shamsabad
-
వచ్చే ఫిబ్రవరిలో భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు
-
‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ
శంషాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనమైన ‘దిశ’ఘటనను తనకున్న సామర్థ్యంతో ఉద్వేగభరితంగా చిత్రం తీసేందుకు యత్నిస్తున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘దిశ’చిత్ర కథను తయారు చేసుకునే క్రమంలో సోమవారం శంషాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కథ పరిశోధనలో ఉండటంతో అందులో ప్రధానమైన అంశం ఏమిటనేది ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. -
దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్ వర్మ భేటీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనను తెరకెక్కించబోతున్న డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ... ఆ దిశగా సన్నాహాలు వేగవంతం చేశారు. వర్మ ఉన్నట్టుండి సోమవారం రోజున రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. అక్కడి ఏసీపీ అశోక్‌కుమార్‌తో భేటీ అయ్యారు. దిశ ఘటనపై ఆయనతో చర్చలు జరిపారు. దిశ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెపై అత్యాచారం జరిగినప్పటి నుంచి ఎన్కౌంటర్ జరిగిన వరకూ ఉన్న పరిస్థితులు కేసు వివరాలను ఏసీపీ వివరించారు. త్వరలో మరికొందరు పోలీస్ అధికారులను కూడా కలుస్తానన్న ఆయన.. సమాచారన్నంతా సేకరించిన తర్వాత తాను సినిమాలో ఏం చూపించాలన్న దానిపై నిర్ణయానికి వస్తానన్నారు. చదవండి: దిశ: చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ దిశ ఘటనపై ఓ సినిమా చేస్తానని ఈ మధ్య ప్రకటించిన నేపథ్యంలో ఆయన పోలీసులను కలడం ఆసక్తిగా మారింది. రామ్‌గోపాల్ వర్మ ఇటీవల దిశ ఘటనపై స్పందించి అత్యాచారానికి పాల్పడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్‌కౌంటర్‌కు గురైన నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కూడా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సినిమా తీస్తానని ప్రకటించారు. దిశ ఘటన గురించి సమాచారం తెలుసుకోవడానికి తాను శంషాబాద్ ఏసీపీని కలిసినట్టు వెల్లడించారు. దిశ సినిమాను తీయడానికి నేను చేస్తోన్న పరిశోధనకు ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ కేసు సంచలనం సృష్టించిందని, ఒక ఎమోషనల్ క్యాప్చర్ చేయాలన్నదే తన ప్రయత్నమని వర్మ చెప్పారు. చదవండి: వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్ -
తల్లి పనిచేసే స్కూల్లోనే బలవన్మరణం
సాక్షి, శంషాబాద్ రూరల్: తెల్లవారుజామున పాఠశాలను శుభ్రం చేయడానికి వెళ్లిన ఆమెకు తన కుమారుడు పైపునకు విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురైంది. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. గతంలోనే భర్త మృతిచెందగా ఇప్పుడు కుమారుడి మృతితో ఆమె ఒంటరిగా మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మాకులకు చెందిన గుడాల సువర్ణ కుమారుడు శివకుమార్ (24) కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. తండ్రి గతంలోనే మరణించాడు. తల్లి సువర్ణ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. తల్లీకొడుకు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. కాగా, శనివారం తెల్లవారుజామున పని కోసం పాఠశాల ఆవరణలోకి సువర్ణ వెళ్లగా కుమారుడు అక్కడ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. పాఠశాల గది వరండాపై ఉన్న నీటి పైపునకు బట్టతో శివకుమార్ ఉరి వేసుకుని ఉండడం చూసి షాక్‌కు గురైంది. తన కుమారుడు ఆరి్థక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. తాత్కాలికంగా పాఠశాలకు తాళం పాఠశాల ఆవరణలో ఆత్మహత్య చేసుకోవడంతో శనివారం పాఠశాలకు తాళం వేశారు. విద్యార్థులను పక్కనే ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో కూర్చోబెట్టి తరగతులు కొనసాగించారు. సంఘటన జరిగిన ప్రాథమిక పాఠశాలను శుభ్రం చేశారు. -
తూచ్.. కథ అడ్డం తిరిగింది!
సాక్షి, శంషాబాద్: ప్రభుత్వం పంచాయతీల్లో బాధ్యతాయుత, పారదర్శక పాలన కోసం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, సంబంధిత శాఖ సిబ్బంది మాత్రం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పాలకవర్గం నిర్ణయాలను అమలు చేయాల్సిన పంచాయతీ కార్యదర్శి.. అందుకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగల్లో తొక్కి ఓ అడుగు ముందుకు వేశారు. సర్పంచ్ నుంచి నోట్ అప్రూవల్ లేకుండానే.. చెక్కులపై ఉపసర్పంచ్ సంతకం చేయకున్నా.. ఏకంగా 9,72,981 నిధుల డ్రా చేసేందుకు 7 చెక్కులను జారీ చేయించారు. విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో అధికారులు విచారణ జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ మండలం బహదూర్‌గూడ జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి జూలై 1 నుంచి 31 వరకు మెడికల్ సెలవుపై వెళ్లారు. దీంతో అధికారులు పెద్దగోల్కొండ పంచాయతీ కార్యదర్శి స్వప్నకు ఇ¯Œ చార్జి బాధ్యతలు అప్పగించారు. స్రవంతి సెలవుపై వెళ్లే నాటికి పంచాయతీ ఖాతాలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.7,99,475, సాధారణ నిధులు రూ.2,71,392 జమ ఉన్నాయి. ఆమె తిరిగి ఆగస్టు 1న తిరిగి విధుల్లో చేరారు. ఆ సమయానికి పంచాయతీ ఖాతాలో కేవలం రూ. 23,894 ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీ ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెలుసుకున్న ఉప సర్పంచ్ ప్రభాకర్.. తాను చెక్కులపై ఎలాంటి సంతకాలు చేయలేదని, నిధుల డ్రా విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆగస్టు 27న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిధుల డ్రాకు నిబంధనలు ఇవీ.. పంచాయతీ ఖాతాలో ఉన్న నిధులను డ్రా చేయడానికి నిబంధనల మార్పుతో పాటు కొత్త పద్ధతిని ఏర్పాటు చేశారు. ఐఎఫ్ఎంఐఎస్ సిస్టమ్‌తో నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. పంచాయతీ పరిధిలో చేపట్టిన పనులకు చెల్లించే డబ్బులకు పాలకవర్గం తీర్మానం చేసి మినిట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా పంచాయతీ కార్యదర్శి నిధుల డ్రాకు నోట్æ ఫైల్ రూపొందించాలి. ఈ నోట్ ఫైల్‌పై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐఎఫ్ఎంఐఎస్ సిస్టమ్‌లో పంచాయతీ పేరున ఉన్న యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, నిధుల డ్రాకు చెక్కులను జారీ తతంగాన్ని పంచాయతీ కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రైమరీగా సర్పంచ్ సెల్‌నంబర్, మరోటి పంచాయతీ కార్యదర్శి సెల్ నంబర్లు జత చేయబడి ఉంటాయి. రెండు దశల్లో చేపట్టే ఈ ప్రక్రియకు సంబంధించి ఈ రెండు సెల్ఫో¯Œ నంబర్లకు ఓటీపీ వస్తుంది. అయితే, సదరు రెండు సెల్ నంబర్లకు ఒకటే తరహా ఓటీపీ నంబరు వస్తుండడంతో సర్పంచ్ ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి చేసుకోవచ్చు. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో మొదటి దశలో నిధుల వివరాలు, పనుల వివరాలను జత చేయాలి. తర్వాత ఆటోమేటిక్‌గా ఈ నిధులకు సంబంధించి చెక్కు జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన చెక్కులకు సంబంధించి నిధుల డ్రాకు అనుమతికి లేదా ఏవైనా పొరపాట్లు జరిగితే.. చెక్కులను రద్దు చేయడానికి రెండో దశలో కూడా ఓటీపీ నంబరుతో సదరు ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి చేపట్టాల్సి ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే.. బహదూర్‌గూడ పంచాయతీ గతంలో పెద్దగోల్కొండకు అనుబంధంగా ఉండేది. ఆ సమయంలో బహదూర్‌గూడలో కొన్ని పనులు చేపట్టారు. వీటికి సంబంధించి బిల్లులు చెల్లించలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటు సమయంలో.. గతంలో చేపట్టిన పనులు, చెల్లించాల్సిన బిల్లులకు సరిపడు నిధులను కేటాయించిన తర్వాత.. కొత్త పంచాయతీలకు నిధులను పంచారు. ఈ లెక్కన బహదూర్‌గూడలో ఉమ్మడి పెద్దగోల్కొండ పంచాయతీగా ఉన్న సమయంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు కేవలం పెద్దగోల్కొండ పంచాయతీ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా బహదూర్‌గూడ పంచాయతీ నిధులను చెల్లించేందుకు స్కెచ్ వేశారు. ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న కార్యదర్శి స్వప్న.. బహదూర్‌గూడ సర్పంచ్, ఉప సర్పంచ్‌కు తెలియకుండానే నిధులను డ్రా చేశారు. నిధుల డ్రాకు కావాల్సిన నోట్ ఫైల్, చెక్కులపై ఉప సర్పంచ్ సంతకం లేకుండానే మూడు చెక్కులకు ట్రెజరీ కార్యాలయంలో అనుమతి ఇచ్చి రూ.5,17,838 నిధులు విడుదల చేశారు. వీటిలో రెండు చెక్కులు భూగర్భ మురుగు కాలువ పనులకు సంబంధించనవి కాగా.. ఒక చెక్కు పంచాయతీ సిబ్బంది వేతన బకాయిలకు చెందినవి ఉన్నాయి. నాలుగు చెక్కులు రద్దు.. పంచాయతీ నిధులను డ్రా చేయడానికి కార్యదర్శి మొత్తం 7 చెక్కులను జారీ చేయించారు. అందులో మూడు చెక్కులు పాస్ అవగా.. మిగతా వాటిని రద్దు చేశారు. రద్దు చేయడానికి సరైన కారణాలు చూపించలేదు. ట్రెజరీ కార్యాలయంలో చెక్కులను రద్దు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్కులను రద్దు చేయాలంటే అందుకు తగిన కారణాలను చూపిస్తూ పంచాయతీ నుంచి అర్జీ ఉండాలి. కానీ, ఇక్కడ సర్పంచ్‌కు తెలియకుండానే చెక్కుల జారీ, నిధుల డ్రా, చెక్కుల రద్దు జరిగిపోయాయి. పైగా నిధుల డ్రాలో జరిగిన అవకతవకలపై ఆరోపణలు వచ్చిన తర్వాత వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. జూలై 25న చెక్కులతో నిధులు డ్రా కాగా.. వీటికి సంబంధించిన పాత పనులకు 2 నోట్‌ఫైల్స్‌పై ఆగస్టు 22న సర్పంచ్‌తో సంతకం చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. డీపీఓకు నివేదిక అందజేశాం.. బహదూర్‌గూడ పంచాయతీలో ఉప సర్పంచ్ సంతకం లేకుండా నిధుల డ్రాకు చెక్కులు జారీ అయ్యాయి. ఆయన ఫిర్యాదు చేయడంతో డీపీఓ ఆదేశాల మేరకు విచారణ జరిపాం. నివేదికను డీపీఓకు అందజేశాం. – ఎంపీఓ అన్నపూర్ణ -
బీజేపీలో జోష్
సాక్షి, శంషాబాద్: బీజేపీ అధినేత అమిత్ షా పర్యటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. శనివారం శంషాబాద్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్నారు. సాయంత్రం 4.25 గంటలకు అమిత్‌షా శంషాబాద్‌లోని కెఎల్‌సీసీ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత చూపంతా బీజేపీ వైపే ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయనడానికి బీజేపీకి చెందిన నలుగు ఎంపీల విజయమే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన చెస్తానని చెప్పిన ఒక్క పని కూడా పూర్తి చేయలేదన్నారు. ఎమ్మెల్సీ రాచందర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగాలు, ఉపాది పేరిట ఉద్యమాలు చేయించిన టీఆర్ఎస్ పార్టీ.. ఆ దిశగా మాట నిలపుకోలేదన్నారు. ఉద్యోగాల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం యువతను దగా చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలనను ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో బీజేపీ దేశంలోనే పటిష్టమైన పార్టీగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను అందిందని, అందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక శాఖమంత్రికి ధన్యవాదాలన్నారు. ఈ బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులు, పేద ప్రజల పక్షపాతిగా నిరూపించుకుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆమె చెప్పారు. బీజేపీలో చేరిన టీడీపీ నేత టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్ అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు అమిత్‌షా కాషాయం కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శంషాబాద్ మండలానికి చెందిన బుక్క వేణుగోపాల్ గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజేంద్రనగర్ టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. వేణుగోపాల్ చేరికతో శంషాబాద్‌తో పాటు జిల్లా పార్టీలో బీజేపీకి బలం చేకూరిందని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రేమ్‌రాజ్, జిల్లా కార్యదర్శి చింతల నందకిశోర్, రాష్ట్ర నాయకులు రాజ్‌భూపాల్‌గౌడ్, కొండ శేఖర్‌గౌడ్, మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, కె.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘కేంద్రం’ లేని కొత్త పురపాలికలు
సాక్షి, హైదరాబాద్: ‘శంషాబాద్’ పేరుతో ఈనెల 1న కొత్త మున్సిపాలిటీ ఆవిర్భవించింది. అయితే శంషాబాద్ మాత్రం ఇంకా గ్రామ పంచాయతీగానే కొనసాగుతోంది. హైదరాబాద్ శివార్లలోని చిన్నగొళ్లపల్లి, తొండుపల్లి, ఓట్పల్లి పంచాయతీలు విలీనమై శంషాబాద్ మున్సిపాలిటీ అవతరించగా.. మున్సిపల్ కేంద్రంగా ఆవిర్భవించాల్సిన శంషాబాద్‌కు వచ్చే ఏడాది ఏప్రిల్ 20 వరకు మున్సిపాలిటీ హోదా లభించే అవకాశం లేదు. ఏప్రిల్ వరకు శంషాబాద్ గ్రామ పంచాయతీ పాలక వర్గం పదవీకాలం కొనసాగనుండటమే ఇందుకు కారణం. ఇంకా సర్పంచ్ల పాలనలోనే.. ఈనెల 1, 2వ తేదీల్లో రాష్ట్రంలో 68 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కాగా, అందులో శంషాబాద్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కేంద్రాలు మాత్రం ఇంకా గ్రామ పంచాయతీలుగానే కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఐదు మున్సిపాలిటీలు భౌగోళికపరంగా పాక్షిక రూపంలో మాత్రమే ఏర్పటయ్యాయి. ఈ గ్రామ పంచాయతీల పాలకవర్గాలు పదవీ కాలం ముగిసే వరకు సర్పంచ్ల పాలనలో కొనసాగనున్నాయి. ఆ వెంటనే శివారు గ్రామ పంచాయతీల కలయికతో ఏర్పడిన సంబంధిత పురపాలికలో విలీనమై ఆయా పురపాలికల కేంద్రాలుగా ఏర్పడనున్నాయి. అప్పటి వరకు ఈ పురపాలికలకు పరిపాలన కేంద్రం ఉండదని, తాత్కాలికంగా వేరే ప్రాంతాల నుంచి పాలన వ్యవహారాలు నడిపిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో 173 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 68 పురపాలికల ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు గత మార్చిలో శాసనసభ రాష్ట్ర మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. గత సాంప్రదాయానికి భిన్నంగా స్థానిక ప్రజల అభిప్రాయంతో, గ్రామ పంచాయతీల తీర్మానంతో పనిలేకుండా.. నేరుగా కొత్త పురపాలికల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో గ్రామాలు/ఆవాసాలను విలీనం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ చట్టాలకు సవరణలు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే వాటికి మున్సిపాలిటీల హోదా లభిస్తుందని మున్సిపల్ చట్టాల్లో చేర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈనెల 1, 2వ తేదీలతో ముగిసిపోయింది. దీంతో ఆ వెంటనే రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి. అయితే శంషాబాద్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలు కేంద్రాలుగా ఏర్పడాల్సిన ఆయా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో వాటి పాలకవర్గాల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. -
నేడు స్వగ్రామంలో శరత్ అంత్యక్రియలు
-
ఖైరున్నిసాపై కరుణ చూపరూ
శంషాబాద్: ప్రేమగా అమ్మ చక్కెరను నోట్లో పోయదు... మారాం చేసినా నాన్న చాక్లెట్ కూడా కొనివ్వడు.. ఎందుకో ఆ చిన్నారికి అర్థం కాదు...? తల్లిదండ్రులు తనపై ఎందుకంత కఠినంగా ఉంటున్నారో ఆ పాపకు తెలియదు. ఐదేళ్లు నిండక ముందే తీపి తినే అదృష్టానికి తాను దూరమైందని చెప్పినా అర్థం చేసుకునే వయసు ఆ చిన్నారికి లేదు. కడుపు నింపుకోడానికే కష్టాల కడలి ఈదుతున్న ఆ కుటుంబానికి తియ్యని నవ్వులు పూయించే పాపకు వచ్చిన కష్టం వారిని కుంగదీస్తోంది. శంషాబాద్‌లోని అహ్మద్‌నగర్‌లోని అద్దెగదిలో నివాసముండే షేక్ షానూర్ పట్టణంలో విధుల్లో తిరుగుతూ చాయ్‌లు అమ్ముతూ జీవిస్తున్నాడు. ఆయన భార్య రేష్మా సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఏడాదిన్నర కిందట తమ చిన్నకూతురు ఖైరున్నీసా అతిమూత్ర విసర్జనతో పాటు తరచూ సొమ్మసిల్లి పడిపోతుండడంతో పరీక్షలు చేయించారు. చిన్నారికి మధుమేహం 400 పైగా ఉందని తేలింది. తక్షణ వైద్యసేవల కోసం వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నెలరోజుల పాటు కోమాలోకి వెళ్లిన పాపకు అక్కడి వైద్యులు చికిత్సలు నిర్వహించి ఎట్టకేలకు మాములు స్థితికి తీసుకొచ్చారు. తప్పని కష్టాలు... పాపకు మధుమేహం తీవ్రత ఉన్న కారణంగా రోజూ మూడుసార్లు తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజ„క్షన్లు ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. అప్పటి నుంచి పాపకు రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇన్సులిన్ వాడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎక్కడా ఇన్సులిన్‌ను ఉచితంగా ఇవ్వకపోవడంతో ప్రైవేటుగానే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. దీంతో పొట్టనింపుకోలేని ఆ కుటుంబానికి చిన్నారి వైద్య ఖర్చులు మరింత భారంగా మారిపోయాయి. ఇప్పటికే సుమారు రూ.2 లక్షలకు పైగా అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయారు. ఆర్థిక భారం భరించలేక పెద్దకుమారుడు, కుమార్తెను రాజేంద్రనగర్‌లోని చింతల్మెట్లో బంధువుల వద్ద ఉంచి చదివిస్తున్నారు. ఒకపక్క పాప పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే జీవనోపాధి కోసం పరుగులు పెడుతున్న ఆ కుటుంబం ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తోంది. పాపకు నిరంతర వైద్యం అందించేందుకు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వైద్యం చేయించలేని దుస్థితి.. మా పాపకు మా శాయశక్తులా అప్పులు చేసి వైద్య చేయిస్తున్నాం. ఏడాదిన్నర నుంచి రో జూ ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడుతున్నాం. జీవి తాంతం పాపకు మందులు, సూదులు ఇవ్వా లని డాక్టర్లు చెప్పారు. ఇన్సులిన్ ఇవ్వడంలో ఆలస్యం జరిగితే సొమ్మసిల్లి పడిపోతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం. రో జూ వీధుల్లో చాయ్ అమ్ముకుంటూ జీవిం చే నాకు పాప వైద్యం భారంగా మారు తోంది. దాతలు ఎవరైనా ఆర్థిక చేయూ తనిచ్చి ఆ దుకోవాలని వేడుకుంటున్నా. – షేక్ షానూర్, పాప తండ్రి పాపకు ఆర్థిక సాయం చేయదలుచుకుంటే.... చిన్నారి షేక్ ఖైరున్నిసా, తండ్రి షేక్ షానూర్ (జాయింట్ అకౌంట్ ) అకౌంట్ నం: 3601397468 శంషాబాద్, బ్రాంచ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
షాబాద్‌లో ‘వెల్స్పన్’ పరిశ్రమలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 3 పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లిలో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమలకు సంబంధించి.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి పెట్టుబడి రాయితీతోపాటు పెట్టుబడి రుణాలపై 8 ఏళ్లపాటు ఏడా దికి 8% చొప్పున వడ్డీ రీయింబర్స్మెంట్, పదేళ్ల పాటు ఉత్పత్తులపై రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు తదితర రాయితీలు అందజేస్తున్నారు. ఉలెన్, నాన్ ఉలెన్ వస్త్రాల పరిశ్రమ ఉలెన్ వస్త్రాలు, నాన్–ఉలెన్ వస్త్రాల ఉత్పత్తికి రూ.409 కోట్లతో 150 ఎకరాల్లో టెక్నికల్ టెక్స్ టైల్స్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పెట్టుబడి రాయితీ కింద రూ.40 కోట్లు ఇస్తున్నారు. దీని ద్వారా 686 మందికి ప్రత్యక్షంగా.. 1000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. కార్పెట్ల తయారీ పరిశ్రమ నేలపై వేసే ఫ్లోర్ కవరింగ్ కార్పెట్లు, ఎల్వీటీ తదితర ఉత్పత్తుల కోసం రూ.1,261 కోట్లతో 500 ఎకరాల్లో మరో టెక్నికల్ టెక్స్టైల్స్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రూ.80 కోట్ల పెట్టుబడి రాయితీ ఇస్తుండగా 1,000 మందికి ప్రత్యక్షంగా.. 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. లైన్‌పైప్‌ల తయారీ పరిశ్రమ: లైన్‌పైప్‌ల తయారీకి 266 కోట్లతో 150 ఎకరాల్లో పరిశ్రమను నిర్మించనున్నారు. దీనికి ప్రభుత్వం 10% పెట్టుబడి రాయితీ, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. -
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిపై భూకబ్జా కేసు
శంషాబాద్: భూకబ్జా కేసులో బీజేవైఎం జిల్లా అధ్యక్షడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సహా 9 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. శంషాబాద్ మండలం తోండుపల్లి గ్రామంలో భూకబ్జా చేశారనే ఆరోపణలతో తొమ్మిదిమందిపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 6/2 నుంచి 6/7 వరకు గల 18 ఎకరాల భూమిని కబ్జా చేశారని హైదరాబాద్‌కు చెందిన పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బైతి శ్రీధర్, టీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచేర్ల శ్రీనివాస్‌లతో పాటు శ్రీకాంత్, బైతి శ్రీనివాస్, రాచమల్ల రాజు, కుమార్, శ్రీశైలం, శేఖర్, ఆనంద్‌లపై శంషాబాద్ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. -
శంషాబాద్ జిల్లాలోకి మూడు మండలాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రతిపాదనలో భాగంగా శంషాబాద్ జిల్లాలో మూడు మండలాలను చేర్చనున్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
శంషాబాద్ లో కారు బీభత్సం
మూడు బైక్‌లను ఢీకొట్టిన కారు హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో శనివారం రాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు ముందు వెళ్తున్న మూడు బైక్‌లను ఢీకొట్టి, ఆపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక బైక్‌పై ఉన్న దంపతులతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వెంటనే రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మిగతా వాహనదారులకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పరారయ్యాడు. కారును పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అగచాట్లు
-
కెమికల్ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం
శంషాబాద్: రసాయన వ్యర్థాల యార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్‌పహాడ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని కెమికల్స్ డంపింగ్ యార్డులో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు రేగాయి. భారీగా మంటలు వ్యాపించటంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. యార్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.