
విజయవాడ : కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కృష్ణా నదీ తీరంపై అక్రమ కట్టడాలుగా గుర్తించిన 24 నిర్మాణాలకు ప్రాధమికంగా సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేయగా, వాటిలో ఐదు నిర్మాణాల యజమానులు ఇచ్చిన వివరణలు సహేతుకంగా లేకపోవడంతో వాటిపై తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నిర్మాణాలను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపడతారు. ఇక మిగిలిన 19 అక్రమ నిర్మాణాలపై ఆయా యజమానులు ఇచ్చిన వివరణను సీఆర్‌డీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో కృష్ణ నదీ సమీపంలో పాతూరు కోటేశ్వరరావు నిర్మించిన అక్రమ కట్టడానికి జూన్ 6న నోటీసులు జారీ చేశామని సీఆర్‌డీఏ పేర్కొంది.
సంబంధిత అధికారుల నుంచి, రివర్ కన్జర్వేటర్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై నోటీసులు జారీ చేశారు. భవన యజమాని ఇచ్చిన వివరణలో ఏమాత్రం సహేతుకత లేకపోవడంతో అధికారులు సోమవారం నిర్మాణాన్ని కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదిపై నిర్మించిన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు చేపడతామని సీఆర్‌డీఏ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment