
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): బట్టలు ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందిన ఘటన తాడేపల్లిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చలంచర్లవారి వీధిలో నివాసం ఉంటున్న షేక్ నాగూర్ బీబీ (39) అనే మహిళ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. బుధవారం ఆమె బట్టలు ఉతి కి వాటిని ఇంటి చూరులో ఉన్న ప్లాస్టిక్ తీగలపై ఆరేసేందుకు ప్రయత్నించింది. అయితే అవి విద్యుత్ తీగలతో కలిసి ఉన్నాయి. దీంతో ఆమె బట్టలు ఆరవేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. తల్లి పడిపోయిన విషయం గ్రహించిన కుమార్తె మీరా పరుగున వచ్చి నాగూర్‌బీబీని లేపేందుకు ప్రయత్నించింది. ఈలోపు ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలు పెట్టగా బంధువు బాబు వచ్చి దుప్పటి సాయంతో మీరాను పక్కకు లాగా డు. దీంతో మీరా ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. తల్లి మృతి చెందడంతో కుమార్తెలు రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. పొరుగువారితో స్నేహభావంతో మెలిగిన నాగూర్‌బీబీ హఠాన్మారణం అందరినీ కలచివేసింది. పట్టణ ఎస్సై రమేష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment