సిమ్లా : అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్న న్యాయస్థాన ఆదేశాలను అమలు చేస్తున్న మహిళా అధికారిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా సుప్రీం కోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు కసౌలీ పట్టణానికి చేరుకున్నారు. పోలీసుల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. ఈ క్రమంలో మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్ హౌజ్ వద్దకు చేరుకున్నారు.
నాలుగు అంతస్తులకు మాత్రమే అనుమతి ఉన్నఈ గెస్ట్‌హౌజ్‌ను ఆరు అంతస్తులకు పెంచినందున ఆ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ షేల్ బాలా ఆదేశించారు. ఈ విషయమై షేల్ బాలా, గెస్ట్‌హౌజ్ యజమాని విజయ్ సింగ్, అతని తల్లిల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో భవనాన్ని కూల్చివేయాల్సిందిగా షేల్ బాలా పట్టుబట్టడంతో కోపోద్రిక్తుడైన విజయ్ సింగ్ తుపాకీతో పీడబ్ల్యూడీ అధికారులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో షేల్ బాలా అక్కడిక్కడే మృతి చెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
లక్ష రూపాయల రివార్డు...
షేల్ బాలా మరణించడంతో విజయ్ సింగ్ సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు అందిస్తామని పోలీసులు తెలిపారు. అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో అల్లర్లు చెలరేగుతాయనే కారణంతో తాము అక్కడే ఉన్నప్పటికీ ఇలా జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడికి త్వరలోనే శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment