సాక్షి, మెదక్: అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అధికారులే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ రోడ్డులో వెలిసిన కట్టడాలను తొలగించకుండా చోద్యం చూస్తుండడంతో పాటు సదరు యజమానులకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. లోపాయికారి ఒప్పందాలతో ‘అక్రమార్కుల మాస్టర్‌ప్లాన్’కు బల్దియా అధికారులు వత్తాసు పలుకుతుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది పొంతనలేని మాటలు చెబుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెదక్ పట్టణంలోని గంగినేని థియేటర్ ఎదుట కెనాల్ పక్కన మాస్టర్ ప్లాన్ రోడ్డులో నిర్మించిన భవనాన్ని పరిశీలిస్తున్న అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాసేలా పలువురు బల్దియా అధికారులు భలే ‘ప్లానింగ్’తో ముందుకు సాగుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మాణాలను చూస్తూనే ఉన్నారు. కాని చర్యలు తీసుకోవడం లేదు. వారికి ‘మేమున్నాం.. మీకేం కాదు’ అనే భరోసా కల్పిస్తున్నారు. మెదక్ పట్టణ పరిధిలోని గంగినేని థియేటర్ ఎదుట కెనాల్ అనుకుని పంప్‌హౌస్‌కు వెళ్లే దారిలో, అజంపూర్‌లో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ఎసరుపెట్టి అక్రమంగా భవనాలు నిర్మించిన ఘటనకు సంబంధించి ‘సాక్షి’లో రహ‘దారి’ మాయం శీర్షికన ఇటీవల కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి సదరు నిర్మాణదారులకు అవినీతికి అలవాటు పడ్డ పలువురు బల్దియా అధికారులు పూర్తిస్థాయిలో అండదండలు అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారీగా ముడుపులు ముట్టడమే కారణమని తెలుస్తోంది.
అధికారులు, సిబ్బంది తలోమాట..
మాస్టర్‌ప్లాన్ రోడ్డులో అక్రమ కట్టడాలకు సంబంధించి టౌన్‌ప్లానింగ్‌లోని సిబ్బంది నుంచి మొదలు ఆ విభాగంలోని వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ సమస్యను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారు. గంగినేని థియేటర్ వద్ద నిర్మించిన భవనం కెనాల్ బఫర్ జోన్ పరిధిలో ఉందని.. ఇరిగేషన్ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) తీసుకొస్తే అనుమతులిచ్చామని ఓ అధికారి చెప్పారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో భవనం లేదని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో లేదని కచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నిస్తే బఫర్ జోన్‌ను రోడ్డుగా ఉపయోగించుకోవచ్చు.. ఇది బఫర్ జోన్ కమ్ మాస్టర్ ప్లాన్ రోడ్డు అని సమాధానమిచ్చారు.
మాస్టర్ ప్లాన్ 1992 అమల్లోకి వచ్చిన తర్వాతే బిల్డింగ్ నిర్మాణమైందని.. పిల్లర్ గుంతలు తీసిన తర్వాత నోటీసులు జారీ చేశామని మరో అధికారి చెప్పడం విశేషం. ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నిస్తే మున్సిపాలిటీయే అనుమతి ఇవ్వడంతో అంటూ సమాధానం దాటవేశారు. గత అధికారుల తప్పిదంతో ఇలాంటివి చోటుచేసుకున్నాయని ఇంకో అధికారి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అజంపూర్‌కు సంబంధించి మాత్రం చాలా ఏళ్ల క్రితం జరిగింది.. రికార్డులు వెలికి తీసే పనిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఒకరికి నోటీసుల జారీ.. మరొకరికి త్వరలో..
ఈ అక్రమ కట్టడాలపై తలోమాట చెబుతున్న అధికారులు కలెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో నోటీసులకు ఉపక్రమించారు. గంగినేని థియేటర్ వద్ద కెనాల్‌ను ఆనుకుని మాస్టర్ ప్లాన్ రోడ్డులో నిర్మించిన భవన నిర్మాణదారుడికి నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో లేదని ఒకసారి.. ఉందని ఒకసారి చెబుతూ వచ్చిన అధికారులు ప్రస్తుతం సెట్‌బ్యాక్‌తో కలిపి ఆరు మీటర్లు రోడ్డు పరిధిలోకి వచ్చిందని.. ఈ మేరకు డీవియేషన్ నోటీసులు ఇచ్చామని.. అజంపూర్‌కు సంబంధించి ఒకరికి నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతుండడం గమనార్హం.
రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?
బల్దియా అధికారులు, సిబ్బంది తలోమాటకు పొలిటికల్ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. గత పాలక వర్గానికి చెందిన పెద్ద మనుషులు చెప్పినట్లు నడుచుకున్నామని.. ఇందులో తమకేం సంబంధం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి ఆవేదన వెళ్లగక్కారు. ప్రస్తుతం సైతం వారి ఒత్తిళ్లు తమపై ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి గత పాలక వర్గంలోని పలువురికి పెద్దమొత్తంలో ఆమ్యామ్యాలు అందినట్లు బల్దియా వర్గాలో చర్చ జోరుగా సాగుతోంది.
కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం
మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నోటీసులు జారీ చేశాం. వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటాం. కలెక్టర్‌కు నివేదిక సైతం సమర్పిస్తాం.
– సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, మెదక్
Comments
Please login to add a commentAdd a comment