టీడీపీ తలకిందులే.. ‘పశ్చిమ’లో మారిన రాజకీయం | West Godavari District is The Capital City of The Vengi Chalakyulu | Sakshi
Sakshi News home page

టీడీపీ తలకిందులే.. పశ్చిమ గోదావరిలో మారిన  రాజకీయం

Published Sat, Apr 6 2019 8:46 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 AM

West Godavari District is The Capital City of The Vengi Chalakyulu - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : తూర్పు చాళుక్యులు ఏలిన ప్రాంతం. వేంగి రాజుల రాజధాని నగరం. శాంతిని చాటే గుంటుపల్లి బౌద్ధ గుహలు. ఆధ్యాత్మిక సౌరభాలు విరాజిల్లే క్షీరారామం, సోమారామం.. ద్వారకా తిరుమల, మావుళ్లమ్మ క్షేత్రాలకు ఆలవాలం. తెలుగు వాడి పౌరుషాగ్నికి ప్రతీక అల్లూరి సీతారామరాజుకు జన్మనిచ్చిన గడ్డ. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా’ అంటూ స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదిన అడవి బాపిరాజు, టెట్రాసైక్లిన్‌ లాంటి మందులెన్నో కనుగొని విశ్వ మానవాళి ప్రాణాలు నిలిపిన యల్లాప్రగడ సుబ్బారావు లాంటి మహానుభావులెందరికో పురిటి గడ్డ.

క్విట్‌ ఇండియా ఉద్యమంలో ‘రెండో బార్డోలీ’గా గాంధీజీచే కీర్తించబడిన గడ్డ. ఆక్వా రాజధానిగా.. జిల్లాకు ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న భీమవరం.. వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం.. అగరు ధూప పరిమళాలను వెదజల్లే చారిత్రక నగరం ఏలూరు.. స్వచ్ఛతకు మారుపేరైన గిరిపుత్రులను గన్న బుట్టాయగూడెం, పోలవరం అటవీ ప్రాంతం.. సినీ పరిశ్రమను ఏలుతున్న మేటి నటులు, దర్శకులకు జన్మనిచ్చిన ప్రాంతం. ఇదీ పైరుపచ్చలు పొదిగిన పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం. 

భీమవరం 

భీమవరంలో త్రిముఖ పోరు ఉంది. పవన్‌కల్యాణ్‌ చివరి నిమిషంలో ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో ఆసక్తి నెలకొంది. ప్రచారంలో వెనుకబడటం, గాజువాకపైనే దృష్టి పెట్టడం, స్థానికంగా ఉండరని ప్రజలు నమ్ముతుండటం పవన్‌కు మైనస్‌. హాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఎదురీదుతున్నారు. భీమవరం టౌన్‌షిప్‌లో పేదల గృహ రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీ నెరవేర్చకపోవడం, యనమదుర్రు డ్రెయిన్‌ ప్రక్షాళన చేపట్టకపోవడంతో ప్రజలు టీడీపీపై విశ్వాసం కోల్పోయారు. సమస్యలపై పోరుడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండటం, సానుభూతి, రీల్‌ హీరో పవన్‌తో తలపడుతున్న రియల్‌ హీరోగా ఆదరణ, క్షత్రియ సామాజికవర్గంతోపాటు ఇతర వర్గాలు గ్రంధి శ్రీనివాస్‌ పక్షాన నిలవడం ఈసారి విజయానికి కలిసి వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

ఉండి 
వైఎస్సార్‌ సీపీ, టీడీపీ అభ్యర్థులిద్దరూ తొలిసారి ఎమ్మెల్యే పదవికి పోటీపడుతున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పీవీఎల్‌ నరసింహరాజు బరిలో ఉన్నారు. సొసైటీ అధ్యక్షునిగా రైతులకు చేసిన సేవలకు గాను జాతీయ స్థాయిలో అవార్డు పొందిన నరసింహరాజుకు రైతు పక్షపాతిగా మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కలవపూడి శివకు బినామీ అని పేరుపడ్డారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీకి పెట్టారు. వేల ఎకరాల్లో అక్రమంగా చెరువుల తవ్వకాలు, అవినీతి, అక్రమార్జనల్లో ఎమ్మెల్యేకు బినామీ రామరాజు అనే ముద్ర ఉంది. డబ్బుతో అంతా మార్చేస్తామనే ధీమాతో టీడీపీ ఉంది. జనసేన తన మిత్రపక్షమైన సీపీఎం నుంచి బి.బలరామ్‌ను పోటీకి పెట్టడం టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడుతుందని విశ్లేషిస్తున్నారు. 

పాలకొల్లు 

సౌమ్యుడు, మంచి వైద్యుడు, నిజాయితీపరుడిగా పేరున్న డాక్టర్‌ త్సవటపల్లి సత్యనారాయణ (బాబ్జి) వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కులాలకు అతీతంగా అన్నివర్గాల్లో ఆయనకు మంచి పట్టు ఉండటం, సొంత సామాజికవర్గం నుంచి జనసేనవైపు మళ్లిన వారు మన డాక్టర్‌ కోసమంటూ వైఎస్సార్‌సీపీలోకి తిరిగొస్తుండటం ఆయనను విజయం వైపు నడిపిస్తోంది. డాక్టర్‌ బాబ్జి ముందు నిలవటం సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కత్తిమీద సామే. అభివృద్ధి కంటే కమీషన్ల కక్కుర్తే శాపమై తమను దెబ్బతీసేలా ఉందని టీడీపీ అంతర్మథనం చెందుతోంది. వివాదాస్పద దూకుడు స్వభావం జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబుకు మైనస్‌ అయి పరిమిత ఓటు బ్యాంక్‌తో సరి అంటున్నారు.  

నరసాపురం
నరసాపురంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు అన్నివిధాలా కలిసివస్తోందని టీడీపీ వర్గాలే అభిప్రాయపడటం విశేషం. రాజకీయ ఎత్తుగడల్లో చేయితిరిగిన ప్రసాదరాజుకు డెల్టాలో పట్టున్న మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అండగా నిలవటంతో వైఎస్సార్‌ సీపీ మరింత బలం పుంజుకుంది. నరసాపురం పట్టణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు, చెప్పుకోదగ్గ పనులు చేయకపోవటం, చిన్నచిన్న పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడటం వంటి పరిస్థితుల నడుమ ఆ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎదురీదుతున్నారు. జనసేన మత్స్యకార వర్గం నుంచి బొమ్మిడి నాయకర్‌ను బరిలోకి దింపింది. ఆ సామాజిక వర్గంలో ప్రసాదరాజుకు మొదటి నుంచీ మంచి పట్టు ఉండటంతో జనసేన పోటీ నామమాత్రమే. 

తాడేపల్లిగూడెం
 

తాడేపల్లిగూడెంలో ప్రధాన పోరు వైఎస్సార్‌ సీపీ, టీడీపీ మధ్యనే కనిపిస్తోంది. వైఎస్‌ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ రెండో ఫ్లైఓవర్‌ (ఆర్వోబీ), వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, వెటర్నరీ పాలిటెక్నిక్, ఏయూ పీజీ క్యాంపస్, నిరుపేదలకు రాజీవ్‌ గృహకల్ప వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నుంచి పైడికొండల మాణిక్యాలరావు మంత్రిగా ఉండటంతో టీడీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. సీటు ఆశించి భంగపడ్డ జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు వర్గం అంతర్గతంగా దెబ్బతీసే ప్రయత్నాలు టీడీపీ అభ్యర్థి ఈలి నానికి ప్రతికూలాంశాలుగా మారాయి. టీడీపీలో వర్గం కలిగిన మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ మేరకు టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడి కొట్టు సత్యనారాయణకు లాభిస్తుంది. 

ఏలూరు 
వైఎస్సార్‌ సీపీ నుంచి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రంగంలో ఉన్నారు. ఏలూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌ స్థాయికి పెంచటం, వర్షాకాలంలో ఏలూరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారంగా తమ్మిలేరుకు కాంక్రీట్‌ వాల్, నగర ప్రజలందరికీ రెండు పూటలా మంచినీరు అందించటం వంటి కార్యక్రమాలు నాని చేపట్టారు. ముస్లిం, మైనార్టీ వర్గానికి చెందిన మేయర్‌ షేక్‌ నూర్జహాన్, భర్త, కో–అప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరడంతో పార్టీ మరింత బలపడింది. టీడీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అవినీతి, అక్రమాల చిట్టాలో టాప్‌–3లో ఉన్నారు. భూ ఆక్రమణలు, ఏలూరు మార్కెట్‌లో కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు టీడీపీకి నష్టాన్ని కలిగించనున్నాయి. జనసేన నుంచి బరిలో దిగిన రెడ్డి అప్పలనాయుడు పోటీ నామమాత్రమే. 

ఉంగుటూరు 

వైఎస్సార్‌సీపీకి ఈసారి సానుకూల పవనాలు వీస్తున్న నియోజకవర్గం. పుప్పాల వాసుబాబు వైఎస్సార్‌సీపీ తరఫున రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమితో వచ్చిన సానుభూతి, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సమస్యలపై పోరాటాలు చేస్తుండటం వాసుబాబుకు కలిసివచ్చే అంశం. టీడీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇసుక దోపిడీ మొదలు అంగన్‌వాడీ, ఆశ వర్కర్‌లు, సబ్‌స్టేషన్‌లలో షిఫ్ట్‌ ఆపరేటర్ల నియామకం వరకూ పెచ్చుమీరిన అవినీతి టీడీపీకి శాపాలుగా మారాయి. గత ఎన్నికల్లో లక్షలు పెట్టుబడులు పెట్టి ఆయన విజయం కోసం పనిచేసిన నేతల నుంచి కూడా కమీషన్లు వసూలు చేయడంతో వారంతా ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయడం టీడీపీని దెబ్బతీయనున్నాయి. నౌడు వెంకటరమణ జనసేన నుంచి బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. 

ఆచంట 
రాజకీయ వ్యూహకర్త, ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్టగా పేరొందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇక్కడ రంగంలో ఉన్నారు. బలహీన వర్గాల విద్యార్థులకు స్కూల్‌ బస్సుల ఏర్పాటు, సొంత సొమ్ముతో ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన మంత్రి పితాని సత్యనారాయణకు చెరుకువాడ గట్టి పోటీ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూనపురెడ్డి చినబాబు వైఎస్సార్‌ సీపీలో చేరడంతో బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో వెన్నంటి నిలిచిన సొంత సామాజిక వర్గం నుంచి పితాని వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మంత్రి సామాజిక వర్గం ఈ సారి టీడీపీ నుంచి బయటకు వచ్చి చెరుకువాడకు పనిచేస్తుండటం వైఎస్సార్‌ సీపీకి సానుకూల అంశంగా మారింది. 

నిడదవోలు 

టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పోటీగా పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్‌ రావు కుమారుడు గెడ్డం శ్రీనివాసనాయుడు బరిలో నిలిచారు. తండ్రి జీఎస్‌ రావుకు నియోజకవర్గంలో వివిధ వర్గాల్లో పట్టుంది. నాయుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారంలో ముందున్నారు. ఎమ్మెల్యే శేషారావు ఇసుక మాఫియాను పెంచి పోషించారు. ఐదేళ్లయినా రైల్వేఫ్లైఓవర్‌ నిర్మించలేకపోయారు. చివరి వరకు టికెట్టు కోసం పట్టుపట్టి భంగపడ్డ శేషారావు సోదరుడు గోపాలకృష్ణ, మరో కీలక నేత కుందుల సత్యనారాయణ వర్గం శేషారావుకు వ్యతిరేకంగా ఉండటం టీడీపీకి గడ్డుకాలమేనంటున్నారు. జనసేన అభ్యర్థి 
ఎ.రమ్యశ్రీ ప్రభావం కొద్దోగొప్పో పెరవలి మండలానికే 
పరిమితం. 

దెందులూరు 
వివాదాస్పదుడు, అవినీతి, అక్రమాలు, సెటిల్‌మెంట్‌ దందాలతో నిత్యం పత్రికల పతాక శీర్షికల్లో నిలిచే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. అన్నీ తానై ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాను నడిపించి రూ.కోట్లు కొల్లగొట్టడం, ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌పై దౌర్జన్యానికి దిగడం వంటి దురాగతాలతో ఈసారి టీడీపీకి భారీ షాక్‌ తప్పదంటున్నారు. కృష్ణా డెల్టా నుంచి సాగునీరు తీసుకువస్తానన్న మాట నిలబెట్టుకోలేకపోవడంతో, కొల్లేరు మత్స్యకారుల మధ్య విభేదాలు సృష్టించడం వంటి పరిణామాలతో టీడీపీ ఎదురీదుతోంది. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగం, రూ.లక్షల వేతనాన్ని వదులుకుని వచ్చి వైఎస్సార్‌ సీపీ నుంచి బరిలోకి దిగిన కొఠారు అబ్బయ్యచౌదరి వీటిని సానుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతులయ్యారు. చింతమనేని ఓటమే లక్ష్యంగా అన్నివర్గాలు ఏకం కావడం వైఎస్సార్‌ సీపీకి కలిసి వచ్చే అంశం. జనసేన నుంచి ఘంటశాల వెంకటలక్ష్మి పోటీ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు. 

పోలవరం 
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైఎస్సార్‌ సీపీ నుంచి రంగంలో నిలిచారు. పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు సర్కార్‌ అన్యాయం చేయడంపై నిత్యం వారి తరఫున పోరాడటంతో గిరిజనుల్లో ఆదరణ పెరిగింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను కాదని టీడీపీ బి.శ్రీనివాసులును బరిలోకి దింపింది. పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీలో టీడీపీ నేతల అవినీతిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ముందస్తుగా భూములు ఇచ్చిన నిర్వాసితులకు రూ.5 లక్షలు అదనపు పరిహారం ఇస్తామని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం గిరిజనుల్లో ఆశలు చిగురించి వారంతా వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా ఉన్నారు. జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ ఇక్కడ నామమాత్రమే. 

కొవ్వూరు 

వైఎస్సార్‌ సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత బరిలో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ను తిరువూరుకు సాగనంపి.. పాయకరావుపేట నుంచి వంగలపూడి అనితను టీడీపీ దిగుమతి చేసింది. ఆమె స్థానికురాలు కాకపోవటం, మంత్రి జవహర్‌ వర్గం కలిసి రాకపోవడం, పాయకరావుపేటలో అనిత అవినీతి అక్రమాలతో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వనిత నిత్యం ప్రజల్లో ఉంటూ ఇసుక, మద్యం మాఫియాకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడంతో ప్రజల్లో వైఎస్సార్‌ సీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది.

గోపాలపురం 
టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ నుంచి తలారి వెంకట్రావు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓటమి చెందినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నిత్యం ప్రజలతో మమేకం కావడం, ఆర్థికంగా దెబ్బతిన్నా.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడంతో వెంకట్రావుకు సానుభూతి ఉంది. నిజాయితీపరుడనే పేరు, అన్నివర్గాల ఆదరణ వైఎస్సార్‌ సీపీకి సానుకూలంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ముప్పిడి ఏమీ చేయకపోవడం, పనుల కాంట్రాక్ట్‌లను ఒకరిద్దరికి మాత్రమే కట్టబెట్టడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

చింతలపూడి 
సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను తప్పించి టీడీపీ అభ్యర్థిగా కర్రా రాజారావును బరిలోకి దింపింది. ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గంగా రాజారావు పోటీ చేస్తుండటంతో పీతల వర్గం అతనికి సహకరించడం లేదు. పరిహారం పెంచాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే పరిహారం అందించి న్యాయం చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతో ఆయకట్టు రైతులు వైఎస్సార్‌ సీపీకి సానుకూలంగా మారడం కలిసి వస్తోంది. 

తణుకు 

కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్‌ సీపీ నుంచి రంగంలో ఉన్నారు. నియోజకవర్గాన్ని రూ.700 కోట్లతో అభివృద్ధి చేయడం, గోదావరి జలాలను తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను బరిలోకి దింపింది. తణుకు దివాణం నుంచి వైటీ రాజా సీటు ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన వర్గం టీడీపీకి సహాయ నిరాకరణ చేస్తోంది. కాంట్రాక్ట్‌లన్నీ తన బినామీలకే కట్టబెట్టడం సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వేల్పూరులో 1,008 మంది నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని 2015లో చంద్రబాబుతో శంకుస్థాపన చేయించగా, శిలాఫలకానికే పరిమితమైంది. వేసవిలో గోదావరి జలాల కోసం సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌ నిర్మాణానికి 60 ఎకరాలు కూడా సేకరించలేక చేతులెత్తేశారు. ఇవన్నీ టీడీపీకి మైనస్‌గా ఉన్నాయి. జనసేన నుంచి పసుపులేటి రామారావు పోటీలో ఉన్నారు. 
– లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement