kurnool corporation
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మేయర్ బంగి
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు కార్పొరేషన్ మాజీ మేయర్, టీడీపీ నేత బంగి అనంతయ్య సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పార్టీ కండువా వేసి.. ఆయన్ని వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. అనంతయ్య 1995వ సంవత్సరం నుంచి 2000 వరకు కర్నూలు మేయర్‌గా పనిచేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సురేష్, రవిశంకర్, గణేష్, రఘు రాణా ప్రతాప్, శంకర్, చిరంజీవి సహా దాదాపు వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. బంగి అనంతయ్య మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. కర్నూలుతో పాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించటం ఖాయమని చెప్పారు. -
స్వచ్ఛతా మొబైల్ ఆప్ పోస్టర్‌ను విడుదల
కర్నూలు : పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత మొబైల్ ఆప్ పోస్టర్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ ఆకే రవికృష్ణ గురువారం ఉదయం ఆవిష్కరించారు. స్వచ్ఛతా ఆప్‌ను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఎక్కడైనా చెత్త ఉండే పరిసరాలను ఫొటో తీసి ఈ ఆప్ ద్వారా అప్లోడ్ చేస్తే సంబంధిత మున్సిపల్ అధికారులకు సమాచారం నేరుగా వెళ్తుందని ఎస్పీ తెలిపారు. ఆప్ ద్వారా చెత్త సమస్యలను తెలియజేయడం ద్వారా స్వచ్ఛ కర్నూలుకు సహకరించాలని కోరారు. స్వచ్ఛతా ఆప్‌ను ప్రతి కాలేజ్, ప్రభుత్వ కార్యాలయం, ఎన్జీఓల సహకారంతో ప్రచారం చేస్తామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మేయర్ పీఠం ఏ వర్గానికి?
కర్నూలు కార్పొరేషన్‌పై ఆసక్తికర చర్చ బీసీలకు దక్కకుండా చేసేందుకు కుట్ర ఉమ్మడి రాష్ట్రంలోని నిర్ణయంపై పునః సమీక్ష జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు ఈ నేపథ్యంలో రిజర్వేషన్ మార్పునకు కసరత్తు బీసీలను ఊరించిన కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠం అందని ద్రాక్షగా మారుతోందా? రాజకీయ విశ్లేషకుల నుంచి ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తే ఇబ్బందులు తలెత్తవచ్చని.. పైగా కార్పొరేషన్ జనాభా పెరగడం, మూడు మండలాల విలీనం దృష్ట్యా మేయర్ పీఠం రిజర్వేషన్ విషయంపై ప్రభుత్వం పునః సమీక్షించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు : కర్నూలు మున్సిపాలిటీ 1994లో 38 వార్డులతో కార్పొరేషన్‌గా ఏర్పాటయింది. 2002లో మేజర్ గ్రామ పంచాయతీ కల్లూరును కార్పొరేషన్లో విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 50కి చేరుకుంది. 2014లో స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలను కర్నూలు కార్పొరేషన్లో కలపడంతో అదనంగా ఒక వార్డు వచ్చి చేరింది. 2001, 2005 సంవత్సరాల్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించినా.. 2010 సెప్టెంబర్ పాలక వర్గం గడువు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు సుమారు ఆరేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. 2014లో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలలు నిర్వహించగా.. కర్నూలు కార్పొరేషన్ ఎన్నిక మాత్రం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. విలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత అడ్డంకులు తొలగిపోయినా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఈ విషయమై ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. అయినప్పటికీ పెడచెవిన పెట్టడంతో తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని.. లేదంటే తామే తేదీలను ప్రకటిస్తామని అక్షింతలు వేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం సెప్టెంబర్ వరకు గడువు కోరింది. ఫలితంగా కార్పొరేషన్లో ఎన్నికల హడావుడి మొదలయింది. మారుతున్న సమీకరణాలు కార్పొరేషన్లో మొత్తం 51 వార్డులు ఉండగా.. రానున్న ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈ దృష్ట్యా 26 మంది మహిళలు కార్పొరేటర్లుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. 2014లో నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు కార్పొరేషన్ మేయర్ పదవిని బీసీ జనరల్ మహిళలకు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత విలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడం.. తదనంతర పరిణామాలతో తాజాగా మళ్లీ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా గణన, రిజర్వేషన్ల ప్రక్రియ జరగాల్సి ఉంది. అలాగే జిల్లాలో తాజాగా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇది వరకు మేయర్ గిరికి కేటాయించిన రిజర్వేషన్లలోనూ మార్పులు వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో పవర్ సెంటర్ ఉండకూడదనే.. వాస్తవానికి గతంలో 1955 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఈ విడత మేయర్ పదవిని బీసీ మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్ ఖరారయింది. అయితే బీసీలకు పీఠం దక్కితే ఇప్పటికే పవర్ సెంటర్‌గా ఉన్న ఆ వర్గం నేత ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఆలోచన తెరపైకి వచ్చినట్లు సమాచారం. తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు.. మేయర్ పదవి రిజర్వేషన్లలో మార్పులు తీసుకురావడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మేయర్ పదవి ఓసీ జనరల్‌కు దక్కేలా పావులు కదుపుతున్నట్లు అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. -
ఆస్తి పన్నుకు ససేమిరా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆస్తి పన్ను చెల్లింపులో ప్రభుత్వ సంస్థలు మొండికేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు రెండూ కర్నూలు కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఆ ప్రభావం కాస్తా అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. ఆస్తి పన్ను చెల్లించాల్సిన ప్రభుత్వ సంస్థల్లో.. కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళిక శాఖ అధికారి కార్యాలయంతో పాటు ట్రెజరీ, పౌర సరఫరాల శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తంలో కోటి మాత్రమే చెల్లించగా.. మరో రూ.14 కోట్ల ఆస్తి పన్ను వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం వసూలుకు కార్పొరేషన్ అధికారులు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోతోంది. ఏళ్ల తరబడి బకాయిలే.. వాస్తవానికి ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఎప్పటికప్పుడు ఆస్తి పన్ను చెల్లించాలి. ప్రైవేటు సంస్థలు చెల్లించకపోతే వెంటనే నీటి కనెక్షన్ తీసివేయడం చేస్తున్న కార్పొరేషన్ అధికారులు.. ప్రభుత్వ కార్యాలయాల విషయానికి వచ్చేసరికి ఏమీ చేయలేకపోతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను మొత్తం రూ.14.99 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం కోటి 8 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.13.91 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. అంటే నిర్ణీత లక్ష్యంలో 7.22 శాతం మాత్రమే ఆస్తి పన్నులు చెల్లించడం గమనార్హం. ఇందులోనూ 2015-16 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను మాత్రమే కాకుండా.. ఏళ్ల తరబడి చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు కూడా పేరుకుపోయాయి. కార్పొరేషన్ అధికారులు ఏమీ చేయలేరనే దాంతో పాటు.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం కూడా ఆస్తి పన్ను చెల్లించలేకపోవడానికి కారణంగా తెలుస్తోంది. అన్ని శాఖలదీ ఇదే తీరే.. కర్నూలు కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను బకాయిపడ్డ ప్రభుత్వ శాఖల్లో అన్నిరకాల కార్యాలయాలూ ఉన్నాయి. జిల్లాకు పరిపాలనలో గుండెకాయ లాంటి కలెక్టరేట్లోని ట్రెజరీ విభాగం, ప్రణాళిక కార్యాలయంతో పాటు ఐసీడీఎస్ కార్యాలయం, వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ ఆ జాబితాలోనివే. అదేవిధంగా ఏపీ డెయిరీ డెవలప్మెంట్ డిపార్టుమెంటు, వయోజన విద్యతో పాటు స్వయంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కూడా ఆస్తి పన్ను చెల్లించని జాబితాలో ఉంది. ఇక ఎక్సైజ్‌శాఖ, జల మండలి కార్యాలయాలదీ ఇదే తీరు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వేకు చెందిన పలు కార్యాలయాలతో పాటు పోస్టల్‌శాఖ కార్యాలయం కూడా ఆస్తి పన్ను బకాయిదారుల జాబితాలో ఉన్నాయి. వీటి నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో.. దీని ప్రభావం కార్పొరేషన్‌లోని అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అక్రమార్కులపై కొరడా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్రమ వాణిజ్య భవనాలపై కొరడా ఝళిపించేందుకు కర్నూలు నగరపాలక సంస్థ యంత్రాంగం సిద్ధమైంది. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని వాణిజ్య సముదాయాన్ని(కమర్షియల్ కాంప్లెక్స్) నిర్మించుకున్న అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం పక్కాగా పథక రచన చేసింది. ప్రధానంగా నగరంలోని ఐదు వాణిజ్య మార్గాల్లో సర్వే చేపట్టేందుకు నిర్ణయించింది. సర్వేలో వాణిజ్య సముదాయాల ఫొటోలను తీసి డిజిటలైజ్ చేయనున్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో వివరాలు సేకరించి క్రోడీకరించనున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని వాణిజ్య సముదాయాల వివరాలను డిజిటలైజ్ చేసి.. భండారం బయటపెట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఉమ్మడి నిర్ణయం అక్రమ వాణిజ్య భవనాలపై చర్యలకు విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలతో కలిసి ఉమ్మడిగా ముందుకు సాగేందుకు పురపాలకశాఖ అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా సర్వే చేయనున్న ఐదు ప్రధాన మార్గాల్లోని వాణిజ్య సముదాయాలకు విద్యుత్ కనెక్షన్ ఎందుకోసం తీసుకున్నారనే వివరాలను విద్యుత్‌శాఖ నుంచి సేకరిస్తారు. అంటే.. గాయత్రి ఎస్టేట్ వద్ద ఫలానా షాపునకు గృహ విద్యుత్ కనెక్షన్ ఇచ్చారా? వాణిజ్య విద్యుత్ కనెక్షన్ ఇచ్చారా? అనే వివరాలను తీసుకుంటారు. అదేవిధంగా ఫలానా బిల్డింగ్‌లో ఏయే షాపులకు అనుమతి తీసుకున్నారనే వివరాలను వాణిజ్యపన్నులశాఖ నుంచి సేకరిస్తారు. ఆ తర్వాత సర్వే ద్వారా తీసుకున్న డిజిటల్ చిత్రాలు-విద్యుత్ కనెక్షన్ వివరాలు, వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న అనుమతి వివరాలను క్రోడీకరించి పక్కాగా నిక్షిప్తం చేయనున్నారు. తద్వారా పట్టణ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి ఎందుకు తీసుకున్నారనే వివరాలను పోల్చి... అక్రమ వాణిజ్య భవనాలను గుర్తించనున్నారు. ఈ విధంగా గుర్తించిన భవనాలపై వాస్తవంగా వాణిజ్య భవనానికి చెల్లించాల్సిన పన్ను కంటే అదనంగా 100 శాతం వసూలు చేయనున్నారు. ఎప్పటి నుంచి వాస్తవంగా పన్ను చెల్లించాలనే వివరాలను సేకరించి అంత బకాయి మొత్తాన్ని వడ్డీ సహా వసూలు చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నగరంలో మొదటి దశగా ప్రధాన వాణిజ్య సముదాయాలున్న ఐదు మార్గాలపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపుల ఉన్న వాణిజ్య సముదాయాల వివరాలు, ఫొటోలను తీసి క్రోడీకరిస్తారు. రెండో దశలో మునిసిపాలిటీ పరిధిలోని మొత్తం వాణిజ్య భవనాల వివరాలను సేకరించి ఆన్లైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తద్వారా ఎవరైనా గృహాన్ని నిర్మిస్తామని తక్కువ పన్ను చెల్లించే ప్రయత్నం చేస్తే అడ్డుకట్ట వేయాలనేది మున్సిపల్ అధికారుల ప్రణాళికగా తెలుస్తోంది. నగరంలో సర్వే నిర్వహించనున్న ఐదు ప్రధాన మార్గాలు 1. సుంకేసుల రోడ్డు నుంచి మదర్ థెరిస్సా విగ్రహం మీదుగా వాణిజ్యపన్నులశాఖ. అక్కడి నుంచి వైఎస్సార్ విగ్రహం.. రాక్‌వుడ్ పాఠశాల.. మౌర్య ఇన్.. రాజ్ విహార్.. కిడ్స్‌వరల్డ్.. రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా రాజ్ థియేటర్. 2. కింగ్ మార్కెట్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా కొండారెడ్డి బురుజు. అక్కడి నుంచి కోట్ల సర్కిల్ మీదుగా కిడ్స్‌వరల్డ్. 3. రైల్వే స్టేషన్ రోడ్డు-బంగారుపేట నుంచి బళ్లారి జంక్షన్ మీదుగా రేడియో స్టేషన్. 4. రాజ్‌విహార్-గౌరీ గోపాల్ ఆసుపత్రి, గాయత్రి ఎస్టేట్ మీదుగా గుత్తి పెట్రోల్ బంకు. 5. గాయత్రీ ఎస్టేట్ నుంచి నంద్యాల రోడ్డు.