సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్‌నగర్‌లలో హైడ్రా ఆధ్వర్యంలో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు.
329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. బాలనగర్ ఏసీపీ హనుమంతరావు సమక్షంలో సూరారం, జగద్గిరిగుట్ట సీఐలు భరత్ కుమార్, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసుల భద్రతతో మూడు ప్రోక్లైన్లను ఉపయోగించి అక్రమంగా నిర్మించిన గదులను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.
అయితే కూల్చివేతలను ఆక్రమణదారులు అడ్డుకోగా.. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment