సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహించిన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు వారి పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు? ఆ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎన్ని అక్రమ భవనాలను కూల్చివేశారు? ఎంత మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు? జీహెచ్‌ఎంసీ నోటీసులపై న్యాయస్థానాలు స్టే ఉత్తర్వులు ఇచ్చిన కేసులు ఎన్ని? వాటిలో స్టే ఉత్తర్వులను తొలగించాలంటూ ఎన్ని కేసుల్లో పిటిషన్లు దాఖలు చేశారు? స్టే ఉత్తర్వులను తొలగించాలని పిటిషన్లు దాఖలు చేయకపోతే అందుకు కారణాలేంటి? తదితర వివరాలతో పూర్తి నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కూకట్‌పల్లి ప్రాంతంలో గ్రామ కంఠం భూమిలో నిర్మించిన భవనాన్ని కూల్చివేస్తామంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన గొట్టిముక్కల నాగేశ్వర్‌రావు, జి. నర్సింగ్‌రావులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించారని, ఈ నేపథ్యంలో కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వడంతో హైకోర్టును ఆశ్రయించారని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.
అక్రమ కట్టడాలపై హైకోర్టు ఆగ్రహం
Published Fri, Mar 5 2021 4:05 AM | Last Updated on Fri, Mar 5 2021 4:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment