సాక్షి, పశ్చిమ గోదావరి : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. అధికారుల ఉరుకుల పరుగులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నచ్చిన వ్యక్తికి వేసుకోవడానికి అధికారుల పాత్ర కీలకమైనది. భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఎన్నికల ప్రకటన వచ్చిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అధికారులంతా ఎన్నికల సంఘం కింద పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎందరో అధికారుల శ్రమ దాగి ఉంటుంది. అన్నివర్గాల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా వ్యహరించాలి. ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
రిటర్నింగ్ అధికారి
శాసనసభల ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, అభ్యర్థుల తుది జాబితాను వీరు తయారుచేస్తారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నియామకం, వారికి శిక్షణ, ఓట్లు లెక్కింపు, ఫలితాలు ప్రకటన వంటి అన్నిరకాల పనులు ఈయన పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఆయా నియోజకవర్గాల్లోన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) లేదా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యహరిస్తారు.
సెక్టోరల్ అధికారి
పది నుంచి ఎనిమిది మంది వరకు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఒక సెక్టోరల్ అధికారిని నియమిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు గాను అవసరమైన చోట 144 సెక్షన్ విధించే అధికారం సెక్టోరల్ అఫీసర్‌కు ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ బూత్‌లు గుర్తించి అక్కడ బందోబస్తుకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు.
ప్రిసైడింగ్ అధికారి
ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఆయన పోలింగ్‌కు అవసమైన ఈవీఎంలు, వీవీ పాట్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడం, పోలింగ్ అనంతరం సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే వరకు ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతని సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్ కేంద్రంలో జరిగే అన్ని కార్యకలాపాలు ఈయన పర్యవేక్షణలో జరుగుతాయి.
ఓటర్ల నమోదు అధికారి
ఓటర్ల జాబితా తయారు చేయడం ఈయన బాధ్యత. ఓటు నమోదు చేసుకునే వారు, జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు వీరిని సంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు సిబ్బంది పనిచేస్తారు.
బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌ఓ)
కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి దరఖాస్తులను అందజేయడం, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం, ఓటరు జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పు తదితర సేవలను బూత్ లెవెల్ అధికారి అందిస్తారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు
నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఉంటుంది. వీరు ఆ పరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేస్తారు.
మైక్రో అబ్జర్వర్లు
ఎన్నికలు జరిగే తీరుపై నివేదిక రూపొందించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపడంలో మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యహరిస్తారు.
పోలింగ్ ఏజెంట్లు
అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రంలో తమ తరఫున ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. ఆయనే పోలింగ్ ఏజెంట్. వీరు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెబుతారు.
ప్రధాన ఎన్నికల అధికారి
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది.
జిల్లా ఎన్నికల అధికారి
ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతి జిల్లాకు ఒక జిల్లా అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ, జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణలో కీలక భూమిక పోషిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment