ఆస్తి పన్నుకు ససేమిరా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆస్తి పన్ను చెల్లింపులో ప్రభుత్వ సంస్థలు మొండికేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు రెండూ కర్నూలు కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఆ ప్రభావం కాస్తా అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. ఆస్తి పన్ను చెల్లించాల్సిన ప్రభుత్వ సంస్థల్లో.. కలెక్టరేట్‌లోని ముఖ్య ప్రణాళిక శాఖ అధికారి కార్యాలయంతో పాటు ట్రెజరీ, పౌర సరఫరాల శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తంలో కోటి మాత్రమే చెల్లించగా.. మరో రూ.14 కోట్ల ఆస్తి పన్ను వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం వసూలుకు కార్పొరేషన్ అధికారులు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోతోంది.
ఏళ్ల తరబడి బకాయిలే.. వాస్తవానికి ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఎప్పటికప్పుడు ఆస్తి పన్ను చెల్లించాలి. ప్రైవేటు సంస్థలు చెల్లించకపోతే వెంటనే నీటి కనెక్షన్ తీసివేయడం చేస్తున్న కార్పొరేషన్ అధికారులు.. ప్రభుత్వ కార్యాలయాల విషయానికి వచ్చేసరికి ఏమీ చేయలేకపోతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను మొత్తం రూ.14.99 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం కోటి 8 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.13.91 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. అంటే నిర్ణీత లక్ష్యంలో 7.22 శాతం మాత్రమే ఆస్తి పన్నులు చెల్లించడం గమనార్హం.
ఇందులోనూ 2015-16 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను మాత్రమే కాకుండా.. ఏళ్ల తరబడి చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు కూడా పేరుకుపోయాయి. కార్పొరేషన్ అధికారులు ఏమీ చేయలేరనే దాంతో పాటు.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం కూడా ఆస్తి పన్ను చెల్లించలేకపోవడానికి కారణంగా తెలుస్తోంది.
అన్ని శాఖలదీ ఇదే తీరే.. కర్నూలు కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను బకాయిపడ్డ ప్రభుత్వ శాఖల్లో అన్నిరకాల కార్యాలయాలూ ఉన్నాయి. జిల్లాకు పరిపాలనలో గుండెకాయ లాంటి కలెక్టరేట్‌లోని ట్రెజరీ విభాగం, ప్రణాళిక కార్యాలయంతో పాటు ఐసీడీఎస్ కార్యాలయం, వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ ఆ జాబితాలోనివే. అదేవిధంగా ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ డిపార్టుమెంటు, వయోజన విద్యతో పాటు స్వయంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కూడా ఆస్తి పన్ను చెల్లించని జాబితాలో ఉంది.
ఇక ఎక్సైజ్‌శాఖ, జల మండలి కార్యాలయాలదీ ఇదే తీరు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వేకు చెందిన పలు కార్యాలయాలతో పాటు పోస్టల్‌శాఖ కార్యాలయం కూడా ఆస్తి పన్ను బకాయిదారుల జాబితాలో ఉన్నాయి. వీటి నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో.. దీని ప్రభావం కార్పొరేషన్‌లోని అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.