రోడ్డు నిర్మాణంపై అటవీ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలరాజు, అధికారులు (ఫైల్)
పశ్చిమగోదావరి ,బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ అభివృద్ధితో పాటు గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కించడంతో పాటు రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణంపై దృష్టి సారించింది. గోదావరి వరద పోటెత్తిన సమయాల్లో పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వెనుక ఉన్న 19 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. దీంతో గిరిజనులు రాకపోకలకు వీలులేక, నిత్యావసర సరుకులు అందక నానా అవస్థలు పడుతున్నారు. వీరి కష్టాలను తీర్చేలా జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత డ్యామ్‌లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉన్న సమయాల్లోనూ గిరిజన గ్రామాలకు ఇబ్బందులు కలగకుండా అటవీ ప్రాంతమైన గడ్డపల్లి నుంచి కొట్రుపల్లి మీదుగా కొరుటూరు వరకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశాలతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐటీడీఏ, పోలవరం ప్రాజెక్టు అధికారులు సమన్వయంతో రోడ్డు నిర్మాణానికి సంకల్పించారు. ఇది పూర్తయితే రోడ్డు మార్గంలో ఉన్న మరికొన్ని గ్రామాల ఆదివాసీలకూ జీవనోపాధి లభిస్తుందని అధికారుల చెబుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఏజెన్సీ అందాలు, జలతారు వాగు ప్రవాహాల మధ్య పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
15 కిలోమీటర్లు.. రూ.10 కోట్లు
దట్టమైన అటవీ ప్రాంతంలో పాపికొండల నడుమ దాసన్ రోడ్డు మార్గం ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో దాసన్ అనే ఇంజినీర్ ఏర్పాటు చేశారు. రాళ్లతో పేర్చి ఉన్న ఈ రోడ్డు గడ్డపల్లి దాటిన తర్వాత కట్రుపల్లి మీదుగా చిలుకలూరు, రావిగూ డెం బంగ్లా రహదారి మీదుగా కొ రుటూరు వరకూ సుమారు 15.49 కిలోమీటర్ల మేర ఉంది. కొండ ప్రాంతంపై నుంచి 13 మ లుపులు తిరుగుతూ ఉండే ఈ దారి తిరుపతి కొండలను తలపి స్తోంది. దీనిని బీటీ రోడ్డుగా మా ర్చేందుకు రూ.10 కోట్లతో అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ నాగిరెడ్డి, ఐటీడీఏ పీఓ ఆర్‌వీ సూర్యనారాయణ, డీఎఫ్‌ఓ పి.రామకృష్ణ, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ పి.వెంకటేశ్వరరావు రోడ్డు మార్గంలో పర్యటించి నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.
19 గ్రామాలకు మరింత మేలు
దాసన్ రోడ్డు నిర్మాణం పూర్తయితే గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న 19 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. వరదల సమయంలో కూడా వారికి సహాయ సహాకారాలను అందించడం సులభమవుతుంది. వారు సులభంగా బయటకు వచ్చేందుకు ఇబ్బందులు తొలగుతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ రహదారి ఉండటం వల్ల టూరిజంగానూ అభివృద్ధి చెందుతుంది. రోడ్డు కొరుటూరు చేరుకుని పాపికొండల నడుమ కలవడంతో పర్యాటకులను కనువిందు చేస్తుంది. గోదావరి బోటు ఎక్కకుండా రోడ్డు మార్గంలో వాహనాల ద్వారా పాపికొండలకు చేరుకోవచ్చు. మార్గమధ్యలో జలతారు వాగు ప్రవాహాలు కనువిందు చేస్తాయి.
దిగువ ప్రాంతాలకు లాభదాయకం
దాసన్ రోడ్డు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతంలో ఉన్న పులిరామన్నగూడెం, కన్నారప్పాడు, ముంజులూరు, చింతపల్లి, గడ్డపల్లి గ్రామాల ప్రజలకూ ప్రయోజనం కలుగనుంది. రవాణా సౌకర్యంతో మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కలగడంతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఐటీడీఏ రుణాలు పొంది స్వయం సమృద్ధి సాధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment