సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ దాడులు కొనసాగుతున్నాయి. జనవరి 17 నుంచి ఇప్పటి వరకు 168కిపైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వాటిలో చాలా వరకు 600 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన బహుళ అంతస్తుల భవనాలు, గోదాములు వంటి భారీ నిర్మాణాలున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని వివిధ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు అధికారులు నాలుగు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో బడంగ్‌పేట్, శంకర్‌పల్లి మున్సిపాలిటీల్లో ఎక్కువ అక్రమాలు ఉన్నట్లు అధికారులు గు ర్తించారు.
ఆ తర్వాత మేడ్చల్, పోచంపల్లిలో ఎక్కు వ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ‘కూల్చివేసిన చోట తిరిగి నిర్మాణాలు చేపట్టకుండా గట్టి నిఘాను ఏర్పా టు చేశాం. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం ఎ ప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఎలాంటి ఉల్లంఘన లు చోటుచేసుకొన్నా గట్టి చర్యలు ఉంటాయి’.అని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
భారీ నిర్మాణాలే ఎక్కువ...
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సుమారు 927 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క హెచ్‌ఎండీఏ పరిధిలోనే మొత్తం 459 వరకు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం 600 చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో చేపట్టినవే. నిబంధనల మేరకు టీఎస్–బీపాస్ నుంచి నేరుగా అనుమతులు పొందే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది భవననిర్మాణ యజమానులు గ్రామపంచాయతీల నుంచి జీ+2 కోసం అనుమతులను పొంది అక్రమంగా 5 అంతస్తులు, అంతకంటే ఎక్కువ స్థాయిలో నిర్మాణాలు కొనసాగించారు.
బడంగ్‌పేట్, శంకర్‌పల్లి, దుండిగల్‌లలో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు కూల్చివేసిన వాటిలో అనుమతులు లేనివి, ఆమోదించిన లే– అవుట్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించినవే ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలను, చెరువు భూములను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.
కొనసాగుతున్న దాడులు...
జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంలు హెచ్‌ఎండీఏ పర్యవేక్షణలో గత నెల 17 నుంచి దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 168 అక్రమాలను కూల్చివేశారు.
రెండు రోజుల క్రితం జవహర్‌నగర్ పరిధిలో నాలుగు, చౌటుప్పల్ పరిధిలో మరో రెండింటిని కూల్చివేశారు. బండ్లగూడ జాగీర్, ఘట్కేసర్, బోడుప్పల్, దమ్మాయిగూడ, మణికొండ, నిజాంపేట్, తదితర ప్రాంతాల్లో అక్రమాలపై హెచ్‌ఎండీఏ కొరడా ఝళిపించింది. దాడులను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment