సాక్షి, హైదరాబాద్: ‘శంషాబాద్’ పేరుతో ఈనెల 1న కొత్త మున్సిపాలిటీ ఆవిర్భవించింది. అయితే శంషాబాద్ మాత్రం ఇంకా గ్రామ పంచాయతీగానే కొనసాగుతోంది. హైదరాబాద్ శివార్లలోని చిన్నగొళ్లపల్లి, తొండుపల్లి, ఓట్పల్లి పంచాయతీలు విలీనమై శంషాబాద్ మున్సిపాలిటీ అవతరించగా.. మున్సిపల్ కేంద్రంగా ఆవిర్భవించాల్సిన శంషాబాద్‌కు వచ్చే ఏడాది ఏప్రిల్ 20 వరకు మున్సిపాలిటీ హోదా లభించే అవకాశం లేదు. ఏప్రిల్ వరకు శంషాబాద్ గ్రామ పంచాయతీ పాలక వర్గం పదవీకాలం కొనసాగనుండటమే ఇందుకు కారణం.
ఇంకా సర్పంచ్‌ల పాలనలోనే..
ఈనెల 1, 2వ తేదీల్లో రాష్ట్రంలో 68 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కాగా, అందులో శంషాబాద్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కేంద్రాలు మాత్రం ఇంకా గ్రామ పంచాయతీలుగానే కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఐదు మున్సిపాలిటీలు భౌగోళికపరంగా పాక్షిక రూపంలో మాత్రమే ఏర్పటయ్యాయి. ఈ గ్రామ పంచాయతీల పాలకవర్గాలు పదవీ కాలం ముగిసే వరకు సర్పంచ్‌ల పాలనలో కొనసాగనున్నాయి. ఆ వెంటనే శివారు గ్రామ పంచాయతీల కలయికతో ఏర్పడిన సంబంధిత పురపాలికలో విలీనమై ఆయా పురపాలికల కేంద్రాలుగా ఏర్పడనున్నాయి. అప్పటి వరకు ఈ పురపాలికలకు పరిపాలన కేంద్రం ఉండదని, తాత్కాలికంగా వేరే ప్రాంతాల నుంచి పాలన వ్యవహారాలు నడిపిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
ఎందుకంటే..
రాష్ట్రంలో 173 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 68 పురపాలికల ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు గత మార్చిలో శాసనసభ రాష్ట్ర మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. గత సాంప్రదాయానికి భిన్నంగా స్థానిక ప్రజల అభిప్రాయంతో, గ్రామ పంచాయతీల తీర్మానంతో పనిలేకుండా.. నేరుగా కొత్త పురపాలికల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో గ్రామాలు/ఆవాసాలను విలీనం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ చట్టాలకు సవరణలు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే వాటికి మున్సిపాలిటీల హోదా లభిస్తుందని మున్సిపల్ చట్టాల్లో చేర్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈనెల 1, 2వ తేదీలతో ముగిసిపోయింది. దీంతో ఆ వెంటనే రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి. అయితే శంషాబాద్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలు కేంద్రాలుగా ఏర్పడాల్సిన ఆయా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో వాటి పాలకవర్గాల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు.
‘కేంద్రం’ లేని కొత్త పురపాలికలు
Published Tue, Aug 7 2018 1:27 AM | Last Updated on Tue, Aug 7 2018 1:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment