illegal constuctions
-
గాజుల రామారంలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారుల కొరడా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్‌నగర్‌లలో హైడ్రా ఆధ్వర్యంలో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు.329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. బాలనగర్ ఏసీపీ హనుమంతరావు సమక్షంలో సూరారం, జగద్గిరిగుట్ట సీఐలు భరత్ కుమార్, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసుల భద్రతతో మూడు ప్రోక్లైన్లను ఉపయోగించి అక్రమంగా నిర్మించిన గదులను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.అయితే కూల్చివేతలను ఆక్రమణదారులు అడ్డుకోగా.. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. -
ఇప్పటం అక్రమ నిర్మాణాల తొలగింపు కేసు: పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి: ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చినా తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వాస్తవాలు తొక్కిపెట్టి స్టే ఉత్తర్వులు పొందినందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్లకు చురకలు అంటించింది. కాగా, ఇప్పటం రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు(మంగళవారం) హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చారని కోర్టు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాస్తవాలు తొక్కిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. -
Hyderabad: రూ.500 కోట్ల విలువైన భూములకు ఎసరు
సాక్షి, హైదరాబాద్: స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ)కి కేటాయించిన స్థలాన్ని అక్రమార్కులు హారతి కర్పూరంలా కరిగిస్తున్నారు. ఇక్కడి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. సర్వే నంబర్ల మాయాజాలంతో కొండలను పిండి ప్లాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లకు పైగా విలువచేసే 50 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలు కట్టారు.. ఇదేమని ప్రశ్నించేవారే లేకపోవడంతో కబ్జాదారుల ఆటలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఒకవైపు రెవెన్యూ.. మరోవైపు ఎస్ఎఫ్సీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2007లో ఎస్ఎఫ్సీకి కేటాయింపు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్వేనంబర్ 307లోని 317 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సుమారు 249 ఎకరాలకుపైగా స్థలాన్ని 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఎఫ్సీకి స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ఆ స్థలానికి ఎటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాదారులకు కలిసి వచ్చింది. దీంతో పక్కనే ఉన్న సర్వే నంబర్ల ఆధారంగా పెద్ద పెద్ద కొండలను కరిగించి ప్లాట్లు చేస్తూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ వచ్చారు. ఇలా ఏకంగా 50 ఎకరాలకు పైగానే అన్యాక్రాంతమైందని రెవెన్యూ అధికారుల సర్వేలో తేలింది. ఇంత జరుగుతున్నా ఇప్పుడు ఆ స్థలాలను కా పాడే రెవెన్యూ అధికారులు, ఎస్ఎఫ్సీ సిబ్బంది కబ్జాదారులకు వత్తాసుగా నిలవడంతో ఆ స్థలం మొత్తం అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నా యని పలువురు అధికారుల తీరుపై అనుమానా లు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ స్థలం విషయంపై హైకోర్టులో కేసు నడుస్తుండగా ఢిల్లీలో జరిగిన విభజన హామీ విషయంలో మొదటి ప్రాధాన్యం ఈ స్థలంపైనే ఉండడం విశేషం. ప్రైవేటు స్థలమంటూ.. ∙సర్వే నంబర్ 307 ప్రభుత్వ స్థలంలో చుట్టూ సర్వే చేసిన మ్యాప్‌ను కబ్జాదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సర్వే నంబర్ 325, 326ల పక్కనే ఓ కొండ ఉండేది. ఇప్పుడు అది కనిపించకుండా పోయింది. దీని వెనక సూత్రధారులు.. పాత్రధారులు ఎవరనే విషయం అంతు చిక్కకుండా మారింది. ప్రభుత్వ సర్వే నంబర్‌ను ఆనుకొని ఉన్న ఈ కొండ మాయం కావడం వెను క ఓ మండల రెవెన్యూ ‘సర్వే’ అధికారి అన్నీ తా నే చూసుకోగా కబ్జాదారులు తమ పని పూర్తి చేశా రు. ఏకంగా సుమారు 30 ఎకరాలపై గాని కలుపుకొని ప్లాటింగ్ చేసి ఎటువంటి అనుమతులు లేకుండా గదులు నిర్మించి ఖాళీగా వదిలేశారు. ఎక్కడైనా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేయాల్సిన బాధ్యత రెవిన్యూ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఎస్ఎఫ్సీ అధికారుల బాధ్యత. కానీ ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపే నాథుడే లేకుండా పోయాడు. దీంతో ఎస్ఎఫ్సీ భూములు రోజురోజుకూ హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. అధికారులు మేల్కొనకపోతే మిగిలిన స్థలం సైతం ప్రైవేట్ సర్వే నంబర్లతో ప్లాట్లు చేసి అక్రమార్కులు విక్రయించే ప్రమాదం పొంచి ఉంది. ఎవరినీ వదిలిపెట్టం.. ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ ఫోర్స్ ఎక్కువగా కావాలి. ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమవుతోంది. తప్పకుండా వారం పది రోజుల్లో ఎస్ఎఫ్సీ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తాం. ఇప్పటికే పలువురుపై ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేస్తాం. ఇక్కడ జరుగుతున్న అనుమతుల వెనక ఎవరు ఉన్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమార్కులపైపై కఠిన చర్యలు తీసుకుంటాం. - సంజీవరావు, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ -
Noida twin towers: కట్టేందుకు మూడేళ్లు... కూల్చేందుకు...తొమ్మిదే సెకన్లు
మూడేళ్ల పాటు నిర్మించిన ఆకాశ హర్మ్యాలవి. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం కానున్నాయి. నోయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకూ ఈ ట్విన్ టవర్స్‌ను ఎలా కూలుస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆగస్టు 28. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ జంట భవనాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తులున్న ఈ భవనాలను ఆగస్టు 21నే కూల్చేయాల్సి ఉన్నా భద్రతా ఏర్పాట్లకు అధికారులు గడువు కోరడంతో 28కి వాయిదా పడింది. ఏం జరిగింది? నోయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్‌లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది. పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్‌కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. దాంతో ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు ఈ నెలలో తుది గడువు ప్రకటించింది. భద్రతా ఏర్పాట్లు ఇలా ? ► ఇంత ఎత్తైన భవనాల కూల్చివేత వల్ల పరిసర ప్రాంతాలకు, ఇతర నివాసాలకు నష్టం లేకుండా చూడటం సవాలుగా మారింది. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు చేపట్టారు. ► ట్విన్ టవర్స్ సమీపంలోనిఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీస్‌లో నివసిస్తున్న 5 వేల మందిని ఆగస్టు 28న ఖాళీ చేయిస్తున్నారు. ఉదయం 7.30కి ఇళ్లు వీడి, సాయంత్రం ఎడిఫస్ కంపెనీ చెప్పాకే తిరిగి రావాలి. ► వారికి చెందిన 1200 వాహనాలను కూడా తరలిస్తున్నారు. ► టవర్స్ సమీపంలోని నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకల్ని మధ్యాహ్నం 2.15 నుంచి 2.45వరకు నిలిపివేస్తారు. ► జంట భవనాలున్న ప్రాంతంలోకి ఆగస్టు 28 రోజంతా ప్రజలు, వాహనాలు, జంతువులు ఎవరినీ రానివ్వరు. ► చుట్టుపక్కల భవనాల్లోకి ధూళి, సిమెంట్ ముక్కలు పోకుండా మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు. ► పేల్చివేతతో చుట్టుపక్కల భవనాలకు నష్టం జరగకుండా జంట భవనాల చుట్టూ కందకం తవ్వారు. అదనపు భద్రత కోసం మధ్యలో అతి పెద్ద కంటైనర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► చుట్టుపక్కల భవనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఎడిఫస్ కంపెనీ రూ.100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది! ► అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇలా కూలుస్తారు... ► కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30కు కంట్రోల్డ్ ఇంప్లోజన్ టెక్నిక్ సాయంతో కూల్చివేత జరుగుతుంది. ► రెండు భవనాలూ తొమ్మిది సెకండ్లలో పేక మేడలా నేలకొరుగుతాయి. దీన్ని ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ► 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. ► కూల్చివేతకు 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు. ► సియాన్ టవర్‌లో పేలుడు పదార్థాలు నింపడం పూర్తయింది. ఎపెక్స్నూ పూర్తి కావచ్చింది. ► హర్యానాలోని పల్వాల్లో పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) నుంచి పేలుడు పదార్థాలు తెప్పిస్తున్నారు. ► కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. ► కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా. వీటి తొలగింపుకే కనీసం మూణ్నెల్లు పడుతుంది. వీటి డంపింగ్‌కు సూపర్‌టెక్ కంపెనీ 5 హెక్టార్లు కేటాయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బుల్డోజర్ రాజ్యం!
భారత రాజకీయ నిఘంటువులో కొత్తగా చేరిన పదం బుల్డోజర్. పరిహాసంగా మొదలైన బుల్ డోజర్ అనే మాట ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాస్త్రమై, చివరకు దేశమంతటా ఊడలు దిగుతోంది. మతఘర్షణలకు కారకులైన వారి ఇళ్ళనూ, ఆస్తులనూ బుల్డోజర్లతో కూల్చివేయడం మొదలుపెట్టి ‘బుల్డోజర్ బాబా’ అనిపించుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడది అనేక బీజేపీ పాలిత ప్రాంతాలకు ఆదర్శమైంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ళు రువ్వారని ఆరోపణలొచ్చిన చోట అక్కడి సీఎం శివరాజ్ చౌహాన్ ఇళ్ళ కూల్చివేతల మంత్రం ప్రయోగించి, ‘బుల్డోజర్ మామ’ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఏకంగా 9 జేసీబీ బుల్డోజర్లతో అదే సీన్. కర్ణాటకలోని హుబ్బలి హింసాకాండలోనూ తక్షణ బుల్డోజర్ న్యాయం ప్రస్తావనే. మహారాష్ట్రలో నవనిర్మాణ సేన నేత రాజ్‌థాకరే ఏకంగా మసీదుల నుంచి ప్రార్థన పిలుపు (‘అజాన్)ను వినిపించే లౌడ్స్పీకర్లను మే 3 కల్లా తొలగించాలంటున్నారు. లేదంటే పోటీగా మరింత గట్టిగా హనుమాన్ చాలీసా వినిపిస్తామనీ తొడ కొడుతున్నారు. వెరసి, మనుషుల మధ్య మత విద్వేషాన్ని రగిలిస్తున్న తాజా ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. దేశరాజధాని ఘటనకొస్తే – పేరుకు ఢిల్లీ ఒకటే అయినా, సామాజిక, ఆర్థిక కోణాలలో అది అనేకానేక ఢిల్లీల సముదాయం. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారు సైతం పలువురున్న జహంగీర్‌పురిలోని కుశల్చౌక్ ప్రాంతం కేవలం కొద్ది గజాల తేడాలోనే మందిరం, మసీదు – రెండూ ఉన్న శాంతియుత సహజీవన ప్రతీక. కానీ, పోలీసుల అనుమతి లేకనే, చేతులో కత్తులు, తుపాకులతో ఏప్రిల్ 16న సాగిన హనుమాన్ జయంతి యాత్ర రేపిన ఘర్షణతో తంటా వచ్చింది. కొద్దిరోజులుగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా, ఉద్విగ్నంగా మారిపోయింది. దోషులు ఎవరైనా శిక్షించాల్సిందే. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా, అవి ఏ వర్గానికి చెందినవైనా సరే చర్య చేపట్టాల్సిందే. కానీ, రోహింగ్యాలు, బంగ్లాదేశీల పేరుతో అమాయకులైన శ్రామికులకు, అదీ ఒకే వర్గానికి చెందినవారి షాపులనే కూల్చివేశారని ప్రత్యక్ష సాక్షుల కథనం. 1970ల నుంచి ఉన్న షాపుపై, అదీ అధికారిక కాగితాలన్నీ పక్కాగా ఉన్న దానిపై బుల్డోజర్ ప్రయోగం పరాకాష్ఠ. ఏళ్ళ తరబడిగా ఈ నిర్మాణాలున్నా, తాము అధికారంలోకి వచ్చి ఏళ్ళు గడిచినా... నిన్నటి దాకా గుర్తు లేని జహంగీర్‌పురి అక్రమ కట్టడాలు ఉన్నట్టుండి ఇప్పుడే తెరపైకి రావడమే విచిత్రం. పైపెచ్చు, కేవలం ఒక ధార్మిక స్థలం ముంగిట దుకాణాలనే కూల్చివేసి, ఆ పక్కనే ఉన్న మరో ధార్మిక స్థలం చుట్టూ నిర్మాణాల ఊసే ఎత్తకపోవడం మరీ విడ్డూరం. ముందస్తు నోటీసుల లాంటివేమీ లేకుండా, తెల్లవారుతూనే బుల్డోజర్లతో విరుచుకుపడడం అసాధారణం. యథాతథ స్థితి కొనసాగించాల్సిందిగా దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా సరే, ఆ తర్వాత కనీసం గంటన్నర సేపు కూల్చివేత సాగడం కోర్టు ధిక్కారం కాదా? అధికారిక ఉత్తర్వులు అందలేదనే మిషతో అధికారులు న్యాయస్థానం ఆదేశాన్ని సైతం పెడచెవిన పెట్టవచ్చా? నాలాపై అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయన్నా, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందన్నా ఇన్నేళ్ళు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? తాజా శోభాయాత్ర ఘటనకు ప్రతిగానో, ప్రతీకారంగానో ఈ చర్య చేపట్టారంటే ఏం జవాబిస్తారు? యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ – అన్నిటా ఒకటే వర్గాన్ని లక్ష్యంగా చేసుకొన్న కూల్చివేతల్ని చూస్తే, మనుషుల్ని మరింతగా విడదీస్తున్నారని అనుమానాలు రేగడం సహజం. నిజానికి, ఈ నిరంకుశ రాజ్యాధికారానికి కూలిపోతున్నది ఇళ్ళు, షాపులు కాదు... న్యాయపాలన, రాజ్యాంగం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారి నుంచి నష్టపరిహారం వసూలు ఆదేశాలతో మొదలుపెట్టిన యూపీ సర్కార్ రెండేళ్ళ క్రితం దాన్ని ఏకంగా చట్టం చేసింది. బుల్డోజర్లతో భయపెట్టడం యూపీ నుంచి ఢిల్లీ దాకా పాకింది. ఘర్షణలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఇళ్ళ కూల్చివేత సామూహిక శిక్ష విధింపు కిందే లెక్క. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం కింద సామాన్యుడికి సంక్రమించిన గృహ నివాస హక్కును కాలరాయడమే అని నిపుణుల మాట. కొద్ది నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం మతవిద్వేష ప్రయత్నాలు, ఘర్షణలు సాగుతున్నాయి. అయితే ముందే పసిగట్టి, ఘర్షణల్ని నివారించడంలో వ్యవస్థాగత వైఫల్యం వెక్కిరిస్తోంది. మరో పక్క చట్టబద్ధంగా పని చేయాల్సిన పోలీసులను, పాలకుల ఆదేశా లను మాత్రమే పాటించే గులాములుగా మారుస్తుండడం ఇంకో సమస్య. సమాజంలోని సాంస్కృతిక, ధార్మిక భేదాలను గుర్తించి, అంగీకరించే పెద్ద మనసు ప్రజలకున్నా, పాలకులు ఉండనిచ్చేలా లేరు. జేసీబీ అంటే ‘జిహాద్ కంట్రోల్ బోర్డ్’ లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఏం చెప్పదలుకున్నారు? భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతిని ఏం చేయదలుచుకున్నారు? భావోద్వేగాలు పెంచి, పరమత సహనాన్ని హననం చేసినందు వల్ల ఎవరికి లాభం? ‘తొక్కుకుంటూ పోవాలె... ఎదురొచ్చినవాణ్ణి ఏసుకుంటూ పోవాలె’ లాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయేమో కానీ, ప్రజాస్వామ్యంలో సరిపడవని పాలకులు మర్చిపోతే కష్టం. కూల్చివేస్తున్నది కట్టడాలను కాదు... శతాబ్దాల సహజీవన పునాదిపై నిర్మాణమైన సామరస్యాన్ని అని గ్రహించకపోతే సమాజానికే తీరని నష్టం. పాలకుడనే వాడు ఎప్పటికైనా గెలవాల్సింది – తాత్కాలికమైన ఎన్నికలను కాదు... విభిన్న వర్గాల ప్రజల మనసుల్ని! -
ఉల్లంఘనలపై ఉక్కుపాదం
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ దాడులు కొనసాగుతున్నాయి. జనవరి 17 నుంచి ఇప్పటి వరకు 168కిపైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వాటిలో చాలా వరకు 600 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన బహుళ అంతస్తుల భవనాలు, గోదాములు వంటి భారీ నిర్మాణాలున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు అధికారులు నాలుగు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో బడంగ్పేట్, శంకర్పల్లి మున్సిపాలిటీల్లో ఎక్కువ అక్రమాలు ఉన్నట్లు అధికారులు గు ర్తించారు. ఆ తర్వాత మేడ్చల్, పోచంపల్లిలో ఎక్కు వ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ‘కూల్చివేసిన చోట తిరిగి నిర్మాణాలు చేపట్టకుండా గట్టి నిఘాను ఏర్పా టు చేశాం. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం ఎ ప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఎలాంటి ఉల్లంఘన లు చోటుచేసుకొన్నా గట్టి చర్యలు ఉంటాయి’.అని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారీ నిర్మాణాలే ఎక్కువ... రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సుమారు 927 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే మొత్తం 459 వరకు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం 600 చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో చేపట్టినవే. నిబంధనల మేరకు టీఎస్–బీపాస్ నుంచి నేరుగా అనుమతులు పొందే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది భవననిర్మాణ యజమానులు గ్రామపంచాయతీల నుంచి జీ+2 కోసం అనుమతులను పొంది అక్రమంగా 5 అంతస్తులు, అంతకంటే ఎక్కువ స్థాయిలో నిర్మాణాలు కొనసాగించారు. బడంగ్పేట్, శంకర్పల్లి, దుండిగల్లలో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు కూల్చివేసిన వాటిలో అనుమతులు లేనివి, ఆమోదించిన లే– అవుట్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించినవే ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలను, చెరువు భూములను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కొనసాగుతున్న దాడులు... జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీంలు హెచ్ఎండీఏ పర్యవేక్షణలో గత నెల 17 నుంచి దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 168 అక్రమాలను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం జవహర్‌నగర్ పరిధిలో నాలుగు, చౌటుప్పల్ పరిధిలో మరో రెండింటిని కూల్చివేశారు. బండ్లగూడ జాగీర్, ఘట్కేసర్, బోడుప్పల్, దమ్మాయిగూడ, మణికొండ, నిజాంపేట్, తదితర ప్రాంతాల్లో అక్రమాలపై హెచ్ఎండీఏ కొరడా ఝళిపించింది. దాడులను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారి చెప్పారు. -
TS: న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తున్న వారు తమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు అడ్డుకోకుండా సివిల్ కోర్టులను ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందుతూ న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. నిర్మాణాలు పూర్తయ్యాక ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవడం లేదా హాజరుకాకుండా ఉంటున్నారని పేర్కొంది. ఒక్క అంబర్‌పేట డివిజన్‌లోనే ఈ తరహాలో సివిల్ కోర్టుల్లో 189 పిటిషన్లు దాఖలుచేసి మధ్యంతర ఉత్తర్వులు పొందారని, జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్‌లో ఇలాంటి వేలాది పిటిషన్లు దాఖలై ఉంటాయని పేర్కొంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయరాదంటూ హైకోర్టు సివిల్ కోర్టులను ఆదేశించినా సివిల్కోర్టులను ఆశ్రయించి ఉత్తర్వులు పొందుతూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి తగిన ఉత్తర్వులు జారీచేయాలని, ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడంపై దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి..అంబర్‌పేట సర్కిల్లో ఎంతమంది సివిల్ కోర్టులను ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొంది నిర్మాణాలు చేపట్టారో పేర్కొంటూ నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పాశం కృష్ణారెడ్డిని ఆదేశించారు. 189 మంది ఇలా అక్రమ నిర్మాణాలు పూర్తి చేసినట్లు కృష్ణారెడ్డి వివరించారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఈ సివిల్ కేసుల్లో ఆయా వ్యక్తులు హాజరుకావడం లేదని, దీంతో కోర్టు వాటిని కొట్టివేస్తోందని తెలిపారు. -
లాక్డౌన్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు
సాక్షి, ముంబై: లాక్డౌన్ సమయంలో ముంబైతోపాటు ఉప నగరాల్లో అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా కారణంగా అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునే బీఎంసీ సిబ్బంది కరోనా నియంత్రించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తోంది. 2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి కాలవ్యవధిలో బీఎంసీ కార్యాలయానికి ఏకంగా 13 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో కేవలం 466 అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. తనిఖీలు లేక.. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల ప్రభుత్వ, బీఎంసీ అధికారులెవరూ కార్యాలయాల నుంచి బయటపడలేదు. ముఖ్యంగా మురికివాడల్లోకి తనిఖీలకు వెళ్లలేదు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు మురికివాడల్లో ఖాళీ ఉన్న స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అనేక ఇళ్లపై రెండు, మూడు అంతస్తులు అక్రమంగా నిర్మించుకున్నారు. కరోనా నియంత్రణ పనుల్లో 90 శాతం సిబ్బంది గత సంవత్సరం కరోనా వైరస్ తెరమీదకు రావడంతో బీఎంసీ అధికారులు, ఇతర సిబ్బంది మహమ్మారిని నియంత్రించే పనులు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి మార్గదర్శనం చేయడం, కరోనా విస్తరించకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై సలహాలివ్వడం, మాస్క్‌లు, మందులు పంపిణీ చేయడం, రోగులను ఆస్పత్రులకు చేర్చడం తదితర విధుల్లో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత కోవిడ్ సెంటర్లు, జంబో కోవిడ్ కేంద్రాల నిర్మాణం, అందులో రోగులకు కల్పించాల్సిన సదుపాయాలపై ప్రధానంగా దృష్టిసారించారు. ఇలా 90 శాతం సిబ్బంది కరోనా నియంత్రణ పనుల్లోనే బిజీ అయ్యారు. దీంతో నగరంలో, మురికివాడల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే సమయం దొరకలేదు. కనీసం పర్యటించడానికి కూడా వెళ్లలేదు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకునేందుకు వెళ్లాలంటే తగినంత సిబ్బంది అందుబాటులో లేరు. బాధితులు తిరగబడకుండా బీఎంసీ సిబ్బందికి రక్షణగా వెళ్లే పోలీసులు కూడా కరువయ్యారు. దీంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల ద్వారా తెలిసినా అధికారులు వెళ్లలేకపోయారు. దీన్ని క్యాష్ చేసుకున్న మురికివాడల్లోని కొందరు ఇష్టమున్నట్లు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అత్యధికంగా అక్రమ నిర్మాణాలు తూర్పు ఉప నగరంలోని కుర్లా, గోవండీ, మాన్‌ఖుర్ద్ ప్రాంతాల్లో జరిగాయి. ఈ ప్రాంతాల నుంచి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన 1,200–3,250 వరకు ఫిర్యాదులు వచ్చాయి. -
అక్రమ కట్టడాలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహించిన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు వారి పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు? ఆ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎన్ని అక్రమ భవనాలను కూల్చివేశారు? ఎంత మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు? జీహెచ్ఎంసీ నోటీసులపై న్యాయస్థానాలు స్టే ఉత్తర్వులు ఇచ్చిన కేసులు ఎన్ని? వాటిలో స్టే ఉత్తర్వులను తొలగించాలంటూ ఎన్ని కేసుల్లో పిటిషన్లు దాఖలు చేశారు? స్టే ఉత్తర్వులను తొలగించాలని పిటిషన్లు దాఖలు చేయకపోతే అందుకు కారణాలేంటి? తదితర వివరాలతో పూర్తి నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కూకట్పల్లి ప్రాంతంలో గ్రామ కంఠం భూమిలో నిర్మించిన భవనాన్ని కూల్చివేస్తామంటూ జీహెచ్ఎంసీ అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన గొట్టిముక్కల నాగేశ్వర్రావు, జి. నర్సింగ్‌రావులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించారని, ఈ నేపథ్యంలో కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వడంతో హైకోర్టును ఆశ్రయించారని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. -
అక్రమ ఇళ్లపై అదనపు పన్ను
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా, అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ భవనాలు, గృహాలపై పురపాలక సంఘాలు కొరడా ఝళిపిస్తున్నాయి. అక్రమాలు, ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను జరిమానా కింద ప్రతి ఏటా అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో అక్రమ భవనాలు, గృహాల యజమానులు చెల్లించాల్సిన వార్షిక ఆస్తి పన్నులు 125 శాతం నుంచి 200 శాతం వరకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 142 పురపాలక సంఘాలు ఉండగా, జీహెచ్ఎంసీ నేరుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉంది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్(సీడీఎంఏ) పరిధిలో మిగిలిన 141 పురపాలికలు ఉన్నాయి. ఈ 141 పురపాలికల్లో ఇప్పటివరకు గుర్తించిన అక్రమ భవనాలు, గృహాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.93.15 కోట్ల జరిమానాలు విధించగా, ఇందులో రూ.31.08 కోట్లను సంబంధి త భవన యజమానులు చెల్లించారు. జీహెచ్ఎంసీ లో సైతంఇదే తరహాలో అక్రమ భవనాలు, గృహాలపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ వీటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంది. వరంగల్, నిజామాబాద్‌ల్లో అత్యధిక జరిమానాలు అనుమతి లేకుండా లేదా బిల్డింగ్ ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను ప్రతి ఏటా జరిమానా కింద అదనంగా వసూలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ 2016 డిసెంబర్ 20న జీవో 299 జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని పురపాలికల్లోని అక్రమ, అనధికార కట్టడాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. 141 పురపాలికల్లో వార్షిక ఆస్తి పన్నుల మొత్తం రూ.538.47 కోట్లతో పోల్చితే జరిమానాలు 17 శాతానికి మించి పోయాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. అక్కడ వార్షిక ఆస్తి పన్నుల మొత్తం డిమాండ్ రూ.49.94 కోట్లు కాగా, జరిమానాలు రూ.33.01 కోట్లు ఉండడం విశేషం. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.29.61 కోట్ల వార్షిక ఆస్తి పన్ను ఉండగా, రూ.18.19 కోట్ల జరిమానాలు విధించారు. 60 శాతం వసూళ్లు జీహెచ్ఎంసీ మినహా ఇతర 141 పురపాలికల్లో 20,22,171 భవనాలు/గృహాలు ఆస్తి పన్నుల పరిధిలో ఉండగా, 2020–21లో రూ.538.47 కోట్ల ఆస్తి పన్ను, రూ.230.22 కోట్ల పాత బకాయిలు, రూ.93.15 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.861.84 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.359.81 కోట్ల ఆస్తి పన్ను, రూ.127.77 కోట్ల పాత బకాయిలు, రూ.31.08 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.518.66 కోట్లు వసూలయ్యాయి. మొత్తం డిమాండ్‌తో పోల్చితే ఇప్పటివరకు 60.18 శాతం వసూళ్లు జరిగాయి. వచ్చే మార్చి 31లోగా 100 శాతం వసూళ్లను సాధించేందుకు పురపాలక శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. జరిమానాలు ఇలా.. జీవో ప్రకారం..అనుమతించిన ప్లాన్ మేరకు నిర్మించిన భవన అంతస్తుల్లో 10 శాతానికి లోబడి సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 25 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన అంతస్తుల్లో 10 శాతానికి మించి సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 50 శాతం ఆస్తి పన్నును అధికంగా వసూలు చేస్తున్నారు. ప్లాన్‌లో అనుమతించిన అంతస్తులపై అనధికారికంగా అంతస్తులు నిర్మిస్తే.. అలా అనధికారికంగా నిర్మించిన అంతస్తులపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. -
నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లకు ఏమైంది!
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సదరు నిర్మాణాలు పూర్తయినా కూడా వాటిని వదిలిపెట్టడం లేదు. ఇటీవల నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ గోపి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మించిన 103 భవనాలను గుర్తించి సీజ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నప్పుడు అనుమతులతో జీ ప్లస్–4 అంతస్తులు నిర్మించారు. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ మూడు గ్రామాలు కలిపి కార్పొరేషన్‌గా గత సంవత్సరం ఏర్పాటైంది. అంతకు ముందు వచ్చే నుంచే విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కమిషనర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడంతో యజమానులు, కాంట్రాక్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి బిల్డర్లు నిర్మాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ముకుందరెడ్డి గత ఏడాది నవంబరు 1న అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది మే 16న ప్రస్తుత కమిషనర్ గోపి సుమారు 1000కి పైగా అక్రమ నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖ రాశారు. కరోనా ప్రభావం, ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడం పనులు నిలిచాయి. యథాతథంగా పనుల నిర్వహణ.. కార్పొరేషన్ అధికారులు ఇటీవల సీజ్ చేసిన భవనాల్లో యథాతథంగా పనులు కొనసాగుతున్నాయి. సీజ్ చేసిన తర్వాత అధికారులు తమ పని పూర్తయినట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పనులు జరుగుతున్న విషయం తెలిసినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ప్రాథమిక దశలోనే నిర్మాణాలను అడ్డుకుంటే ఎవరికీ నష్టం జరగదని, నిర్మాణం పూర్తయిన తర్వాత సీజ్ చేస్తే ఎలా అని పలువురు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం ఉపేక్షించం.. సీజ్ చేసిన అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశాం. అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు ఇవ్వాలని కోరాం. అన్నీ పరిశీలించిన తర్వాతే అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 103 భవనాలను సీజ్ చేశాం. – గోపి, కమిషనర్, నిజాంపేట్ కార్పొరేషన్ -
అక్రమ కట్టడాలకు ‘యాప్’తో అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాల దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. సాంకేతిక పరిజ్ఞానంతో వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం ‘అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (యూసీఐఎంఎస్) పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ విధానం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ యాప్ సహకారంతో రాష్ట్రంలోని 120 పట్టణ స్థానిక సంస్థలు, 17 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో అక్రమ, అనధికార నిర్మాణాలకు చెక్ పెట్టనున్నారు. వార్డు సచివాలయ స్థాయి నుంచి పురపాలక శాఖ టౌన్ ప్లానింగ్ డైరెక్టరేట్ స్థాయి వరకు ఈ యాప్ అనుసంధానమై ఉంటుంది. దీనిపై ఇప్పటికే 3,775 వార్డు సచివాలయాల్లో ప్రణాళిక కార్యదర్శులకు అవగాహన కల్పించారు. త్వరలో ఈ యాప్‌ను అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు. యాప్ పనితీరు ఇలా.. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఏటా సగటున 40 వేల వరకు అక్రమ, అనధికార, అనుమతులకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు భవన నిర్మాణ అనుమతులకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. వార్డు సచివాలయాల్లోని ప్రణాళిక కార్యదర్శులు తమ పరిధిలో ఎక్కడైనా అనధికార, అక్రమ నిర్మాణం జరుగుతోందన్న సమాచారం వస్తే అక్కడికి వెళ్లి ‘యూసీఐఎంఎస్’ యాప్ ద్వారా వివరాలను అప్లోడ్ చేస్తారు. అనధికార నిర్మాణాలు, అనుమతుల ఉల్లంఘన, ఆక్రమణ స్థలాల్లో నిర్మాణాలు అనే మూడు అంశాల్లో సంబంధిత నిర్మాణం ఏ కేటగిరీ కిందకు వస్తుందో గుర్తించి వివరాలు నమోదు చేస్తారు. నాలుగు కోణాల్లో మొబైల్‌తో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ సమాచారం మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగం, రాజధానిలోని టౌన్ ప్లానింగ్ డైరెక్టరేట్‌కు చేరుతుంది. అధికారులు వెంటనే ఆ నిర్మాణాన్ని నిలిపి వేయడంతోపాటు ఇతర చర్యలకు సిఫార్సు చేస్తారు. నిర్మాణ దారునికి నోటీసు జారీ చేస్తారు. విషయ తీవ్రతను బట్టి నిర్ణీత సమయంలో చార్జిషీట్ నమోదు చేసి.. అనుమతులకు ఫీజు, జరిమానా విధించడమో లేదా నిర్మాణాన్ని జప్తు చేయడమో.. కూల్చి వేయడమో జరుగుతుంది. సామాన్యులకు ప్రయోజనం అక్రమ, అనధికార నిర్మాణాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందరో కొనుగోలుదారులు మోసపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయం కోల్పోతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. దాంతో అక్రమ కట్టడాలను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. - వి.రాముడు, డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ విభాగం, పురపాలక శాఖ -
అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ కొరడా
సాక్షి, అమరావతి: కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ఎగువన నిర్మించిన అక్రమ కట్టడాలపై మరోసారి సీఆర్డీఏ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన శైవ క్షేత్రానికి 2014 నుంచి నోటీసులు ఇస్తున్నామని... వాటిపై యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో అధికారులు గురువారం అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. నదీ గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు ప్రొక్లెయిన్ల సహాయంతో కూల్చి వేస్తున్నారు. త్వరలోనే మిగిలిన కట్టడాలను ఇదే రీతిలో తొలగిస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
విజయవాడ : కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కృష్ణా నదీ తీరంపై అక్రమ కట్టడాలుగా గుర్తించిన 24 నిర్మాణాలకు ప్రాధమికంగా సీఆర్డీఏ నోటీసులు జారీ చేయగా, వాటిలో ఐదు నిర్మాణాల యజమానులు ఇచ్చిన వివరణలు సహేతుకంగా లేకపోవడంతో వాటిపై తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నిర్మాణాలను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపడతారు. ఇక మిగిలిన 19 అక్రమ నిర్మాణాలపై ఆయా యజమానులు ఇచ్చిన వివరణను సీఆర్డీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో కృష్ణ నదీ సమీపంలో పాతూరు కోటేశ్వరరావు నిర్మించిన అక్రమ కట్టడానికి జూన్ 6న నోటీసులు జారీ చేశామని సీఆర్డీఏ పేర్కొంది. సంబంధిత అధికారుల నుంచి, రివర్ కన్జర్వేటర్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై నోటీసులు జారీ చేశారు. భవన యజమాని ఇచ్చిన వివరణలో ఏమాత్రం సహేతుకత లేకపోవడంతో అధికారులు సోమవారం నిర్మాణాన్ని కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదిపై నిర్మించిన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు చేపడతామని సీఆర్డీఏ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. -
అంతా అక్రమార్కుల ప్లాన్ ప్రకారమే!
సాక్షి, మెదక్: అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అధికారులే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ రోడ్డులో వెలిసిన కట్టడాలను తొలగించకుండా చోద్యం చూస్తుండడంతో పాటు సదరు యజమానులకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. లోపాయికారి ఒప్పందాలతో ‘అక్రమార్కుల మాస్టర్‌ప్లాన్’కు బల్దియా అధికారులు వత్తాసు పలుకుతుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది పొంతనలేని మాటలు చెబుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ పట్టణంలోని గంగినేని థియేటర్ ఎదుట కెనాల్ పక్కన మాస్టర్ ప్లాన్ రోడ్డులో నిర్మించిన భవనాన్ని పరిశీలిస్తున్న అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాసేలా పలువురు బల్దియా అధికారులు భలే ‘ప్లానింగ్’తో ముందుకు సాగుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మాణాలను చూస్తూనే ఉన్నారు. కాని చర్యలు తీసుకోవడం లేదు. వారికి ‘మేమున్నాం.. మీకేం కాదు’ అనే భరోసా కల్పిస్తున్నారు. మెదక్ పట్టణ పరిధిలోని గంగినేని థియేటర్ ఎదుట కెనాల్ అనుకుని పంప్‌హౌస్‌కు వెళ్లే దారిలో, అజంపూర్లో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ఎసరుపెట్టి అక్రమంగా భవనాలు నిర్మించిన ఘటనకు సంబంధించి ‘సాక్షి’లో రహ‘దారి’ మాయం శీర్షికన ఇటీవల కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి సదరు నిర్మాణదారులకు అవినీతికి అలవాటు పడ్డ పలువురు బల్దియా అధికారులు పూర్తిస్థాయిలో అండదండలు అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారీగా ముడుపులు ముట్టడమే కారణమని తెలుస్తోంది. అధికారులు, సిబ్బంది తలోమాట.. మాస్టర్‌ప్లాన్ రోడ్డులో అక్రమ కట్టడాలకు సంబంధించి టౌన్‌ప్లానింగ్‌లోని సిబ్బంది నుంచి మొదలు ఆ విభాగంలోని వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ సమస్యను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారు. గంగినేని థియేటర్ వద్ద నిర్మించిన భవనం కెనాల్ బఫర్ జోన్ పరిధిలో ఉందని.. ఇరిగేషన్ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకొస్తే అనుమతులిచ్చామని ఓ అధికారి చెప్పారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో భవనం లేదని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో లేదని కచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నిస్తే బఫర్ జోన్‌ను రోడ్డుగా ఉపయోగించుకోవచ్చు.. ఇది బఫర్ జోన్ కమ్ మాస్టర్ ప్లాన్ రోడ్డు అని సమాధానమిచ్చారు. మాస్టర్ ప్లాన్ 1992 అమల్లోకి వచ్చిన తర్వాతే బిల్డింగ్ నిర్మాణమైందని.. పిల్లర్ గుంతలు తీసిన తర్వాత నోటీసులు జారీ చేశామని మరో అధికారి చెప్పడం విశేషం. ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నిస్తే మున్సిపాలిటీయే అనుమతి ఇవ్వడంతో అంటూ సమాధానం దాటవేశారు. గత అధికారుల తప్పిదంతో ఇలాంటివి చోటుచేసుకున్నాయని ఇంకో అధికారి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అజంపూర్కు సంబంధించి మాత్రం చాలా ఏళ్ల క్రితం జరిగింది.. రికార్డులు వెలికి తీసే పనిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకరికి నోటీసుల జారీ.. మరొకరికి త్వరలో.. ఈ అక్రమ కట్టడాలపై తలోమాట చెబుతున్న అధికారులు కలెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో నోటీసులకు ఉపక్రమించారు. గంగినేని థియేటర్ వద్ద కెనాల్‌ను ఆనుకుని మాస్టర్ ప్లాన్ రోడ్డులో నిర్మించిన భవన నిర్మాణదారుడికి నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో లేదని ఒకసారి.. ఉందని ఒకసారి చెబుతూ వచ్చిన అధికారులు ప్రస్తుతం సెట్‌బ్యాక్‌తో కలిపి ఆరు మీటర్లు రోడ్డు పరిధిలోకి వచ్చిందని.. ఈ మేరకు డీవియేషన్ నోటీసులు ఇచ్చామని.. అజంపూర్కు సంబంధించి ఒకరికి నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతుండడం గమనార్హం. రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? బల్దియా అధికారులు, సిబ్బంది తలోమాటకు పొలిటికల్ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. గత పాలక వర్గానికి చెందిన పెద్ద మనుషులు చెప్పినట్లు నడుచుకున్నామని.. ఇందులో తమకేం సంబంధం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి ఆవేదన వెళ్లగక్కారు. ప్రస్తుతం సైతం వారి ఒత్తిళ్లు తమపై ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి గత పాలక వర్గంలోని పలువురికి పెద్దమొత్తంలో ఆమ్యామ్యాలు అందినట్లు బల్దియా వర్గాలో చర్చ జోరుగా సాగుతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నోటీసులు జారీ చేశాం. వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటాం. కలెక్టర్‌కు నివేదిక సైతం సమర్పిస్తాం. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, మెదక్ -
అయ్యారే.. తమ్ముళ్ల నీతి..!
అధికారం కోల్పోయినా.. తెలుగు తమ్ముళ్ల ప్రవర్తన మారలేదు. ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయినా అధికారులపై పెత్తనం చెలాయించే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. రెండున్నరేళ్లలోనే తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. పేదల ప్రభుత్వమంటూనే దశాబ్దాలుగా స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న పేదల ఇళ్లను అప్పటి ప్రభుత్వ పెద్దలు రెండేళ్ల క్రితం నిర్దయగా కూల్చేశారు. ఆ సమయంలో ఈ దేశం నేతలకు పేదలు గుర్తుకు రాలేదు. ఇప్పుడేమో ప్రభుత్వ స్థలంలో ఓ టీడీపీ బడా నేత నిర్మించిన మూడంతస్తుల అక్రమ కట్టడాన్ని కూల్చేస్తుంటే అన్యాయం, అక్రమం అంటూ రోడ్డెక్కి శోకాలు పెట్టారు. భవనం కూల్చివేస్తున్న అధికారులను అడ్డుకుని తిరగబడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలు కట్టిన అక్రమ కట్టడాలు కూల్చేసిన తర్వాతే తమ నాయకుడి కట్టడాన్ని తొలగించాలంటూ డిమాండ్ చేయడంపై అధికారులే కాదు.. స్థానికులూ విస్మయం వ్యక్తం చేశారు. ఇదేం నీతంటూ తెలుగు తమ్ముళ్ల తీరుపై జనం మండిపడుతున్నారు. సాక్షి, నెల్లూరు : నగరంలోని వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ రూ.కోట్ల విలువైన 60 అంకణాల ప్రభుత్వ సీజేఎఫ్ఎస్ స్థలాన్ని ఆక్రమించాడు. గుట్టు చప్పుడు కాకుండా దొంగ పత్రాలను సృష్టించి ఆ స్థలంలో మూడంతస్తుల్లో భవనాలను నిర్మిస్తున్నాడు. రెండు భవనాలను మాజీ కార్పొరేటర్ సొంత మనుషులకు విక్రయించగా, మరో భవనాన్ని బినామీ పేరు మీద నిర్మిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు అర్బన్ తహసీల్దార్ మధుసూదనశర్మ, తన సిబ్బందితో సంఘటనా స్థలికి వచ్చారు. కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్, పోలీసు అ«ధికారుల అండతో శనివారం అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మేయర్ అజీజ్ హుటాహుటినా అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. మీ ఇష్టమొచ్చినట్లు భవనాలకు కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమని అధికారులను బెదిరించడంతో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆర్ఐను పిలిచి నీ ఉద్యోగం ఉండాలంటే తొలగింపు ఆపివేయాలని హెచ్చరించారు. మరో రెండున్నర సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుందంటూ తమ మనోగతాన్ని బయటపెట్టుతూ తహసీల్దార్ మధుసూదనశర్మతో వాదనకు దాగారు. మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తహసిల్దార్నుద్దేశించి నువ్వేమైనా మోనార్కువా ఆక్రమకట్టణం అని నిర్ధారించి తొలగించేందుకు ఎలా వస్తావని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పేదల ఇళ్లు కూలిస్తే కనిపించలేదా.. టీడీపీ అధికారంలో ఉండగా పేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు. 40 ఏళ్లకు పైబడి సాలుచింతల వద్ద నివాసం ఉంటున్న 80 పేద కుటుంబాలను ప్రభుత్వ స్థలాలంటూ రెండేళ్ల కిందట పోలీసుల బలగాలతో కూల్చివేశారు. అప్పటి మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు బలవంతంగా పేదలను రోడ్డుపై వేశారు. ముందస్తు సమాచారం లేకుండా తెల్లవారుజామునే వచ్చి యంత్రాలు పెట్టి విధ్వంసాన్ని సృష్టించారు. ఊహించని పరిణామంతో ఎటువెళ్లాలో అర్థం కాక పేదలు గుండెలు అవిసేలా ఏడ్చారు. తట్ట, బుట్ట పట్టుకుని రోడ్డున పడాల్సి వచ్చింది. అన్యాయంగా పేదలను రోడ్డున పడేస్తే ఆ రోజు టీడీపీ నుంచి ఒక్క నాయకుడు కూడా ముందుకు వచ్చి వారికి సాయం చేసిన పరిస్థితి లేదు. పేదలు కావడంతో పట్టించుకున్న పాపాన పోలేదు. అదే తమ వాడైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినా, అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా అండగా నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నిలబడ్డంపై ప్రజలు అసహించుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు పాతర టీడీపీ పాలనలో పచ్చచొక్కా నాయకులు నిబంధనలకు పాతర వేసే విధంగా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. జనార్దన్‌రెడ్డి కాలనీలో సర్వే నంబరు 2209 నుంచి 2217లో ప్రభుత్వానికి చెందిన సీజేఎఫ్ఎస్ భూములు ఉన్నాయి. ఈ స్థలాలకు ఎటువంటిì æపొజిషన్ సర్టిఫికెట్లు లేకపోయినా, హౌసింగ్ లోన్లు పొందేందుకు వీలుగా అధికారులపై ఒత్తిడి తెచ్చి 9 అంకణాల స్థలానికి రెసిడెన్సీ సర్టిఫికెట్లు పొందారు. ఈ విధంగా ముగ్గురి పేర్లతో సర్టిఫికెట్లను పొందిన సదరు టీడీపీ నాయకుడు ముగ్గురి పేర్లతో మూడు భవనాలకు హౌసింగ్‌శాఖ ద్వారా రుణాలు పొంది మూడు భవనాలను నిర్మిస్తున్నాడు. అయితే నిబంధనల ప్రకారం హౌసింగ్ రుణాన్ని పొందిన లబ్ధిదారులు ఐదున్నర అంకణాల స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలి. కానీ సదరు టీడీపీ నేత అందుకు విరుద్ధంగా హౌసింగ్ రుణతో ఐదున్నర అంకణాలకు బదులుగా మూడంతస్తుల్లో అదనపు స్థలంలో టౌన్‌ప్లానింగ్ అధికారుల అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాడు. కబ్జాదారులుగా టీడీపీ నేతలు టీడీపీ నేతలు వెంకటేశ్వరపురంలోని రెవెన్యూ స్థలాలను గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమించారు. ఓ మాజీ టీడీపీ కార్పొరేటర్ గతంలో వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీలో దాదాపు ఐదు ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు సమాచారం. ఆ స్థలాల సర్వే నంబర్లు మార్చి టీడీపీ నేతలు బినామీ పేర్ల మీద తమ అనుచరుల పేర్లుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో వైపు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి పత్రాలు సృష్టించి బ్యాంక్‌ల్లో రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వరపురంలో మాజీ కార్పొరేటర్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. -
అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?
సాక్షి, అమరావతి : నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంవల్ల ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు నీట మునుగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్రమ కట్టడాలు తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమకట్టడాలపై శాసనసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద ప్రవాహాన్ని అడ్డుకునేలా ప్రజావేదిక నిర్మించారు. నదీపరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అక్రమ కట్టడాలతో వరద ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. దానివల్లే వరద ముప్పు పెరుగుతోంది. కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల వల్ల తీవ్రనష్టం వాటిల్లుతోంది. వర్షాలు పడితే ముంబై, చెన్నై నగరాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయో చూస్తున్నాం. అప్పటి సీఎం చంద్రబాబు రూల్స్ పాటించకపోవడంతో అక్రమకట్టడాలు వెలిశాయి. (చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు) ఫ్లడ్ లెవల్ 22.60 మీటర్లు ఉంటే చంద్రబాబు ఉంటున్న నివాసం 19.50 మీటర్ల ఎత్తులో ఉంది. స్వయంగా ఆయనే రివర్ కన్జర్వేటివ్ నిబంధనలు తుంగలో తొక్కారు. సామాన్యుడు అక్రమ నిర్మాణం చేపడితే వెంటనే కూల్చేస్తారు. ముఖ్యమంత్రయినా సామాన్యుడైనా ఒకటే నిబంధన ఉండాలి. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉందంటూ ఊదరగొడతారు. నిబంధనలు అతిక్రమించేందుకేనా అనుభవం. రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. సీఎం హదాలో ఉన్న వ్యక్తి అక్రమాలకు పాల్పడితే మిగతా జనం అనుకరించరా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని రివర్ కన్జర్వేటివ్ ఇంజనీర్ రాసిన లేఖను ఈ సందర్భంగా సీఎం జగన్ స్పీకర్ దృష్టికి తెచ్చారు. (చదవండి : ప్రజావేదిక కూల్చివేత) -
అంతేగా.. అంతేగా!
సాక్షి, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారా? దీనికోసం అనుమతి తీసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. అయితే, కొందరు ఉద్యోగులను కలిస్తే అలాంటిదేమి లేకుండానే తమ చేయి తడిపితే చాలు అన్నట్లుగా అనుమతులు ఇస్తూ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇక అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ రకరకాల కొర్రీలు పెడుతూ వసూలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది వసూళ్లకు తెగబడగా.. తామేమి తక్కువ కాదంటూ కొందరు కార్పొరేటర్లు సైతం అందినకాడికి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా మూడు అంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందని బెదిరించి రూ.9వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ టీపీబీఓ, చైన్‌మెన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే, వీరిద్దరే దొరికినా దొరకని వారెందరో ఉన్నారని చెబుతున్నారు. నిబంధనలే సాకుగా.. వరంగల్ మహా నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో కొత్త భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇదే అధికారులు, సిబ్బందితో పాటు కార్పొరేటర్లకు కలిసొస్తోంది. నిబంధనల పేరుతో బెదిరిస్తూ యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ భవన నిర్మాణమైనా, కొత్తగా అనుమతులు కావాలన్నా రూ.వేలల్లో ముట్టచెప్పనిదే పని జరగడం లేదు. లేదంటే ఇళ్లు కూల్చడమో, అనుమతులకు కొర్రీలు పెట్టడం గ్రేటర్లో సర్వసాధారణంగా మారింది. అపార్టుమెంట్ నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేస్తే స్థాయి ఆధారంగా రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు గుంజుతున్నారు. పెంట్ హౌస్ ఉంటే అదనంగా మరో రూ.లక్షగా ధర నిర్ణయించారని చెప్పుకుంటున్నారు. సిఫారసులతో వస్తే కొంచెం రిబేట్ కూడా ఇస్తారని సమాచారం. ఉద్యోగులు పెట్టే కొర్రీలను తట్టుకోలేక.. కార్యాలయం చుట్టూ తిరగలేక ఎంతో కొంత ముట్టచెప్పేస్తున్న నిర్మాణదారులు అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఈ తతంగం ముగిశాక కొన్నిచోట్ల కార్పొరేటర్లు కూడా తమ పరిధిలో నిర్మాణం చేపడుతున్నందున ఎంతోకొంత ముట్టచెప్పాలని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారమూ ఉంది. అంతా ఒక్కటై అక్రమ నిర్మాణాదారులకు కొందరు కార్పొరేటర్లు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. స్థానిక బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్‌మెన్, కార్పొరేటర్లు ఒక్కటై అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టే వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. డివిజన్లలో జరిగే నిర్మాణాల విషయం పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లకుండా కింది స్థాయిలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. చిన్న షెడ్డు నిర్మించినా, ఇల్లు కట్టినా.. అపార్టుమెంట్ అయినా వాటా తప్పక చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వసూళ్లలో కొన్ని చోట్ల కార్పొరేటర్లదే కీలకపాత్ర అయినా ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ఉన్నతాధికారులు ఇలాంటి నిర్మాణదారులు, వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగులపై కొరఢా ఝులిపించకపోతే సర్కారు ఖజానాకు భారీగా గండి పడే అవకాశం లేకపోలేదు. -
నిర్మాణాలయ్యాకే అనుమతులు!
సాక్షి, బాన్సువాడ( నిజామాబాద్): మున్సిపాలిటీలల్లో ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు అవుతున్నాయి. అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు. తోచిన రీతిలో రాత్రికి రాత్రే కట్టడాలను చేపట్టి మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ యంత్రాంగం చేష్టలుడిగి చోద్యం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాన్సువాడ మున్సిపాలిటీలో చట్టాల ఉల్లంఘన జరుగుతోంది. కొందరు అక్రమంగా, మరికొందరు దౌర్జన్యంగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఏ రకమైన నిర్మాణాలు చేపట్టాలన్నా.. ముందస్తుగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పన్నులు చెల్లించి, మున్సిపాలిటీ నుంచి నిరభ్యంతరపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. శాశ్వత కట్టడం నిర్మించే ప్రాంతం భూమి వివరాలు, పట్టాభూమి పత్రం వంటి అంశాలను పరిశీలించి భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. బాన్సువాడలో ఉన్న భూమి ప్రకారం ప్రతికూల అంశాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఇక్కడనే ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అక్రమార్కుల తీరు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ శాశ్వత కట్టడాలు చేపడుతున్నారు. ఈ తంతు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నా.. అక్రమ నిర్మాణాలను ఆపడంలో మున్సిపల్ యంత్రాగానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కమ పద్ధతుల్లో హక్కుదారులు? మున్సిపాలిటీలలో శాశ్వత కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం సంపన్న వర్గాలు, వ్యాపారులు అనేక మంది లీగల్‌గా ఆక్రమిత భూములపై హక్కు కలిగి ఉండగా.. లీగల్‌గా భూమిపై హక్కు సాధించేందుకు కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ఇళ్లు, దుకాణ సముదాయాలను నిర్మించడం, ఆ భూమిపై ఎవరు రాకుండా కోర్టులో దావా వేయడం, రెవెన్యూ అధికారులను బెదిరించేలా వ్యవహరించడం, మున్సిపల్ అధికారులను లెక్కలోకి తీసుకోకపోవడం, కొందరు అధికారుల బలహీనతలను ఆసరా చేసుకుని మున్సిపల్ అనుమతి లేకుండా బాహాటంగానే ఇళ్ల ఇర్మాణాలు జరిగాక ప్రభుత్వ మార్గదర్శకాలను అతి తెలివిగా పాటించడం వంటివి చేస్తున్నారు. శాశ్వత నిర్మాణం చేశాక మున్సిపాలిటీల నుంచి ఇంటి నంబర్లు తీసుకుని పన్నులు చెల్లిస్తున్నారు. ఆ ఇంటి నంబరు ఆధారంగా ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకుని లీగల్‌గా హక్కు పొందుతున్నారు. ఇళ్లు, దుకాణాలు నిర్మాణాలు చేశాక ఆలస్యం చేయకుండా ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. అసలు శాశ్వత కట్టడాలు చేపడుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నవవుతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు ధనికులు, చోటామోటా లీడర్ల జోలికి వెళ్లలేకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా దృష్టికి రాలేదు... మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు ఎక్కడ జరగడం లేదు. అలాంటివి ఏమైన ఉంటే చర్యలు తీసుకుంటాం. రోడ్డుపై నిర్మాణాలు చేపడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులైతే ఇప్పటి వరకు తమకు రాలేదు. –కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ. -
తాడేపల్లిగూడెంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
తాడేపల్లిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, పశ్చిమ గోదావరి : అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి కనికరం ప్రదర్శించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ విషయంలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. స్థానిక 17వ వార్డు నరసింహరావు పేటలో బాలవెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో దేవాదాయ శాఖ, పోలీసు అధికారులు అక్కడి రోడ్డు ఆక్రమణలు తొలగిస్తున్నారు. అదే విధంగా అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు, ఆక్రమణ దారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గొర్రెల శ్రీధర్‌ను పోలీస్ స్టేషనుకు తరలించారు. కాగా జిల్లాలో చాలా చోట్ల దేవాలయ భూముల్లో ఆక్రమణలు ఉండగా కావాలనే కక్ష పూరితంగా తమ నిర్మాణాలనే కూలగొడుతున్నారంటూ ఆక్రమణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరికి మద్దతుగా పోలీస్ ఐ ల్యాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా ప్రజావేదిక నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని సీఎం జగన్ అధికారులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ వ్యవస్థలను ఏ స్థాయిలో భ్రష్టుపట్టించిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని.. అక్రమార్కులను సహించేది లేదని ఆయన వెల్లడించారు. -
వెలగపూడి.. అదే వంకరబుద్ధి!
అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్లినా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీరు మారలేదు. తన సహజ పద్ధతిలో మళ్లీ అడ్డగోలు దందాలకు తెరలేపారు. తన బినామీకి చెందిన భవనంపై అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా మరో అంతస్తు నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన జోన్–2, టౌన్ ప్లానింగ్ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు తెలిసింది. ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): టీడీపీ అధికారంలో ఉండగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు అనేక విలువైన స్థలాలు అక్రమించడంతో పాటు పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు నిర్మించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం మరోసారి అక్రమాలకు తెర తీసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంవీపీకాలనీలోని వెంకోజిపాలెం బస్టాప్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. దాదాపు 5 ఏళ్ల క్రితం జీ ప్లస్ 3గా ఇక్కడ ఒక భవన నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం కింది భాగంలో సెల్లార్ ఉండగా మొదటి ఫ్లోర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నారు. ప్రధాన జంక్షన్లో ఈ భవనం ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా మరో ప్లోర్ నిర్మించి సొమ్ముచేసుకోవాలని వెలగపూడి బినామీగా వ్యవహరించే చౌదరి అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన తూర్పు నియోజకవర్గంతో పాటు నగర వ్యాప్తంగా పలు అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్లు సమాచారం. పేద వారు చిన్న షెడ్డు వేసుకుంటే ఆగమేఘాలపై స్పందించే అధికారులు ప్రస్తుతం ఎందుకు స్పందించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌కు ముందు చూపించుకోడానికే.. డిసెంబర్ 2018 తరువాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా వాటిని తక్షణమే రద్దు చేయాలంటూ ఇటీవల ప్రభుత్వ జీవో విడుదల చేసింది. దీంతో డిసెంబర్ తరువాత సాగిన నిర్మాణాలు క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వం డిసెంబర్ తరువాత నిర్మాణాలను రద్దు చేసినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో అంతకుముందే ఇక్కడ నిర్మాణం జరిగినట్లు చూపించి లబ్ధిపొందాలని ఎమ్మెల్యే బినామీ చూస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రెండు రోజుల నుంచి 50 మందికి పైగా కూలీలతో ఆగమేఘాలపై ఈ పనులు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తిచేసి డిసెంబర్‌కు ముందే ఈ పనులు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేయించాలన్నది వారి ఆలోచన. దీంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వెలగపూడి అనుచరులు ఇదే పంథా అనుసరిస్తున్నట్లు తెలిసింది. ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన జోన్–2 ఉన్నతాధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పరోక్షంగా ఎమ్మెల్యేకు సహకరిస్తున్నట్లు పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నారు. దీనిపై జీవీఎంసీ జోన్–2 కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఏపీ డీజీపీ పార్కు ఆక్రమణ నిజమే!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్ (ఆర్పీ ఠాకూర్) హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమేనని జీహెచ్ఎంసీ న్యాయవాది ఎల్.వెంకటేశ్వరరావు హైకోర్టుకు నివేదించారు. తాము నోటీసు జారీ చేసిన తరువాత పార్కులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారని వివరించారు. అనుమతి పొందిన ప్లాన్ కు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతుండటంపై కూడా నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, జీహెచ్ఎంసీపై నిప్పులు చెరిగింది. పార్కును అక్రమించుకునేంత వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నిం చింది. అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఎక్కడున్నారంటూ నిలదీసింది. అక్రమ నిర్మాణాల విషయంలో తప్పుపట్టాల్సింది అవి చేపడుతున్న వారిని కాదని, చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకలకు చుట్టుకుంటుందని అనుకున్నప్పుడే స్పందించడం జీహెచ్ఎంసీ అధికారులకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణా ల విషయంలో ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో తమకు అర్థం కాకుండా ఉందంది. 24 గంటల్లో ఆక్రమణలను తొలగించాలని, లేకుంటే కూల్చివేస్తామంటూ చెప్పడం అలవాటుగా మారిందంది. నోటీసు ఇచ్చినప్పుడు దానికి స్పందిం చేందుకు వారం రోజు ల గడువునివ్వాలని సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందని గుర్తు చేసింది. ఈ కేసులో కూడా డీజీపీ ఠాకూర్‌కు 24 గంటల సమయం ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ఠాకూర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో యథాతథస్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఠాకూర్ అక్రమ నిర్మాణాలపై ఆళ్ల పిల్... ప్రశాసన్‌నగర్‌లో ఆర్పీ ఠాకూర్ జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించుకుని, అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని.. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరపాల్సి ఉంది. అయితే సీజే అకస్మాత్తుగా సెలవు పెట్టారు. దీంతో ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని ఠాకూర్ తరఫు న్యాయవాది వి. పట్టాభి మంగళవారం ఉదయం జస్టిస్ చౌహా న్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకున్నారు? పిటిషనర్ తరఫు న్యాయవాది పి. సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, డీజీపీ ఠాకూర్ అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని చెప్పారు. 2017లో అక్ర మ నిర్మాణాలను చేపట్టిన ఠాకూర్, ఈసారి పార్కునే ఆక్రమిం చి నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఠాకూర్ అక్రమ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీ వివరణ అడిగింది. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది ఎల్.వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసు జారీ చేశామని, సమాధానం రాకపోవడంతో మరో నోటీసు జారీ చేశామన్నారు. ఈ నోటీసులపై ఆయన కింది కోర్టుకెళ్లి, ఇన్‌జంక్షన్ ఉత్తర్వులు పొందారని తెలిపారు. కింది కోర్టు ఇటీవల ఆయన పిటిషన్‌ను కొట్టేసిందని చెప్పారు. దీంతో మళ్లీ ఈ నెల 2న తుది నోటీసు జారీ చేసి, 24 గంటల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే వాటిని కూల్చివేస్తామని స్పష్టం చేశామని చెప్పారు. ఆక్రమించుకుంటుంటే ఏం చేస్తున్నారు.. నోటీసు ఇచ్చినప్పుడు, దానికి స్పందించేందుకు గడువు ఏడు రోజులు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఠాకూర్‌కు 24 గంటలే గడువునివ్వడం సరికాదంది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామంది. కూల్చివేత విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం జీహెచ్ఎంసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరో గుచ్చినప్పుడు కోమా లో నుంచి బయటకు వచ్చి హడావుడి చేస్తుంటారని మండి పడింది. ఈ పిటిషన్ దాఖలు కాకుండా ఉంటే, ఆ పార్కు సంగతి ఏమిటని నిలదీసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ కేసులో ఠాకూర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 2 వారాల గడువు కావాలని పట్టాభి కోరగా ధర్మాసనం తోసిపుచ్చింది. -
ఏపీ డీజీపీ ఆక్రమణ.. జీహెచ్ఎంసీ కూల్చివేత
సాక్షి, హైదరాబాద్ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్ ఆక్రమించిన పార్క్ స్థలాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేసింది. ప్రశాసన్ నగర్లో తన ఇంటికి ఆనుకొన్ని ఉన్న పార్క్ స్థలాన్ని ఆక్రమించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. చదవండి : ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు ఏపీ డీజీపీ పార్క్ భూమిని ఆక్రమించుకున్నారు -
ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు