అవకాశం ఉంది. దాని ఆధారంగా ఆన్లైన్లోనే ఆస్తిపన్ను ఎంత చెల్లించాలనే వివరాలు కూడా వస్తాయి. ఆన్లైన్లో వచ్చిన ఆస్తి పన్నును ఇంటి యజమాని పూర్తిగా చెల్లించాల్సిందే. ఇంటి నిర్మాణం, విస్తీర్ణం, అంతస్తుల ఆధారంగా ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తిపన్నుపై అదనంగా 10 నుంచి వందశాతం వరకు పెంచారు. మిర్యాలగూడలో ఇదీ పరిస్థితి: మిర్యాలగూడ మున్సిపాలిటీలో నివాసాలు 19,318 ఉన్నాయి. కమర్షియల్ భవనాలు 1941, కమర్షియల్‌తో పాటు నివాసాలు ఉన్నవి 452 మొత్తం 21,711 భవనాలు ఉన్నాయి. వాటికి గాను 6.82 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉంది. దీంతోపాటు పాత బకాయిలు 8.26 లక్షల రూపాయలు ఉండగా మొత్తం 6.90 కోట్ల రూపాయల ఆస్తి పన్నును వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 1.88 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ఇంకా 5.02 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలకు సంబంధించి పాత బకాయిలతో పాటు 1.51 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ఆన్లైన్లోనే బిల్లు వస్తుంది.. చెల్లించాల్సిందే.. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గతంలో అనుమతి లేకుండా నిర్మించుకున్న భవనాలకు అదనంగా పన్ను చెల్లించాల్సిందే. ఆన్లైన్లో ఇంటి నిర్మాణానికి అనుమతి ఉందా? లేదా? అనే విషయం కూడా ఉంది. 10 శాతం నుంచి వంద శాతం వరకు అదనపు పన్ను వస్తుంది. అనుమతి ఉండి కూడా అదనపు పన్ను వస్తే పత్రాలతో మున్సిపాలిటీకి వస్తే పరిశీలిస్తాం. ఆన్లైన్లోనే బిల్లులు వస్తున్నందున చెల్లించాల్సిందే. – కళ్యాణి, రెవెన్యూ అధికారి, మిర్యాలగూడ మున్సిపాలిటీ -
ఆస్తి పన్నుకు ససేమిరా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆస్తి పన్ను చెల్లింపులో ప్రభుత్వ సంస్థలు మొండికేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు రెండూ కర్నూలు కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఆ ప్రభావం కాస్తా అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. ఆస్తి పన్ను చెల్లించాల్సిన ప్రభుత్వ సంస్థల్లో.. కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళిక శాఖ అధికారి కార్యాలయంతో పాటు ట్రెజరీ, పౌర సరఫరాల శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తంలో కోటి మాత్రమే చెల్లించగా.. మరో రూ.14 కోట్ల ఆస్తి పన్ను వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం వసూలుకు కార్పొరేషన్ అధికారులు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోతోంది. ఏళ్ల తరబడి బకాయిలే.. వాస్తవానికి ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఎప్పటికప్పుడు ఆస్తి పన్ను చెల్లించాలి. ప్రైవేటు సంస్థలు చెల్లించకపోతే వెంటనే నీటి కనెక్షన్ తీసివేయడం చేస్తున్న కార్పొరేషన్ అధికారులు.. ప్రభుత్వ కార్యాలయాల విషయానికి వచ్చేసరికి ఏమీ చేయలేకపోతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను మొత్తం రూ.14.99 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం కోటి 8 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.13.91 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. అంటే నిర్ణీత లక్ష్యంలో 7.22 శాతం మాత్రమే ఆస్తి పన్నులు చెల్లించడం గమనార్హం. ఇందులోనూ 2015-16 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను మాత్రమే కాకుండా.. ఏళ్ల తరబడి చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు కూడా పేరుకుపోయాయి. కార్పొరేషన్ అధికారులు ఏమీ చేయలేరనే దాంతో పాటు.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం కూడా ఆస్తి పన్ను చెల్లించలేకపోవడానికి కారణంగా తెలుస్తోంది. అన్ని శాఖలదీ ఇదే తీరే.. కర్నూలు కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను బకాయిపడ్డ ప్రభుత్వ శాఖల్లో అన్నిరకాల కార్యాలయాలూ ఉన్నాయి. జిల్లాకు పరిపాలనలో గుండెకాయ లాంటి కలెక్టరేట్లోని ట్రెజరీ విభాగం, ప్రణాళిక కార్యాలయంతో పాటు ఐసీడీఎస్ కార్యాలయం, వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ ఆ జాబితాలోనివే. అదేవిధంగా ఏపీ డెయిరీ డెవలప్మెంట్ డిపార్టుమెంటు, వయోజన విద్యతో పాటు స్వయంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కూడా ఆస్తి పన్ను చెల్లించని జాబితాలో ఉంది. ఇక ఎక్సైజ్‌శాఖ, జల మండలి కార్యాలయాలదీ ఇదే తీరు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వేకు చెందిన పలు కార్యాలయాలతో పాటు పోస్టల్‌శాఖ కార్యాలయం కూడా ఆస్తి పన్ను బకాయిదారుల జాబితాలో ఉన్నాయి. వీటి నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో.. దీని ప్రభావం కార్పొరేషన్‌లోని అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆస్తిపన్ను చెల్లించకుంటే సౌకర్యాలు కట్
వసూలులో విఫలమైన సిబ్బందిపై చర్యలు గ్రామాల్లో ప్రత్యేక బృందాల నియూమకం కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లోని ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. ఆస్తిపన్ను చెల్లించని వారికి ప్రభుత్వపరంగా అందే సౌకర్యాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. అలాగే నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆస్తిపన్ను వసూలులో విఫలమైన గ్రామకార్యదర్శులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆమె ఆస్తిపన్ను వసూలుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఆస్తిపన్నే ప్రధాన ఆధారమన్నారు. పన్ను వసూలు కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కార్యదర్శి, సాక్షరభారత కో ఆర్డినేటర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్వయం సహాయక బృందం గ్రామ కో ఆర్డినేటర్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఉంటారన్నారు. రాష్ట్రంలో ఆస్తిపన్ను వసూలులో మనజిల్లా 52 శాతంతో 2వ స్థానంలో ఉందన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోపల 80 శాతం పన్ను వసూలు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. రైస్‌మిల్లర్స్, గిడ్డంగులు తదితర వ్యాపార సముదాయాలు తమ ఆస్తిపన్నును వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు ట్రాన్స్‌కో కూడా ఆస్తిపన్ను చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో 50 శాతం కంటే తక్కువ పన్ను వసూలు చేసిన మండలాలు ఎల్కతుర్తి, గంగాధర, జమ్మికుంట, కమలాపూర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్, శంకరపట్నంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్లు ఏర్పడకుండా గ్రామకార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములలో భవనాలు నిర్మించకుండా చూడాలన్నారు. గ్రామకార్యదర్శుల నిర్లక్ష్యంతో అనేక ఫిర్యాదులు కలెక్టర్ కార్యాలయానికి అందుతున్నాయని, వీటిని చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. -
స్వచ్ఛందంగా ముందుకు రండి..
డొమెస్టిక్ ఆస్తిపన్ను చెల్లించే వ్యాపారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ లేదంటే జరిమానాలు భరించాల్సిందే.. ఆస్తిపన్ను అంచనాపై జీహెచ్ఎంసీ కొత్త ప్లాన్ త్వరలో అమల్లోకి సిటీబ్యూరో: ఆయా భవనాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోన్నా ఆస్తిపన్ను చెల్లింపులో మాత్రం నివాస గృహాలుగా చూపుతున్న వారిపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. సదరు వ్యక్తుల నుంచి వాణిజ్య కేటగిరీ కింద ఆస్తిపన్ను వసూలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అలాంటి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలు అందించేందుకు ‘సెల్ఫ్ అసెస్మెంట్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి జరిమానా విధించరాదని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యసాధనలో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన కమిషనర్ సోమేశ్‌కుమార్ వాణిజ్య భవనాల యజమానులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. ప్రత్యేక బృందాలు గుర్తిస్తే మాత్రం పెనాల్టీతో సహా వాణిజ్య కేటగిరీ పన్నును వసూలు చేస్తామని కమిషనర్ తెలిపారు. నాలుగోతరగతి ఉద్యోగులకు పదోన్నతి.. పదోన్నతులకు అర్హులైన నాలుగోతరగతి ఉద్యోగులను సైతం ఆస్తిపన్ను వసూళ్లకు వినియోగించుకోవాలని కమిషనర్ సోమేశ్‌కుమార్ భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో దాదాపు 300 మంది నాలుగోతరగతి ఉద్యోగులు పదోన్నతులకు అర్హత కలిగి ఉన్నారు. వీరికి శిక్షణనిచ్చి బిల్ కలెక్టర్లకు సహాయకులుగా ఆస్తిపన్ను వసూళ్లకు పంపించనున్నారు. బాగా పనిచేసే వారిని గుర్తించి పదోన్నతులతోపాటు వారిని బిల్ కలెక్టర్లుగా నియమించనున్నారు. పెరగనున్న బిల్ కలెక్టర్ పోస్టులు.. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 323 బిల్కలెక్టర్ల పోస్టులుండగా, ప్రసాదరావు కమిటీ సిపార్సుల మేరకు మరో 127 పోస్టులు పెరగనున్నాయి. ప్రస్తుతం 337 మంది పనిచేస్తుండగా మరో 113 మందిని నియమించేందుకు అవకాశం ఉంది. బాగా పనిచేసే నాలుగోతరగతి ఉద్యోగులకు పదోన్నతి కల్పించి బిల్‌కలెక్టర్లుగా మార్చనున్నారు. తద్వారా వారిని ప్రోత్సహించడంతోపాటు జీహెచ్ఎంసీ ఖజానాకు ఆదాయమూ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సమ్మెల పేరిట బిల్ కలెక్టర్లు విధులకు డుమ్మా కొట్టినా, వీరి సేవలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. -
చెల్లింపునకు నేడే ఆఖరి గడువు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఆస్తిపన్ను చెల్లింపునకు ఈ నెల 31వ తేదీయే ఆఖరి గడువని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (రెవెన్యూ) హరికృష్ణ, అదనపు కమిషనర్ (ప్లానింగ్) వెంకట్రామిరెడ్డి, సెంట్రల్ జోనల్ కమిషనర్ రోనాల్డ్‌రాస్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడువు ముగిసే సమయానికి రూ. 1100 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రూ. 895 కోట్ల పన్ను వసూలు చేశామన్నారు. ఉగాది రోజున సోమవారం రాత్రి 8 గంటల వరకు కూడా పన్ను చెల్లించవచ్చని, ఆన్లైన్లో కూడా చెల్లింపులు చేయవచ్చన్నారు. సమావేశంలో సర్కిల్-10 డీఎంసీ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.