సాక్షి, అమరావతి : నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంవల్ల ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు నీట మునుగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అక్రమ కట్టడాలు తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమకట్టడాలపై శాసనసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద ప్రవాహాన్ని అడ్డుకునేలా ప్రజావేదిక నిర్మించారు. నదీపరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అక్రమ కట్టడాలతో వరద ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. దానివల్లే వరద ముప్పు పెరుగుతోంది. కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల వల్ల తీవ్రనష్టం వాటిల్లుతోంది. వర్షాలు పడితే ముంబై, చెన్నై నగరాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయో చూస్తున్నాం. అప్పటి సీఎం చంద్రబాబు రూల్స్ పాటించకపోవడంతో అక్రమకట్టడాలు వెలిశాయి.
(చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు)
ఫ్లడ్ లెవల్ 22.60 మీటర్లు ఉంటే చంద్రబాబు ఉంటున్న నివాసం 19.50 మీటర్ల ఎత్తులో ఉంది. స్వయంగా ఆయనే రివర్ కన్జర్వేటివ్ నిబంధనలు తుంగలో తొక్కారు. సామాన్యుడు అక్రమ నిర్మాణం చేపడితే వెంటనే కూల్చేస్తారు. ముఖ్యమంత్రయినా సామాన్యుడైనా ఒకటే నిబంధన ఉండాలి. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉందంటూ ఊదరగొడతారు. నిబంధనలు అతిక్రమించేందుకేనా అనుభవం. రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. సీఎం హదాలో ఉన్న వ్యక్తి అక్రమాలకు పాల్పడితే మిగతా జనం అనుకరించరా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని రివర్ కన్జర్వేటివ్ ఇంజనీర్ రాసిన లేఖను ఈ సందర్భంగా సీఎం జగన్ స్పీకర్ దృష్టికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment