thadepalli gudem
-
మాణిక్యాలరావు మృతి: సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. కాగా కరోనా బారినపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత) పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల ఏపీ గవర్నర్ బీబీ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖామంత్రిగా మాణిక్యాలరావు చేసిన సేవలు ఎనలేనివని, ఆలయాల అభివృద్ధికి అయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తు ఉంటుందని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
సాక్షి, అమరావతి : బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేసి.. చివరి వరకూ అదే పార్టీలో కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరం : డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రా o తి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడును ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. ‘సౌమ్యుడు.. మంచివారు. సుమారుగా మూడున్నర దశబ్దాల పాటు ప్రజా జీవితంలో నిబద్దత.. నిజాయితీగా అంకిత భావంతో పని చేసిన నాయకుడు. పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రములోనే మంచి గుర్తింపు కలిగిన నాయకుడు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని సమయంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంలో పెద్దలతో ఉన్న పరిచయంతో తాడేపల్లి గూడెంలో నిట్ విద్యా సంస్థ నెలకొల్పడం లో పైడికొండల కీలక పాత్ర పోషించారు. సేవా భావం...ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించే వ్యక్తి మాణిక్యాలరావు మృతి తీరని లోటు’ అని విచారం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు మృతి బాధాకరం: సోము వీర్రాజు 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేశారు. జిల్లాస్థాయి నాయకుడి నుంచి మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా మాణిక్యాలరావు ఎదిగారు. నేటి రాజకీయాల్లో విలువలతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పని చేసిన వారి పదవులు వస్తాయని చెప్పేందుకు మాణిక్యాలరావు ఉదాహరణ. దేవదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అనేక ఆలయాలు అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు బీజేపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆకస్మిక మరణం పట్ల సంతాపం : ఎంపీ జీవీఎల్ బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర మంత్రి, స్నేహ శీలి, ఆప్త మిత్రులు మాణిక్యలరావు చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఇది మా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు అత్యంత బాధాకర పరిణామం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాను. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన మరణం బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటుగా చిరకాలం మిగిలి పోతుంది. ఆయన మరణం పట్ట చింతిస్తున్నా.. విష్ణువర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాల రావుగారు మరణం రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి తీర్చలేనిది. 20 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో వారికి పార్టీ పట్ల నిబద్ధత క్రమశిక్షణ అంకిత భావాన్ని నేను మర్చిపోలేను. వారు నేడు మామధ్య లేరనే విషయాన్ని సగటు కార్యకర్తగా జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. సందర్భంగా వారి మరణానికి చింతిస్తూ నివాళులర్పిస్తున్నాను. మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాణిక్యాలరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు ప్రజలకు తీరని లోటు : కృష్ణం రాజు మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలయి అంచలంచలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు. భారతీయ జనతా పార్టీకి ఆయన చేసిన సేవను మరువలేము. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. -
సీఎంపై మతవాది ముద్రవేయడం దారుణం: ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి: పవిత్ర క్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిపోతున్నదని రాష్ట్రప్రభుత్వంపై టీడీపీ నేతలు విషప్రచారం చేయడాన్ని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అన్యమత ప్రచార టికెట్లు ముద్రితమయ్యాయని అన్నారు. గతంలో ప్రింటు చేసిన టికెట్లను కుట్రపూరితంగా తిరుపతి రూట్లో పెట్టారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం అమిరం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూపి ఓర్వలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయనపై మతవాది అని ముద్రవేయడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ బస్ టిక్కెట్లు జారీ చేసే టిమ్ రోల్స్ వెనుక భాగంలో టీడీపీ సర్కారు పథకాలతో పాటు జెరూసలేం, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రచారాంశాలను ముద్రించిన విషయం తెలిసిందే. తాజాగా దానిని సాకుగా చూపి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కుట్రకు పాల్పడుతున్నారు. ఆ టికెట్లను టీడీపీ ప్రభుత్వమే ముద్రించిందన్న విషయం సాక్ష్యాలతో సహా బైటపడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. రైల్వే మంత్రికి ధన్యవాదాలు.. విశాఖపట్నం, విజయవాడ ఉదయ్ సూపర్‌పాస్ట్ డబుల్ డెక్కర్ రైలు ఈనెల 26న ప్రారంభవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తమ వినతి మేరకు తాడేపల్లిగూడెంలో హోల్ట్ ఇచ్చారని, ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
‘పత్తాలేని ఉత్తర కుమారుడు’
సాక్షి, పశ్చిమ గోదావరి : గడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలసిరితో కళకళలాడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి బంగారు బాటలు వేస్తుందని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా... ట్విటర్లో మాత్రమే కనిపించే ఉత్తర కుమారుడు పోలవరం నిర్మాణంపై ఇష్టానుసారంగా మాట్లాడి.. ఇప్పుడు పత్తాలేకుండా పోయారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ను ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు గృహం కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ముంపునకు గురైందన్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం వరద ముంపు ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన డ్రోన్ పరిశీలనను తప్పుపట్టడం శోచనీయమన్నారు. భగవంతుని సాక్షిగా బయటపడుతున్నాయి.. ‘తాడేపల్లిగూడెంలో దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వాధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటే వలస నాయకులు కొందరు ఆ భూఆక్రమణలకు మద్దతుగా ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎటువంటి రాజకీయమో అర్థం కావడం లేదు. రూరల్ మండలంలో గత ప్రభుత్వం చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తిగా అవినీతిమయం. పైపులు కూడా రాకుండానే లక్షలాది రూపాయిలను మంజూరు చేశారు. విద్యుత్ కోనుగోలుకు సంబంధించిన టెండర్లపై పునః సమీక్షిస్తామంటే చంద్రబాబునాయుడు ఆందోళన పడటంలో ఆంతర్యం ఏమిటి’ అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రస్తుతం భగవంతుని సాక్షిగా చంద్రబాబు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. -
కాటేసిన కరెంట్ తీగ
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): బట్టలు ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందిన ఘటన తాడేపల్లిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చలంచర్లవారి వీధిలో నివాసం ఉంటున్న షేక్ నాగూర్ బీబీ (39) అనే మహిళ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. బుధవారం ఆమె బట్టలు ఉతి కి వాటిని ఇంటి చూరులో ఉన్న ప్లాస్టిక్ తీగలపై ఆరేసేందుకు ప్రయత్నించింది. అయితే అవి విద్యుత్ తీగలతో కలిసి ఉన్నాయి. దీంతో ఆమె బట్టలు ఆరవేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. తల్లి పడిపోయిన విషయం గ్రహించిన కుమార్తె మీరా పరుగున వచ్చి నాగూర్‌బీబీని లేపేందుకు ప్రయత్నించింది. ఈలోపు ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలు పెట్టగా బంధువు బాబు వచ్చి దుప్పటి సాయంతో మీరాను పక్కకు లాగా డు. దీంతో మీరా ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. తల్లి మృతి చెందడంతో కుమార్తెలు రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. పొరుగువారితో స్నేహభావంతో మెలిగిన నాగూర్‌బీబీ హఠాన్మారణం అందరినీ కలచివేసింది. పట్టణ ఎస్సై రమేష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాడేపల్లిగూడెంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
తాడేపల్లిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, పశ్చిమ గోదావరి : అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి కనికరం ప్రదర్శించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ విషయంలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. స్థానిక 17వ వార్డు నరసింహరావు పేటలో బాలవెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో దేవాదాయ శాఖ, పోలీసు అధికారులు అక్కడి రోడ్డు ఆక్రమణలు తొలగిస్తున్నారు. అదే విధంగా అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు, ఆక్రమణ దారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గొర్రెల శ్రీధర్‌ను పోలీస్ స్టేషనుకు తరలించారు. కాగా జిల్లాలో చాలా చోట్ల దేవాలయ భూముల్లో ఆక్రమణలు ఉండగా కావాలనే కక్ష పూరితంగా తమ నిర్మాణాలనే కూలగొడుతున్నారంటూ ఆక్రమణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరికి మద్దతుగా పోలీస్ ఐ ల్యాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా ప్రజావేదిక నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని సీఎం జగన్ అధికారులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ వ్యవస్థలను ఏ స్థాయిలో భ్రష్టుపట్టించిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని.. అక్రమార్కులను సహించేది లేదని ఆయన వెల్లడించారు. -
టీడీపీ తలకిందులే.. ‘పశ్చిమ’లో మారిన రాజకీయం
సాక్షి, పశ్చిమ గోదావరి : తూర్పు చాళుక్యులు ఏలిన ప్రాంతం. వేంగి రాజుల రాజధాని నగరం. శాంతిని చాటే గుంటుపల్లి బౌద్ధ గుహలు. ఆధ్యాత్మిక సౌరభాలు విరాజిల్లే క్షీరారామం, సోమారామం.. ద్వారకా తిరుమల, మావుళ్లమ్మ క్షేత్రాలకు ఆలవాలం. తెలుగు వాడి పౌరుషాగ్నికి ప్రతీక అల్లూరి సీతారామరాజుకు జన్మనిచ్చిన గడ్డ. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా’ అంటూ స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదిన అడవి బాపిరాజు, టెట్రాసైక్లిన్ లాంటి మందులెన్నో కనుగొని విశ్వ మానవాళి ప్రాణాలు నిలిపిన యల్లాప్రగడ సుబ్బారావు లాంటి మహానుభావులెందరికో పురిటి గడ్డ. క్విట్ ఇండియా ఉద్యమంలో ‘రెండో బార్డోలీ’గా గాంధీజీచే కీర్తించబడిన గడ్డ. ఆక్వా రాజధానిగా.. జిల్లాకు ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న భీమవరం.. వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం.. అగరు ధూప పరిమళాలను వెదజల్లే చారిత్రక నగరం ఏలూరు.. స్వచ్ఛతకు మారుపేరైన గిరిపుత్రులను గన్న బుట్టాయగూడెం, పోలవరం అటవీ ప్రాంతం.. సినీ పరిశ్రమను ఏలుతున్న మేటి నటులు, దర్శకులకు జన్మనిచ్చిన ప్రాంతం. ఇదీ పైరుపచ్చలు పొదిగిన పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం. భీమవరం భీమవరంలో త్రిముఖ పోరు ఉంది. పవన్‌కల్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో ఆసక్తి నెలకొంది. ప్రచారంలో వెనుకబడటం, గాజువాకపైనే దృష్టి పెట్టడం, స్థానికంగా ఉండరని ప్రజలు నమ్ముతుండటం పవన్‌కు మైనస్. హాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఎదురీదుతున్నారు. భీమవరం టౌన్షిప్లో పేదల గృహ రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీ నెరవేర్చకపోవడం, యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన చేపట్టకపోవడంతో ప్రజలు టీడీపీపై విశ్వాసం కోల్పోయారు. సమస్యలపై పోరుడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండటం, సానుభూతి, రీల్ హీరో పవన్‌తో తలపడుతున్న రియల్ హీరోగా ఆదరణ, క్షత్రియ సామాజికవర్గంతోపాటు ఇతర వర్గాలు గ్రంధి శ్రీనివాస్ పక్షాన నిలవడం ఈసారి విజయానికి కలిసి వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉండి వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులిద్దరూ తొలిసారి ఎమ్మెల్యే పదవికి పోటీపడుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు బరిలో ఉన్నారు. సొసైటీ అధ్యక్షునిగా రైతులకు చేసిన సేవలకు గాను జాతీయ స్థాయిలో అవార్డు పొందిన నరసింహరాజుకు రైతు పక్షపాతిగా మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివకు బినామీ అని పేరుపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీకి పెట్టారు. వేల ఎకరాల్లో అక్రమంగా చెరువుల తవ్వకాలు, అవినీతి, అక్రమార్జనల్లో ఎమ్మెల్యేకు బినామీ రామరాజు అనే ముద్ర ఉంది. డబ్బుతో అంతా మార్చేస్తామనే ధీమాతో టీడీపీ ఉంది. జనసేన తన మిత్రపక్షమైన సీపీఎం నుంచి బి.బలరామ్‌ను పోటీకి పెట్టడం టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడుతుందని విశ్లేషిస్తున్నారు. పాలకొల్లు సౌమ్యుడు, మంచి వైద్యుడు, నిజాయితీపరుడిగా పేరున్న డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణ (బాబ్జి) వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కులాలకు అతీతంగా అన్నివర్గాల్లో ఆయనకు మంచి పట్టు ఉండటం, సొంత సామాజికవర్గం నుంచి జనసేనవైపు మళ్లిన వారు మన డాక్టర్ కోసమంటూ వైఎస్సార్సీపీలోకి తిరిగొస్తుండటం ఆయనను విజయం వైపు నడిపిస్తోంది. డాక్టర్ బాబ్జి ముందు నిలవటం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కత్తిమీద సామే. అభివృద్ధి కంటే కమీషన్ల కక్కుర్తే శాపమై తమను దెబ్బతీసేలా ఉందని టీడీపీ అంతర్మథనం చెందుతోంది. వివాదాస్పద దూకుడు స్వభావం జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబుకు మైనస్ అయి పరిమిత ఓటు బ్యాంక్‌తో సరి అంటున్నారు. నరసాపురం నరసాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు అన్నివిధాలా కలిసివస్తోందని టీడీపీ వర్గాలే అభిప్రాయపడటం విశేషం. రాజకీయ ఎత్తుగడల్లో చేయితిరిగిన ప్రసాదరాజుకు డెల్టాలో పట్టున్న మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అండగా నిలవటంతో వైఎస్సార్ సీపీ మరింత బలం పుంజుకుంది. నరసాపురం పట్టణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు, చెప్పుకోదగ్గ పనులు చేయకపోవటం, చిన్నచిన్న పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడటం వంటి పరిస్థితుల నడుమ ఆ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎదురీదుతున్నారు. జనసేన మత్స్యకార వర్గం నుంచి బొమ్మిడి నాయకర్ను బరిలోకి దింపింది. ఆ సామాజిక వర్గంలో ప్రసాదరాజుకు మొదటి నుంచీ మంచి పట్టు ఉండటంతో జనసేన పోటీ నామమాత్రమే. తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో ప్రధాన పోరు వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే కనిపిస్తోంది. వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ రెండో ఫ్లైఓవర్ (ఆర్వోబీ), వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, వెటర్నరీ పాలిటెక్నిక్, ఏయూ పీజీ క్యాంపస్, నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నుంచి పైడికొండల మాణిక్యాలరావు మంత్రిగా ఉండటంతో టీడీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. సీటు ఆశించి భంగపడ్డ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం అంతర్గతంగా దెబ్బతీసే ప్రయత్నాలు టీడీపీ అభ్యర్థి ఈలి నానికి ప్రతికూలాంశాలుగా మారాయి. టీడీపీలో వర్గం కలిగిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ మేరకు టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడి కొట్టు సత్యనారాయణకు లాభిస్తుంది. ఏలూరు వైఎస్సార్ సీపీ నుంచి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) రంగంలో ఉన్నారు. ఏలూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచటం, వర్షాకాలంలో ఏలూరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారంగా తమ్మిలేరుకు కాంక్రీట్ వాల్, నగర ప్రజలందరికీ రెండు పూటలా మంచినీరు అందించటం వంటి కార్యక్రమాలు నాని చేపట్టారు. ముస్లిం, మైనార్టీ వర్గానికి చెందిన మేయర్ షేక్ నూర్జహాన్, భర్త, కో–అప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీ మరింత బలపడింది. టీడీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అవినీతి, అక్రమాల చిట్టాలో టాప్–3లో ఉన్నారు. భూ ఆక్రమణలు, ఏలూరు మార్కెట్లో కబ్జాలు, సెటిల్మెంట్లు టీడీపీకి నష్టాన్ని కలిగించనున్నాయి. జనసేన నుంచి బరిలో దిగిన రెడ్డి అప్పలనాయుడు పోటీ నామమాత్రమే. ఉంగుటూరు వైఎస్సార్సీపీకి ఈసారి సానుకూల పవనాలు వీస్తున్న నియోజకవర్గం. పుప్పాల వాసుబాబు వైఎస్సార్సీపీ తరఫున రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమితో వచ్చిన సానుభూతి, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సమస్యలపై పోరాటాలు చేస్తుండటం వాసుబాబుకు కలిసివచ్చే అంశం. టీడీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇసుక దోపిడీ మొదలు అంగన్వాడీ, ఆశ వర్కర్లు, సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకం వరకూ పెచ్చుమీరిన అవినీతి టీడీపీకి శాపాలుగా మారాయి. గత ఎన్నికల్లో లక్షలు పెట్టుబడులు పెట్టి ఆయన విజయం కోసం పనిచేసిన నేతల నుంచి కూడా కమీషన్లు వసూలు చేయడంతో వారంతా ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయడం టీడీపీని దెబ్బతీయనున్నాయి. నౌడు వెంకటరమణ జనసేన నుంచి బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఆచంట రాజకీయ వ్యూహకర్త, ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్టగా పేరొందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇక్కడ రంగంలో ఉన్నారు. బలహీన వర్గాల విద్యార్థులకు స్కూల్ బస్సుల ఏర్పాటు, సొంత సొమ్ముతో ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన మంత్రి పితాని సత్యనారాయణకు చెరుకువాడ గట్టి పోటీ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూనపురెడ్డి చినబాబు వైఎస్సార్ సీపీలో చేరడంతో బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో వెన్నంటి నిలిచిన సొంత సామాజిక వర్గం నుంచి పితాని వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మంత్రి సామాజిక వర్గం ఈ సారి టీడీపీ నుంచి బయటకు వచ్చి చెరుకువాడకు పనిచేస్తుండటం వైఎస్సార్ సీపీకి సానుకూల అంశంగా మారింది. నిడదవోలు టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పోటీగా పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు కుమారుడు గెడ్డం శ్రీనివాసనాయుడు బరిలో నిలిచారు. తండ్రి జీఎస్ రావుకు నియోజకవర్గంలో వివిధ వర్గాల్లో పట్టుంది. నాయుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారంలో ముందున్నారు. ఎమ్మెల్యే శేషారావు ఇసుక మాఫియాను పెంచి పోషించారు. ఐదేళ్లయినా రైల్వేఫ్లైఓవర్ నిర్మించలేకపోయారు. చివరి వరకు టికెట్టు కోసం పట్టుపట్టి భంగపడ్డ శేషారావు సోదరుడు గోపాలకృష్ణ, మరో కీలక నేత కుందుల సత్యనారాయణ వర్గం శేషారావుకు వ్యతిరేకంగా ఉండటం టీడీపీకి గడ్డుకాలమేనంటున్నారు. జనసేన అభ్యర్థి ఎ.రమ్యశ్రీ ప్రభావం కొద్దోగొప్పో పెరవలి మండలానికే పరిమితం. దెందులూరు వివాదాస్పదుడు, అవినీతి, అక్రమాలు, సెటిల్మెంట్ దందాలతో నిత్యం పత్రికల పతాక శీర్షికల్లో నిలిచే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. అన్నీ తానై ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాను నడిపించి రూ.కోట్లు కొల్లగొట్టడం, ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌పై దౌర్జన్యానికి దిగడం వంటి దురాగతాలతో ఈసారి టీడీపీకి భారీ షాక్ తప్పదంటున్నారు. కృష్ణా డెల్టా నుంచి సాగునీరు తీసుకువస్తానన్న మాట నిలబెట్టుకోలేకపోవడంతో, కొల్లేరు మత్స్యకారుల మధ్య విభేదాలు సృష్టించడం వంటి పరిణామాలతో టీడీపీ ఎదురీదుతోంది. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగం, రూ.లక్షల వేతనాన్ని వదులుకుని వచ్చి వైఎస్సార్ సీపీ నుంచి బరిలోకి దిగిన కొఠారు అబ్బయ్యచౌదరి వీటిని సానుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతులయ్యారు. చింతమనేని ఓటమే లక్ష్యంగా అన్నివర్గాలు ఏకం కావడం వైఎస్సార్ సీపీకి కలిసి వచ్చే అంశం. జనసేన నుంచి ఘంటశాల వెంకటలక్ష్మి పోటీ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైఎస్సార్ సీపీ నుంచి రంగంలో నిలిచారు. పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేయడంపై నిత్యం వారి తరఫున పోరాడటంతో గిరిజనుల్లో ఆదరణ పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను కాదని టీడీపీ బి.శ్రీనివాసులును బరిలోకి దింపింది. పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీలో టీడీపీ నేతల అవినీతిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ముందస్తుగా భూములు ఇచ్చిన నిర్వాసితులకు రూ.5 లక్షలు అదనపు పరిహారం ఇస్తామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించడం గిరిజనుల్లో ఆశలు చిగురించి వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నారు. జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ ఇక్కడ నామమాత్రమే. కొవ్వూరు వైఎస్సార్ సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత బరిలో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్ మంత్రి కేఎస్ జవహర్‌ను తిరువూరుకు సాగనంపి.. పాయకరావుపేట నుంచి వంగలపూడి అనితను టీడీపీ దిగుమతి చేసింది. ఆమె స్థానికురాలు కాకపోవటం, మంత్రి జవహర్ వర్గం కలిసి రాకపోవడం, పాయకరావుపేటలో అనిత అవినీతి అక్రమాలతో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వనిత నిత్యం ప్రజల్లో ఉంటూ ఇసుక, మద్యం మాఫియాకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడంతో ప్రజల్లో వైఎస్సార్ సీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. గోపాలపురం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి తలారి వెంకట్రావు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓటమి చెందినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నిత్యం ప్రజలతో మమేకం కావడం, ఆర్థికంగా దెబ్బతిన్నా.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడంతో వెంకట్రావుకు సానుభూతి ఉంది. నిజాయితీపరుడనే పేరు, అన్నివర్గాల ఆదరణ వైఎస్సార్ సీపీకి సానుకూలంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ముప్పిడి ఏమీ చేయకపోవడం, పనుల కాంట్రాక్ట్‌లను ఒకరిద్దరికి మాత్రమే కట్టబెట్టడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను తప్పించి టీడీపీ అభ్యర్థిగా కర్రా రాజారావును బరిలోకి దింపింది. ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గంగా రాజారావు పోటీ చేస్తుండటంతో పీతల వర్గం అతనికి సహకరించడం లేదు. పరిహారం పెంచాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే పరిహారం అందించి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో ఆయకట్టు రైతులు వైఎస్సార్ సీపీకి సానుకూలంగా మారడం కలిసి వస్తోంది. తణుకు కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ నుంచి రంగంలో ఉన్నారు. నియోజకవర్గాన్ని రూ.700 కోట్లతో అభివృద్ధి చేయడం, గోదావరి జలాలను తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను బరిలోకి దింపింది. తణుకు దివాణం నుంచి వైటీ రాజా సీటు ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన వర్గం టీడీపీకి సహాయ నిరాకరణ చేస్తోంది. కాంట్రాక్ట్‌లన్నీ తన బినామీలకే కట్టబెట్టడం సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వేల్పూరులో 1,008 మంది నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని 2015లో చంద్రబాబుతో శంకుస్థాపన చేయించగా, శిలాఫలకానికే పరిమితమైంది. వేసవిలో గోదావరి జలాల కోసం సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ నిర్మాణానికి 60 ఎకరాలు కూడా సేకరించలేక చేతులెత్తేశారు. ఇవన్నీ టీడీపీకి మైనస్‌గా ఉన్నాయి. జనసేన నుంచి పసుపులేటి రామారావు పోటీలో ఉన్నారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి -
నందమూరు వెంకన్న.. నీవే దిక్కన్నా..
సాక్షి, తాడేపల్లిగూడెం: ఏడుకొండలవాడా.. వేంకటరమణా.. ఆపద్బాంధవా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ నందమూరు వెంకన్నకు నీరాజనాలు అర్పించకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టరు. ఏ పార్టీ అభ్యర్థి అయినా మండలంలోని నందమూరు వెంకన్నను దర్శించుకుంటారు. స్వామి దర్శనం విజయం కలిగిస్తుందని ఆశావహుల విశ్వాసం. భౌగోళికంగా, వాస్తురీత్యా చూసినా నియోజకవర్గానికి ఈ గ్రామం తూర్పు దిశలో ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు 300 వందల ఏళ్ల నాటి గన్నేరు పూల చెట్టు ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే తాళపత్రాల గ్రంథాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఇక్కడి వారే. సత్తుపల్లికి మకాం మార్చినా స్వామిపై విశ్వాసంతో ఖమ్మం జిల్లానుంచి ఏటా ఒక్కసారైనా వచ్చి స్వామిని దర్శించుకునే వారు. అదే ఆనవాయితీని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఇది సెంటిమెంటుగా మారింది. ప్రచార పర్వంలో అభ్యర్థులు ఈ ఆలయానికి క్యూ కట్టడం విశేషం. -
సీఎం నివాసానికి ర్యాలీ.. రాజధానిలో ఉద్రిక్తత
-
మెడికల్ ఆఫీసరు.. మందు తాగితే రెచ్చిపోతారు!..
సాక్షి, పశ్చిమ గోదావరి: రోగులకు సేవ చేయాల్సిన వైద్యుడు గాడి తప్పాడు.. డ్యూటీకి తాగొచ్చి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిపై విరుచుకుపడటం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రశ్నించిన మీడియాపై సైతం చిందులు వేశాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం పీహెచ్సీలో రెండవ మెడికల్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ ప్రతిరోజూ మద్యం తాగొచ్చి వీరంగం సృష్టిస్తున్నాడు. డ్యూటీకి తాగొచ్చి సహచర ఉద్యోగులు, స్టాఫ్‌తో పాటుగా రోగులపైనా చిందులు వేస్తున్నాడు. తాగిన మైకంలో ఆయనతో పాటు పని చేస్తున్న సీనియర్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్, వ్యాధిగ్రస్తులపై తిట్ల దండకం ఎత్తుకుంటున్నాడు. తాగి రావడం ఏంటని ప్రశ్నించిన వారిపైనా తిరగబడుతున్నాడు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపైనా డాక్డర్ చిందులు వేశాడు. గత నెల డ్యూటీలో చేరిన దగ్గర నుంచి ఇదే తరహాలో తాగి వచ్చి వీరంగం చేస్తున్నాడంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆగడాలు మితిమీరటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గతంలో దుర్గా ప్రసాద్ పనిచేసిన పూళ్ల, కాగుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే తరహాలో వ్యవహరించినట్లు పోలీసులు తేల్చారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి సిబ్బంది, అభివృద్ధి కమిటీ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. డీఎంహెచ్‌వో ఆదేశాలతో ఈనెల 8న కమిటీ వచ్చి విచారణ చేపట్టి, అభియోగాలు వాస్తవమని నిర్ధారించినా ఇప్పటి వరకు అతడిపై చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. -
విమానాలు, స్టార్ హోటళ్లలో గడుపుతూ..
సాక్షి, పశ్చిమగోదావరి : కేంద్రం ఇచ్చిన నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాలు, స్టార్ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోకెళ్లా ఏపీకే ప్రధాని మోదీ అధిక నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించిందని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వ దొంగలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. దొంగ దీక్షలు చేస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరువు సాయం ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఓఆర్పీ అంటే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అనేది బీజేపీ నినాదమైతే.. కాంగ్రెస్ వాళ్లకు మాత్రం ఓన్లీ రాహుల్-ఓన్లీ ప్రియాంక అంటూ ఎద్దేవా చేశారు. -
ముళ్ల పొదల్లో శిశువు
తాడేపల్లిగూడెం: గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలివెళ్లగా 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పసికందు మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి గూడెం వీకర్స్ కాలనీలోని ముళ్లపొదల్లో సోమవారం రాత్రి ఓ శిశువు పడి ఉండగా స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు. వారు వచ్చి, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శిశువు మంగళవారం ఉదయం చనిపోయింది. నెలలు నిండకుండానే జన్మించటం, బరువు తక్కువగా ఉండటంతోనే పసికందు మృతి చెందిందని వైద్యులు తెలిపారు.