బహదూర్‌గూడ పంచాయతీ కార్యాలయం
సాక్షి, శంషాబాద్: ప్రభుత్వం పంచాయతీల్లో బాధ్యతాయుత, పారదర్శక పాలన కోసం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, సంబంధిత శాఖ సిబ్బంది మాత్రం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పాలకవర్గం నిర్ణయాలను అమలు చేయాల్సిన పంచాయతీ కార్యదర్శి.. అందుకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగల్లో తొక్కి ఓ అడుగు ముందుకు వేశారు. సర్పంచ్ నుంచి నోట్ అప్రూవల్ లేకుండానే.. చెక్కులపై ఉపసర్పంచ్ సంతకం చేయకున్నా.. ఏకంగా 9,72,981 నిధుల డ్రా చేసేందుకు 7 చెక్కులను జారీ చేయించారు. విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో అధికారులు విచారణ జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శంషాబాద్ మండలం బహదూర్‌గూడ జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి జూలై 1 నుంచి 31 వరకు మెడికల్ సెలవుపై వెళ్లారు. దీంతో అధికారులు పెద్దగోల్కొండ పంచాయతీ కార్యదర్శి స్వప్నకు ఇ¯Œ చార్జి బాధ్యతలు అప్పగించారు. స్రవంతి సెలవుపై వెళ్లే నాటికి పంచాయతీ ఖాతాలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.7,99,475, సాధారణ నిధులు రూ.2,71,392 జమ ఉన్నాయి. ఆమె తిరిగి ఆగస్టు 1న తిరిగి విధుల్లో చేరారు. ఆ సమయానికి పంచాయతీ ఖాతాలో కేవలం రూ. 23,894 ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీ ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెలుసుకున్న ఉప సర్పంచ్ ప్రభాకర్.. తాను చెక్కులపై ఎలాంటి సంతకాలు చేయలేదని, నిధుల డ్రా విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆగస్టు 27న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
నిధుల డ్రాకు నిబంధనలు ఇవీ..
పంచాయతీ ఖాతాలో ఉన్న నిధులను డ్రా చేయడానికి నిబంధనల మార్పుతో పాటు కొత్త పద్ధతిని ఏర్పాటు చేశారు. ఐఎఫ్‌ఎంఐఎస్ సిస్టమ్‌తో నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. పంచాయతీ పరిధిలో చేపట్టిన పనులకు చెల్లించే డబ్బులకు పాలకవర్గం తీర్మానం చేసి మినిట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా పంచాయతీ కార్యదర్శి నిధుల డ్రాకు నోట్æ ఫైల్ రూపొందించాలి. ఈ నోట్ ఫైల్‌పై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐఎఫ్‌ఎంఐఎస్ సిస్టమ్‌లో పంచాయతీ పేరున ఉన్న యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, నిధుల డ్రాకు చెక్కులను జారీ తతంగాన్ని పంచాయతీ కార్యదర్శి చేయాల్సి ఉంటుంది.
ఇందుకు ప్రైమరీగా సర్పంచ్ సెల్‌నంబర్, మరోటి పంచాయతీ కార్యదర్శి సెల్ నంబర్లు జత చేయబడి ఉంటాయి. రెండు దశల్లో చేపట్టే ఈ ప్రక్రియకు సంబంధించి ఈ రెండు సెల్‌ఫో¯Œ నంబర్లకు ఓటీపీ వస్తుంది. అయితే, సదరు రెండు సెల్ నంబర్లకు ఒకటే తరహా ఓటీపీ నంబరు వస్తుండడంతో సర్పంచ్ ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి చేసుకోవచ్చు. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో మొదటి దశలో నిధుల వివరాలు, పనుల వివరాలను జత చేయాలి. తర్వాత ఆటోమేటిక్‌గా ఈ నిధులకు సంబంధించి చెక్కు జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన చెక్కులకు సంబంధించి నిధుల డ్రాకు అనుమతికి లేదా ఏవైనా పొరపాట్లు జరిగితే.. చెక్కులను రద్దు చేయడానికి రెండో దశలో కూడా ఓటీపీ నంబరుతో సదరు ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి చేపట్టాల్సి ఉంటుంది.
అసలు ఏం జరిగిందంటే..
బహదూర్‌గూడ పంచాయతీ గతంలో పెద్దగోల్కొండకు అనుబంధంగా ఉండేది. ఆ సమయంలో బహదూర్‌గూడలో కొన్ని పనులు చేపట్టారు. వీటికి సంబంధించి బిల్లులు చెల్లించలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటు సమయంలో.. గతంలో చేపట్టిన పనులు, చెల్లించాల్సిన బిల్లులకు సరిపడు నిధులను కేటాయించిన తర్వాత.. కొత్త పంచాయతీలకు నిధులను పంచారు. ఈ లెక్కన బహదూర్‌గూడలో ఉమ్మడి పెద్దగోల్కొండ పంచాయతీగా ఉన్న సమయంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు కేవలం పెద్దగోల్కొండ పంచాయతీ నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా బహదూర్‌గూడ పంచాయతీ నిధులను చెల్లించేందుకు స్కెచ్ వేశారు. ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న కార్యదర్శి స్వప్న.. బహదూర్‌గూడ సర్పంచ్, ఉప సర్పంచ్‌కు తెలియకుండానే నిధులను డ్రా చేశారు. నిధుల డ్రాకు కావాల్సిన నోట్ ఫైల్, చెక్కులపై ఉప సర్పంచ్ సంతకం లేకుండానే మూడు చెక్కులకు ట్రెజరీ కార్యాలయంలో అనుమతి ఇచ్చి రూ.5,17,838 నిధులు విడుదల చేశారు. వీటిలో రెండు చెక్కులు భూగర్భ మురుగు కాలువ పనులకు సంబంధించనవి కాగా.. ఒక చెక్కు పంచాయతీ సిబ్బంది వేతన బకాయిలకు చెందినవి ఉన్నాయి.
నాలుగు చెక్కులు రద్దు..
పంచాయతీ నిధులను డ్రా చేయడానికి కార్యదర్శి మొత్తం 7 చెక్కులను జారీ చేయించారు. అందులో మూడు చెక్కులు పాస్ అవగా.. మిగతా వాటిని రద్దు చేశారు. రద్దు చేయడానికి సరైన కారణాలు చూపించలేదు. ట్రెజరీ కార్యాలయంలో చెక్కులను రద్దు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్కులను రద్దు చేయాలంటే అందుకు తగిన కారణాలను చూపిస్తూ పంచాయతీ నుంచి అర్జీ ఉండాలి. కానీ, ఇక్కడ సర్పంచ్‌కు తెలియకుండానే చెక్కుల జారీ, నిధుల డ్రా, చెక్కుల రద్దు జరిగిపోయాయి.
పైగా నిధుల డ్రాలో జరిగిన అవకతవకలపై ఆరోపణలు వచ్చిన తర్వాత వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. జూలై 25న చెక్కులతో నిధులు డ్రా కాగా.. వీటికి సంబంధించిన పాత పనులకు 2 నోట్‌ఫైల్స్‌పై ఆగస్టు 22న సర్పంచ్‌తో సంతకం చేయించినట్లు విశ్వసనీయ సమాచారం.
డీపీఓకు నివేదిక అందజేశాం..
బహదూర్‌గూడ పంచాయతీలో ఉప సర్పంచ్ సంతకం లేకుండా నిధుల డ్రాకు చెక్కులు జారీ అయ్యాయి. ఆయన ఫిర్యాదు చేయడంతో డీపీఓ ఆదేశాల మేరకు విచారణ జరిపాం. నివేదికను డీపీఓకు అందజేశాం.
– ఎంపీఓ అన్నపూర్ణ
Comments
Please login to add a commentAdd a comment