సాక్షి, పశ్చిమ గోదావరి: రోగులకు సేవ చేయాల్సిన వైద్యుడు గాడి తప్పాడు.. డ్యూటీకి తాగొచ్చి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిపై విరుచుకుపడటం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రశ్నించిన మీడియాపై సైతం చిందులు వేశాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం పీహెచ్‌సీలో రెండవ మెడికల్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ ప్రతిరోజూ మద్యం తాగొచ్చి వీరంగం సృష్టిస్తున్నాడు. డ్యూటీకి తాగొచ్చి సహచర ఉద్యోగులు, స్టాఫ్‌తో పాటుగా రోగులపైనా చిందులు వేస్తున్నాడు. తాగిన మైకంలో ఆయనతో పాటు పని చేస్తున్న సీనియర్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్, వ్యాధిగ్రస్తులపై తిట్ల దండకం ఎత్తుకుంటున్నాడు. తాగి రావడం ఏంటని ప్రశ్నించిన వారిపైనా తిరగబడుతున్నాడు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపైనా డాక్డర్ చిందులు వేశాడు.
గత నెల డ్యూటీలో చేరిన దగ్గర నుంచి ఇదే తరహాలో తాగి వచ్చి వీరంగం చేస్తున్నాడంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆగడాలు మితిమీరటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గతంలో దుర్గా ప్రసాద్ పనిచేసిన పూళ్ల, కాగుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే తరహాలో వ్యవహరించినట్లు పోలీసులు తేల్చారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి సిబ్బంది, అభివృద్ధి కమిటీ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. డీఎంహెచ్‌వో ఆదేశాలతో ఈనెల 8న కమిటీ వచ్చి విచారణ చేపట్టి, అభియోగాలు వాస్తవమని నిర్ధారించినా ఇప్పటి వరకు అతడిపై చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment