అక్రమాలకు అండ ! | tdp support to illegal constuctions | Sakshi
Sakshi News home page

అక్రమాలకు అండ !

Published Tue, Jun 20 2017 10:04 PM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM

అక్రమాలకు అండ ! - Sakshi

అక్రమాలకు అండ !

- అక్రమ కట్టడాలను చూసీచూడనట్లు వదిలేస్తున్న అధికారులు
- ఆమ్యామ్యాలతో పంచాయతీ ఆదాయానికి గండి
- స్పందించని ఉన్నతాధికారులు

నార్పల ప్రధాన రహదారిపై యల్లప్ప (పేరు మార్చాం) అక్రమంగా నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించాడు. పంచాయతీ కార్యాలయానికి అతి చేరువలో ఉన్న భవనానికి అనుమతి లేదు. ఆ కార్యాలయం అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తీరా ఈ విషయంపై ఆరా తీస్తే పంచాయతీ సిబ్బందికి లంచం ఇచ్చినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించి ఆ రహదారిపై పలువురు వ్యాపారులు ఇష్టారాజ్యంగా రోడ్డుకు ఆనుకుని కట్టడాలను చేపట్టారు. ఇక్కడే కాదు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ తతంగం నడుస్తున్నా ఎవరికీ పట్టడం లేదు.

అనంతపురం సిటీ : జిల్లా వ్యాప్తంగా అక్రమ కట్టడాలతో పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది. పంచాయతీ  అనుమతి తీసుకోకుండా అక్రమ కట్టడాలు చేపడుతున్నా అధికారులకు పట్టడం లేదు. అంతో ఇంతో ముట్టచెబుతుండటంతో వారు కూడా వాటిని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కేవలం నార్పల లాంటి చిన్న పట్టణంలో కూడా ఐదారు అంతస్తుల భవనాలు వెలిశాయి. వాటిలో చాలా వరకు ఏ ఒక్క భవనానికి అనుమతిలేదు. ఈ ఏడాదికి రూ.64 లక్షలకు పైబడి ఆదాయం రావాల్సి ఉన్నా అంత ఆదాయం రావడం లేదు. స్థానికంగా చోటా లీడర్ల పెత్తనం, అసలు పంచాయతీ అనుమతి తీసుకోవాలన్న అవగాహన చాలా మందికి లేకపోవడంతో కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇక వ్యవసాయ  భూములను కొనుగోలు చేసి రియల్‌ వ్యాపారులు అడ్డగోలుగా లేఅవుట్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ సిబ్బంది వాటిని కట్టడి చేయాలి. అలా కాకుండా వారి నుంచి వేలాది రూపాయలు అప్పనంగా తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఇదీ పరిస్థితి:
గతేడాదికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్ల విషయంలో కూడా పంచాయతీ కార్యాలయం సిబ్బంది వెనుకబడ్డారు. రూ.32 కోట్లు లక్ష్యాన్ని నిర్ధేశిస్తే అధికారులు రూ.21 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగారు. ఈ విషయంపై అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ సంబంధిత శాఖ అధికారిని మందలించినా మార్పు రాక పోవడం గమనార్హం.

అక్రమార్జనే ధ్యేయంగా
చిన్న చిన్న పట్టణాల్లో కట్టడాల విషయంపై ఆరాతీసే నాథుడే కరువయ్యాడు. భూమి పూజ చేసిన నాటి నుంచే మా వాటా ఇస్తావా? చస్తావా? అని కొంత మంది వెంటపడి మరీ డబ్బులు వసూలు చేసుకుంటున్నట్లు తెలిసింది. పలు ప్రధాన పట్టణాలకు అనుబంధంగా ఉన్న రూరల్‌ ప్రాంతాల్లో ఈ దందాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ విషయాలపై ఉన్నతాధికారులు ఆరా తీయడంగాని, చర్యలు తీసుకోవడం గాని ఇప్పటి దాకా జరగలేదు. వారికి కూడా అక్కడ పని చేసే సిబ్బందే వాటాల రూపంలో నెలసరి మామూళ్లు ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.

నగర శివారుల్లో..
అనంతపురం శివారుల్లోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఓ వ్యక్తి నుంచి కొళాయి కోసమని పంచాయతీ సిబ్బంది రూ.5 వేలు కట్టించుకున్నారు. కనీసం ఆ డబ్బుకు రశీదు కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై బాధితుడు మొదట సిబ్బందిని అడిగితే వారు స్పందించలేదు. పైగా కొళాయి లెక్కలు, రశీదులు అడిగితే నీళ్లు రావంటూ వెటకారంగా మాట్లాడటంతో వినియోగదారుడు వెనక్కు తగ్గినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొళ్లలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేసి పంచాయతీ ఆదాయంపై దృష్టిసారించాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement