స్వచ్ఛందంగా ముందుకు రండి.. | Domestic retailers have to pay property tax ghmc Offer | Sakshi
Sakshi News home page

స్వచ్ఛందంగా ముందుకు రండి..

Published Sun, Nov 23 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

స్వచ్ఛందంగా ముందుకు రండి..

స్వచ్ఛందంగా ముందుకు రండి..

డొమెస్టిక్ ఆస్తిపన్ను చెల్లించే వ్యాపారులకు జీహెచ్‌ఎంసీ ఆఫర్
లేదంటే జరిమానాలు భరించాల్సిందే..
ఆస్తిపన్ను అంచనాపై జీహెచ్‌ఎంసీ కొత్త ప్లాన్  త్వరలో అమల్లోకి

 
సిటీబ్యూరో: ఆయా భవనాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోన్నా ఆస్తిపన్ను చెల్లింపులో మాత్రం నివాస గృహాలుగా చూపుతున్న వారిపై జీహెచ్‌ఎంసీ దృష్టిసారించింది. సదరు వ్యక్తుల నుంచి వాణిజ్య కేటగిరీ కింద ఆస్తిపన్ను వసూలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అలాంటి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలు అందించేందుకు ‘సెల్ఫ్ అసెస్‌మెంట్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి జరిమానా విధించరాదని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యసాధనలో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన కమిషనర్ సోమేశ్‌కుమార్ వాణిజ్య భవనాల యజమానులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. ప్రత్యేక బృందాలు గుర్తిస్తే మాత్రం పెనాల్టీతో  సహా వాణిజ్య కేటగిరీ పన్నును వసూలు చేస్తామని కమిషనర్  తెలిపారు.

నాలుగోతరగతి ఉద్యోగులకు పదోన్నతి..

పదోన్నతులకు అర్హులైన నాలుగోతరగతి ఉద్యోగులను సైతం ఆస్తిపన్ను వసూళ్లకు వినియోగించుకోవాలని కమిషనర్ సోమేశ్‌కుమార్ భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో దాదాపు 300 మంది నాలుగోతరగతి ఉద్యోగులు పదోన్నతులకు అర్హత కలిగి ఉన్నారు. వీరికి శిక్షణనిచ్చి బిల్ కలెక్టర్లకు సహాయకులుగా ఆస్తిపన్ను వసూళ్లకు పంపించనున్నారు. బాగా పనిచేసే వారిని గుర్తించి పదోన్నతులతోపాటు వారిని బిల్ కలెక్టర్లుగా నియమించనున్నారు.

పెరగనున్న బిల్ కలెక్టర్ పోస్టులు..

జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 323 బిల్‌కలెక్టర్ల పోస్టులుండగా, ప్రసాదరావు కమిటీ సిపార్సుల మేరకు మరో 127 పోస్టులు పెరగనున్నాయి. ప్రస్తుతం 337 మంది పనిచేస్తుండగా మరో 113 మందిని నియమించేందుకు అవకాశం ఉంది. బాగా పనిచేసే నాలుగోతరగతి ఉద్యోగులకు పదోన్నతి కల్పించి బిల్‌కలెక్టర్లుగా మార్చనున్నారు. తద్వారా వారిని ప్రోత్సహించడంతోపాటు జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఆదాయమూ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సమ్మెల పేరిట బిల్ కలెక్టర్లు విధులకు డుమ్మా కొట్టినా, వీరి సేవలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement