సాక్షి, పశ్చిమ గోదావరి : గడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలసిరితో కళకళలాడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి బంగారు బాటలు వేస్తుందని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా... ట్విటర్‌లో మాత్రమే కనిపించే ఉత్తర కుమారుడు పోలవరం నిర్మాణంపై ఇష్టానుసారంగా మాట్లాడి.. ఇప్పుడు పత్తాలేకుండా పోయారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ను ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు గృహం కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ముంపునకు గురైందన్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం వరద ముంపు ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన డ్రోన్ పరిశీలనను తప్పుపట్టడం శోచనీయమన్నారు.
భగవంతుని సాక్షిగా బయటపడుతున్నాయి..
‘తాడేపల్లిగూడెంలో దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వాధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటే వలస నాయకులు కొందరు ఆ భూఆక్రమణలకు మద్దతుగా ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎటువంటి రాజకీయమో అర్థం కావడం లేదు. రూరల్ మండలంలో గత ప్రభుత్వం చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తిగా అవినీతిమయం. పైపులు కూడా రాకుండానే లక్షలాది రూపాయిలను మంజూరు చేశారు. విద్యుత్ కోనుగోలుకు సంబంధించిన టెండర్లపై పునః సమీక్షిస్తామంటే చంద్రబాబునాయుడు ఆందోళన పడటంలో ఆంతర్యం ఏమిటి’ అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రస్తుతం భగవంతుని సాక్షిగా చంద్రబాబు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment