కర్నూలు కార్పొరేషన్‌పై ఆసక్తికర చర్చ
బీసీలకు దక్కకుండా చేసేందుకు కుట్ర
ఉమ్మడి రాష్ట్రంలోని నిర్ణయంపై పునః సమీక్ష
జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు
ఈ నేపథ్యంలో రిజర్వేషన్ మార్పునకు కసరత్తు
బీసీలను ఊరించిన కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠం అందని ద్రాక్షగా మారుతోందా? రాజకీయ విశ్లేషకుల నుంచి ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తే ఇబ్బందులు తలెత్తవచ్చని.. పైగా కార్పొరేషన్ జనాభా పెరగడం, మూడు మండలాల విలీనం దృష్ట్యా మేయర్ పీఠం రిజర్వేషన్ విషయంపై ప్రభుత్వం పునః సమీక్షించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కర్నూలు : కర్నూలు మున్సిపాలిటీ 1994లో 38 వార్డులతో కార్పొరేషన్‌గా ఏర్పాటయింది. 2002లో మేజర్ గ్రామ పంచాయతీ కల్లూరును కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 50కి చేరుకుంది. 2014లో స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలను కర్నూలు కార్పొరేషన్‌లో కలపడంతో అదనంగా ఒక వార్డు వచ్చి చేరింది. 2001, 2005 సంవత్సరాల్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించినా.. 2010 సెప్టెంబర్ పాలక వర్గం గడువు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు సుమారు ఆరేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.
2014లో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలలు నిర్వహించగా.. కర్నూలు కార్పొరేషన్ ఎన్నిక మాత్రం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. విలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత అడ్డంకులు తొలగిపోయినా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకంజ వేసింది.
ఈ విషయమై ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. అయినప్పటికీ పెడచెవిన పెట్టడంతో తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని.. లేదంటే తామే తేదీలను ప్రకటిస్తామని అక్షింతలు వేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం సెప్టెంబర్ వరకు గడువు కోరింది. ఫలితంగా కార్పొరేషన్‌లో ఎన్నికల హడావుడి మొదలయింది.
మారుతున్న సమీకరణాలు
కార్పొరేషన్‌లో మొత్తం 51 వార్డులు ఉండగా.. రానున్న ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈ దృష్ట్యా 26 మంది మహిళలు కార్పొరేటర్లుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. 2014లో నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు కార్పొరేషన్ మేయర్ పదవిని బీసీ జనరల్ మహిళలకు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించింది.
ఆ తర్వాత విలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడం.. తదనంతర పరిణామాలతో తాజాగా మళ్లీ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా గణన, రిజర్వేషన్ల ప్రక్రియ జరగాల్సి ఉంది. అలాగే జిల్లాలో తాజాగా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇది వరకు మేయర్ గిరికి కేటాయించిన రిజర్వేషన్లలోనూ మార్పులు వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరో పవర్ సెంటర్ ఉండకూడదనే..
వాస్తవానికి గతంలో 1955 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఈ విడత మేయర్ పదవిని బీసీ మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్ ఖరారయింది. అయితే బీసీలకు పీఠం దక్కితే ఇప్పటికే పవర్ సెంటర్‌గా ఉన్న ఆ వర్గం నేత ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఆలోచన తెరపైకి వచ్చినట్లు సమాచారం. తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు.. మేయర్ పదవి రిజర్వేషన్లలో మార్పులు తీసుకురావడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మేయర్ పదవి ఓసీ జనరల్‌కు దక్కేలా పావులు కదుపుతున్నట్లు అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది.