సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా, అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ భవనాలు, గృహాలపై పురపాలక సంఘాలు కొరడా ఝళిపిస్తున్నాయి. అక్రమాలు, ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను జరిమానా కింద ప్రతి ఏటా అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో అక్రమ భవనాలు, గృహాల యజమానులు చెల్లించాల్సిన వార్షిక ఆస్తి పన్నులు 125 శాతం నుంచి 200 శాతం వరకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 142 పురపాలక సంఘాలు ఉండగా, జీహెచ్‌ఎంసీ నేరుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉంది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్(సీడీఎంఏ) పరిధిలో మిగిలిన 141 పురపాలికలు ఉన్నాయి. ఈ 141 పురపాలికల్లో ఇప్పటివరకు గుర్తించిన అక్రమ భవనాలు, గృహాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.93.15 కోట్ల జరిమానాలు విధించగా, ఇందులో రూ.31.08 కోట్లను సంబంధి త భవన యజమానులు చెల్లించారు. జీహెచ్‌ఎంసీ లో సైతంఇదే తరహాలో అక్రమ భవనాలు, గృహాలపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ వీటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంది.
వరంగల్, నిజామాబాద్‌ల్లో అత్యధిక జరిమానాలు
అనుమతి లేకుండా లేదా బిల్డింగ్ ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను ప్రతి ఏటా జరిమానా కింద అదనంగా వసూలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ 2016 డిసెంబర్ 20న జీవో 299 జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని పురపాలికల్లోని అక్రమ, అనధికార కట్టడాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. 141 పురపాలికల్లో వార్షిక ఆస్తి పన్నుల మొత్తం రూ.538.47 కోట్లతో పోల్చితే జరిమానాలు 17 శాతానికి మించి పోయాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. అక్కడ వార్షిక ఆస్తి పన్నుల మొత్తం డిమాండ్ రూ.49.94 కోట్లు కాగా, జరిమానాలు రూ.33.01 కోట్లు ఉండడం విశేషం. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.29.61 కోట్ల వార్షిక ఆస్తి పన్ను ఉండగా, రూ.18.19 కోట్ల జరిమానాలు విధించారు.
60 శాతం వసూళ్లు
జీహెచ్‌ఎంసీ మినహా ఇతర 141 పురపాలికల్లో 20,22,171 భవనాలు/గృహాలు ఆస్తి పన్నుల పరిధిలో ఉండగా, 2020–21లో రూ.538.47 కోట్ల ఆస్తి పన్ను, రూ.230.22 కోట్ల పాత బకాయిలు, రూ.93.15 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.861.84 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.359.81 కోట్ల ఆస్తి పన్ను, రూ.127.77 కోట్ల పాత బకాయిలు, రూ.31.08 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.518.66 కోట్లు వసూలయ్యాయి. మొత్తం డిమాండ్‌తో పోల్చితే ఇప్పటివరకు 60.18 శాతం వసూళ్లు జరిగాయి. వచ్చే మార్చి 31లోగా 100 శాతం వసూళ్లను సాధించేందుకు పురపాలక శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.
జరిమానాలు ఇలా..
జీవో ప్రకారం..అనుమతించిన ప్లాన్ మేరకు నిర్మించిన భవన అంతస్తుల్లో 10 శాతానికి లోబడి సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 25 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన అంతస్తుల్లో 10 శాతానికి మించి సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 50 శాతం ఆస్తి పన్నును అధికంగా వసూలు చేస్తున్నారు. ప్లాన్‌లో అనుమతించిన అంతస్తులపై అనధికారికంగా అంతస్తులు నిర్మిస్తే.. అలా అనధికారికంగా నిర్మించిన అంతస్తులపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment