వల్లకాదన్నా వినరే.. | Employees Election Duty | Sakshi
Sakshi News home page

వల్లకాదన్నా వినరే..

Mar 31 2019 12:03 PM | Updated on Mar 31 2019 12:04 PM

Employees Election Duty - Sakshi

సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అంధులకు, వికలాంగులకు, గర్భిణులకు, 6 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఎన్నికల విధులు వేయకూడదు. వీరితో పాటు చంటి పిల్లల తల్లులకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. అన్నీ తెలిసినా రిటర్నింగ్‌ అధికారులు మాత్రం వివిధ కారణాలతో మినహాయింపు లభించే ఉద్యోగులకు కూడా ఎన్నికల విధులు వేసేశారు. ప్రాథమిక పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండవనే విషయం కూడా తెలియని పరిస్థితిలో అధికారులున్నారని, స్పెషల్‌ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేస్తున్న వారిని స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పేర్కొంటూ వారికి కూడా పోలింగ్‌ అధికారిగా విధులు కేటాయించడం అధికారుల అనుభవరాహిత్యానికి నిదర్శనమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. మినహాయింపు లభించే ఉద్యోగులు తమకు ఏ అంశం ప్రకారం మినహాయిం పు లభిస్తుందో తెలుపుతూ సంబంధిత అధికారులకు రాత పూర్వకంగా వినతిపత్రాలు సమర్పించినా అధికారులు మాత్రం వాటిని బుట్టదాఖలు చేసి విధుల్లో నియమించారు.


సుదూర ప్రాంతాల్లో విధులు
అధికారులు ఉద్యోగులను సుదూర ప్రాంతాల్లో విధుల్లో నియమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శలు ఎదురౌతున్నాయి. దెందులూరులో పనిచేసే ఒక ఉద్యోగికి పోలవరంలో, ద్వారకాతిరుమల మండలంలో పనిచేసే ఉద్యోగికి పాలకొల్లులో విధులు కేటాయిం చారు. కామవరపుకోట మండలం కళ్ళచెరువు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక మహిళా ఉపాధ్యాయినిని నరసాపురంలో పోలింగ్‌ కేంద్రానికి అధికారిగా వేశారు. ఆయా ఉద్యోగులు తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్ళాలంటే తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి సుమారు 3 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉదయం 7 గంటల నుంచి విధుల్లో చేరాల్సి ఉండగా వారు పనిచేసే ప్రాంతం నుంచి తెల్లవారు జామునే ప్రయాణ సౌకర్యం ఉండే పరిస్థితి లేకపోవడంతో విధులకు సకాలంలో హాజరు కాలేకపోయే ప్రమాదముంది. 


శిక్షణకు రమ్మంటున్నారు
వచ్చే ఆగష్టులో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. ఆరునెలలలోపు పదవీ విరమణ చేయనున్న వారికి ఎన్నికల విధుల్లో మినహాయింపు ఉంటుంది. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారికి చెప్పుకున్నాను. అయినా మినహాయింపు లభించలేదు. పాలకొల్లులో ఈ నెల 31వ తేదీన జరిగే శిక్షణ కార్యక్రమానికి రావాలని పిలుపు వచ్చింది.
– ఎంవీ రంగాచార్యులు, ప్రధానోపాధ్యాయుడు


స్కూల్‌ అసిస్టెంట్‌ని చేసేశారు
నేను మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో స్పెషల్‌ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాను. మండల పరిషత్‌ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌లు ఉండరనే విషయం కూడా తెలియకుండా నేను స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని పేర్కొంటూ నాకు ఎన్నికల అధికారిగా విధులు వేశారు. అది కూడా నేను పనిచేసే మండలానికి బాగా దూర ప్రాంతానికి వేయడంతో ఇబ్బందిగా ఉంది.
– కొల్లి కృపావతి, ఉపాధ్యాయిని 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement