సాక్షి, పశ్చిమ గోదావరి : అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి కనికరం ప్రదర్శించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ విషయంలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. స్థానిక 17వ వార్డు నరసింహరావు పేటలో బాలవెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో దేవాదాయ శాఖ, పోలీసు అధికారులు అక్కడి రోడ్డు ఆక్రమణలు తొలగిస్తున్నారు. అదే విధంగా అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు, ఆక్రమణ దారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గొర్రెల శ్రీధర్‌ను పోలీస్ స్టేషనుకు తరలించారు.
కాగా జిల్లాలో చాలా చోట్ల దేవాలయ భూముల్లో ఆక్రమణలు ఉండగా కావాలనే కక్ష పూరితంగా తమ నిర్మాణాలనే కూలగొడుతున్నారంటూ ఆక్రమణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరికి మద్దతుగా పోలీస్ ఐ ల్యాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా ప్రజావేదిక నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని సీఎం జగన్ అధికారులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ వ్యవస్థలను ఏ స్థాయిలో భ్రష్టుపట్టించిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని.. అక్రమార్కులను సహించేది లేదని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment