హైదరాబాద్, సాక్షి: వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని, ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హెచ్చిరించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బాగ్ అంబర్‌పేటలో ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయాడు. అయితే ఈ ఉదంతాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో తరచూ వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విక్రమాదిత్య అనే న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇవాళ వీధి కుక్కల నియంత్రణ చర్యలపై నివేదిక ఇచ్చింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కుక్కల నియంత్రలకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తన కౌంటర్‌లో పేర్కొంది. అయితే..
ప్రభుత్వం దృష్టిసారించాల్సిన ఖరీదైన కాలనీలపై కాదని.. మురికివాడలపై అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రభుత్వం చూపించిన లెక్కలపైనా స్పందిస్తూ.. తమకు గణాంకాలు అక్కర్లేదని.. చర్యలు తీసుకుంటే చాలని సూచించింది. అయితే ఇందుకు సంబంధించిన రూల్స్ రూపొందించామని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా..
.. రూల్స్ ఎప్పుడూ ఉంటాయని, కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని సీజే బెంచ్ వ్యాఖ్యానించింది. ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని వదిలిపెట్టమని హెచ్చరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని ఓ కేసుగా కాకుండా మానవీయ కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అభిపప్రాయపడింది. వీధి కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీని వారంలోగా ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment