సాక్షి, హైదరాబాద్: అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తున్న వారు తమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు అడ్డుకోకుండా సివిల్ కోర్టులను ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందుతూ న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. నిర్మాణాలు పూర్తయ్యాక ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవడం లేదా హాజరుకాకుండా ఉంటున్నారని పేర్కొంది. ఒక్క అంబర్‌పేట డివిజన్‌లోనే ఈ తరహాలో సివిల్ కోర్టుల్లో 189 పిటిషన్లు దాఖలుచేసి మధ్యంతర ఉత్తర్వులు పొందారని, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్‌లో ఇలాంటి వేలాది పిటిషన్లు దాఖలై ఉంటాయని పేర్కొంది.
అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయరాదంటూ హైకోర్టు సివిల్ కోర్టులను ఆదేశించినా సివిల్‌కోర్టులను ఆశ్రయించి ఉత్తర్వులు పొందుతూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి తగిన ఉత్తర్వులు జారీచేయాలని, ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడంపై దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి..అంబర్‌పేట సర్కిల్‌లో ఎంతమంది సివిల్ కోర్టులను ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొంది నిర్మాణాలు చేపట్టారో పేర్కొంటూ నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది పాశం కృష్ణారెడ్డిని ఆదేశించారు. 189 మంది ఇలా అక్రమ నిర్మాణాలు పూర్తి చేసినట్లు కృష్ణారెడ్డి వివరించారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఈ సివిల్ కేసుల్లో ఆయా వ్యక్తులు హాజరుకావడం లేదని, దీంతో కోర్టు వాటిని కొట్టివేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment