booth level officers
-
పోలింగ్ చీటీపైనే అన్నీ.
వాంకిడి(ఆసిఫాబాద్): ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల కమిషన్ ఓట్ల శాతం పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ చీటీలను బీఎల్వోల ద్వారా పంచి పెట్టింది. ఓటర్లకు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలింగ్ చీటీపైనే ఓటరు ఫొటో, పోలింగ్ కేంద్రం మ్యాప్, బీఎల్వో పేరు, ఫోన్‌నంబర్, కేంద్రం సమస్త వివరాలను ముద్రించింది. దీంతో గత ఎన్నికల్లో ఓటరు ఓటు వేయాలన్న కేంద్రం ఎక్కడుంది, ఓటు వేయాడానికి వెళ్లాలన్న ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్నికల కమిషన్ ఓటరు ఫొటోతో కూడిన పోలింగ్ చీటీలను పంపిణీ చేస్తూ వాటి వెనుకలో కేంద్రం మ్యాప్, వివరాలను పొందుపర్చారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ విధానం అములు చేయడంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడడంతో తిరిగి అదే విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు.జిల్లాలో మొత్తం 583 పోలింగ్ కేంద్రాలు చేశారు. ఇందులో సిర్పూర్(టి) నియోజకవర్గంలో 283, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 300ల కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 4,02,663 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 1863 మంది అధికారులను నియమించారు. ఓటర్లు వచ్చేలా చర్యలు పోలింగ్ చీటీలో ముద్రించిన సూచనలు ఇలా.. మీ గుర్తింపును నిరూపించడానికి ఓటరు చీటి మాత్రమే సరిపోదు, మీ గుర్తింపును బలపర్చడానికి మీరు మీ ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల కమిషన్ పేర్కొంది. 11 డాక్యూమెంట్లలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పని సరిగా మీ వెంట తీసుకురావాలి. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ వరుసలో ఉన్న ఓటర్లందరికీ టోకెన్ జారీ చేసి తమ ఓటు వేయడానికి అనుమతిస్తారు. మహిళకు ప్రత్యేక క్యూ ఉంటుంది. వయోవృద్ధులకు ఓటింగ్ నిమిత్తం ప్రాధాన్యం ఉంటుంది. అందులు, శారీరక వైకల్యం కలిగిన ఓటరు ఓటు వేయడం కోసం కంపార్టుమెంటు వద్దకు తీసుకెళ్లేందుకు ఒక వయోజనుడిని సహాయకుడిగా అనుమతించవచ్చు. మొబైల్ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పోలింగ్ బూత్‌లోకి అనుమతించరు. ఒక నిర్ణీత అభ్యర్థి కోసం ఓటు వేయడానికి డబ్బు లేదా ఏదేని ఇతర విధాలైన ప్రతిఫలాన్ని ఇవ్వజూపడం లేదా అంగీకరించడం చట్ట ప్రకారం అవినీతి చేష్ట కిందకు వస్తుంది. ఏ ఒక్క ఓటరును వదిలేయరాదు. ప్రతీ ఓటు లెక్కించబడుతుంది. ఓటరు చెంతలోనే పోలింగ్ చీటీలు మండలాల వారీగా ఏర్పాటు చేసిన బీఎల్వోలు పోలింగ్ చీటీలను వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అలా పంపిణీ చేసిన అనంతరం బీఎల్వోలు ఓటరులకు పోల్ చీటిలు ముట్టినట్లు సదరు ఓటరు ద్వార సంతకాలు తీసుకుంటున్నారు. ఇలా పోలింగ్ చీటీలు ఇవ్వడానికి బీఎల్వోలు వెళ్లినప్పుడు ఇంట్లో ఓటరు లేకున్న దిగులు పడకుండా ఓటింగ్ సమయంలో కేంద్రాల వద్ద ఉన్న బీఎల్వో వద్ద నుంచి తమ పోలింగ్ చీటీలు సేకరించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చనే వెసులుబాటు కల్పించారు. -
ఎన్నికలను నడిపించేది వీరే..
సాక్షి, పశ్చిమ గోదావరి : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. అధికారుల ఉరుకుల పరుగులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నచ్చిన వ్యక్తికి వేసుకోవడానికి అధికారుల పాత్ర కీలకమైనది. భారత ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఎన్నికల ప్రకటన వచ్చిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అధికారులంతా ఎన్నికల సంఘం కింద పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎందరో అధికారుల శ్రమ దాగి ఉంటుంది. అన్నివర్గాల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా వ్యహరించాలి. ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. రిటర్నింగ్ అధికారి శాసనసభల ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, అభ్యర్థుల తుది జాబితాను వీరు తయారుచేస్తారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నియామకం, వారికి శిక్షణ, ఓట్లు లెక్కింపు, ఫలితాలు ప్రకటన వంటి అన్నిరకాల పనులు ఈయన పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఆయా నియోజకవర్గాల్లోన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) లేదా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యహరిస్తారు. సెక్టోరల్ అధికారి పది నుంచి ఎనిమిది మంది వరకు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఒక సెక్టోరల్ అధికారిని నియమిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు గాను అవసరమైన చోట 144 సెక్షన్ విధించే అధికారం సెక్టోరల్ అఫీసర్‌కు ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ బూత్‌లు గుర్తించి అక్కడ బందోబస్తుకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఆయన పోలింగ్‌కు అవసమైన ఈవీఎంలు, వీవీ పాట్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడం, పోలింగ్ అనంతరం సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే వరకు ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతని సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్ కేంద్రంలో జరిగే అన్ని కార్యకలాపాలు ఈయన పర్యవేక్షణలో జరుగుతాయి. ఓటర్ల నమోదు అధికారి ఓటర్ల జాబితా తయారు చేయడం ఈయన బాధ్యత. ఓటు నమోదు చేసుకునే వారు, జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు వీరిని సంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు సిబ్బంది పనిచేస్తారు. బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ) కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి దరఖాస్తులను అందజేయడం, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం, ఓటరు జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పు తదితర సేవలను బూత్ లెవెల్ అధికారి అందిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఉంటుంది. వీరు ఆ పరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేస్తారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికలు జరిగే తీరుపై నివేదిక రూపొందించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపడంలో మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యహరిస్తారు. పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రంలో తమ తరఫున ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. ఆయనే పోలింగ్ ఏజెంట్. వీరు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెబుతారు. ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతి జిల్లాకు ఒక జిల్లా అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ, జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణలో కీలక భూమిక పోషిస్తారు. -
బూత్ లెవల్ .. అంతా హడల్!
జిల్లాలో బీఎల్వోల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకపక్క అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు .. మరో వైపు అధికారుల ఆదేశాలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వేధింపుల పర్వం ఎక్కువవుతోంది. సమావేశాలు.. విచారణల పేరుతో ఆర్థికంగానూ చితికిపోవాల్సి వస్తోంది. గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఛీదరింపులు.. అధికారుల చివాట్లతో మరింత ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాక్షి,పలమనేరు(చిత్తూరు) : రాబోవు సార్వత్రిక ఎన్నికల కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో బూత్‌లెవల్ అధికారుల పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల సంఘానికి సంబంధించిన పనులు చేయాలనే గౌరవంతో విధులు నిర్వహిస్తున్న వీరికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈదఫా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. వారిమాట విని ఏదేనీ తప్పుచేస్తే ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు అధికారుల ఆదేశాలను పాటిస్తూ విధులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలి. ఈమధ్య భారీగా వస్తున్న ఫామ్–7 క్లయిమ్‌ల విచారణ వీరికి తలనొప్పిగా మారింది. క్షేత్రస్థాయిలో బీల్వోలే అత్యంతకీలకం ఎన్నికల నిర్వహణలో బీఎల్వోలే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఓటర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి 6–క్లయిమ్‌ల స్వీకరణ, వీటిపై విచారణ, ప్రస్తుతం 7–క్లయిమ్‌ల స్వీకరణ, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, వీటికి సంబంధించిన చెక్‌లిస్ట్, ఫామ్–13, 14 నోటీసుల జారీ వీటిపై విచారణలు చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలను గుర్తించడం, బూత్లెవల్లో సౌకర్యాలు, మార్పులు తదితరాలపై సమాచారాన్ని ఉన్నతాధికారుకు ఇస్తూ వారి ఆదేశాలను పాటించాలి. ఇందుకోసం అంగన్వాడీ వర్కర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులను ఎంపిక చేశారు. వీరు వారిశాఖలతో పనిలేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా బూత్‌లెవెల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తారు. అధికారపార్టీ ఒత్తిళ్లు గతంలో ఎన్నడూలేని విధంగా ఈదఫా ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు వీరిని తమదారిలోకి తెచ్చుకుంటున్నారు. తాము చెప్పినట్టు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తోంది. నయానా, భయానా కాకుంటే పలు రకాల ప్రలోభాలకు గురిచేసి కొందరిని ఇప్పటికే వారి దారికి తెచ్చుకున్నట్టు సమాచారం. గ్రామాల్లో అయితే అక్కడి అధికార పార్టీ నేతలు, సాధికార మిత్రలు వీరి వెంటే ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. చిన్నస్థాయి ఉద్యోగులు కాబట్టి స్థానిక నేతల మాటలు వినకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయోనని కొందరు వారు చెప్పినట్టే చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పచ్చ నేతల నుంచి తనకు ఇలాంటి ఒత్తిళ్లున్నాయని వారు అధికారులకు చెప్పుకున్నా లాభం లేకుండా ఉంది. ఎందుకంటే అధికారులు సైతం నాయకుల మాట వినేవాళ్లే ఎక్కువగా ఉన్నారనేది నిజం. ఈ విధుల్లోకి ఎందుకొచ్చామా..? అని బయటకు చెప్పుకోలేక బీఎల్వోలు లోలోన మదనపడేవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో బీఎల్వోలు విచారణలో తప్పని తిప్పలు అర్హులైన ఓటర్లను సైతం కొందరు ఫామ్ –7 ద్వారా తొలగింపునకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అభ్యంతరాలు జిల్లాలో వేలల్లోనే ఉండడంతో వీటిని మళ్లీ విచారించాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో వీరు అవరసమైన ధ్రువపత్రాలను అడిగితే ఓటర్లు ఎన్నిసార్లు విచారిస్తారంటూ బీఎల్వోలను ప్రశ్నిస్తున్నారు. వారిని ఒప్పించి నేర్పుగా పనులు చేయాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు టార్గెట్లపేరిట అధికారుల నుంచి ఆదేశాలు తప్పడం లేదు. వీరు మానసికంగా వేధింపులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కష్టం ఎక్కువ.. ఫలితం తక్కువ ఇంత కష్టపడినా బీఎల్వోలకు మూడు నెలలకు ఎన్నికల సంఘం నుంచి అందే గౌరవ వేతనం మూడు వేలు మాత్రమే. దీనికోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ విధుల కారణంగా బీపీలు, షుగర్ లాంటి జబ్బులు వస్తున్నాయని వాపోతున్నారు. జిల్లా అధికారులు వీరికి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉంది. -
వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం
-
25న జాతీయ ఓటర్ల దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, విద్యాశాఖ, కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం సమావేశం నిర్వహించి ఓటర్ల దినోత్సవంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ రోజున బూత్ లెవెల్ అధికారులు నూతనంగా చేరిన ఓటర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించాలని, ర్యాలీలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పోటీలు ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు 23వ తేదీన నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని కళాశాలల్లో పోటీలు నిర్వహించి అందులో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను 24న శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో జరిగే జిల్లాస్థాయి పోటీలకు పంపించాలన్నారు. పోటీలు జూనియర్, సీనియర్ స్థాయిలో ఉంటాయన్నారు. అలాగే 25న రంగోళి పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, డీఆర్వో బీహెచ్ఎస్.వెంకటరావు, డీఈవో ఎస్.అరుణకుమారి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బి.పోలీసు, డీఎస్పీ పి. శ్రీనివాసరావు, పురపాలక కమిషనర్ బాపిరాజు, ఓటరు నమోదు అధికారులు దయానిధి, ఎం.వెంకటేశ్వరరావు, కె.సాల్మన్‌రాజు, ఎస్.తనూజారాణి పాల్గొన్నారు. -
పని ఫుల్.. ‘గౌరవం’ నిల్
మోర్తాడ్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కార్యకర్తలకు చాలీచాలని వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం.. పనిభారాన్ని మాత్రం అడ్డగోలుగా మోపుతోంది. మూడేళ్లుగా బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ)గా సేవలు వినియోగించుకుంటున్నా.. ఇప్పటికీ గౌరవ వేతనం నిర్ణయించలేదు. ఇప్పటివరకు రూ. 2 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, ఎన్నికల నిర్వహణ, అవగాహన కార్యక్రమాలకోసం ఎలక్షన్ కమిషన్ మూడేళ్ల క్రితం ప్రతి పోలింగ్ బూత్‌కు ఓ అధికారిని నియమించింది. వారిని బూత్ లెవల్ అధికారులుగా పేర్కొంది. గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించింది. జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 2,005 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక అధికారిని నియమించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారిని బూత్ లెవల్ అధికారులుగా నియమించారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. కారోబార్లు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా బీఎల్ఓలుగా ఉన్నారు. వీరికి పలు దఫాల్లో శిక్షణ ఇచ్చారు. ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోల్ చిట్టీల పంపిణీ కార్యక్రమాన్ని సైతం వీరికే అప్పగించారు. రెగ్యులర్ విధులు నిర్వర్తిస్తూనే ఇన్ని అదనపు పనులు చేస్తున్న బీఎల్ఓలకు ఇప్పటికీ గౌరవ వేతనం నిర్ణయించకపోవడం గమనార్హం. మూడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న బీఎల్వోలకు అధికారులు కేవలం రూ. 2 వేలను చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిధులు మంజూరవుతాయి కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి బీఎల్ఓలకు గౌరవ వేతనాన్ని నిర్ణయించి, చెల్లించాలని పలువురు కోరుతున్నారు. -
ఓటరు నమోదుకు నేడు ఆఖరిరోజు...
సాక్షి, గుంటూరు: ఓటరుగా నమోదుకు నేటితో గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం సాయంత్రం వరకూ కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గడువు పొడిగించిన తరువాత ఎక్కువ మంది స్పందించి దరఖాస్తులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు కేంద్రాల్లో శనివారం సాయంత్రం వరకు 2.17 లక్షల దరఖాస్తుల అందాయి. ఆదివారం కూడా పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఫారం-6ను స్వీకరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ కొత్తగా ఓటు కోసం ఫారం-6ను పూర్తి చేసి అందజేశారు. గుంటూరు నగర కార్పొరేషన్లో ఈ నెల 17వ తేదీ నాటికి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన 42 వేల మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేయగా, గడువు పొడిగించాక ఆదివారం సాయంత్రానికి మరో మూడు వేల దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించి ఎంక్వైరీకి పంపే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.ఆన్లైన్లోనే ఎక్కువ.. ఈ సారి ఎక్కువ మంది యువకులు ఈ సారి ఆన్లైన్లోనే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు నగరంలోని సుమారు 20 వేల మందికి పైగా యువత బీఎల్వో దగ్గరకు వెళ్లే పనిలేకుండా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ అధికారులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. గుంటూరు నగరంలోని పలు శివారు కాలనీల్లో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని నివశించే ప్రజలు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకుంటే, వాటన్నింటి పైనా బీఎల్వోలు అభ్యంతరాలు చెబుతున్నారు. పొన్నూరు రోడ్డులోని హుసేన్నగర్లోని 70 మంది దరఖాస్తులు ఈ విధంగా తిరస్కరణకు గురై వెనక్కి వచ్చాయి. సరైన నివాస ధ్రువపత్రాలు జత చేయలేదంటూ సిబ్బంది ఫారం-6 దరఖాస్తుల్ని స్వీకరించడం లేద ని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళ్‌దాస్‌నగర్, కొండా వెంకటప్పయ్యకాలనీ, నందమూరినగర్, తుపాన్‌నగర్, ఎన్జీవో కాలనీ, రామిరెడ్డినగర్ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు. -
సాక్షి చేయూత
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ ఓటరుకు ‘సాక్షి’ చేయూతనిచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఆఫీసర్లను పూర్తి స్థాయిలో ఉంచేందుకు చొరవ చూపింది. ఓటర్లకు సంబంధించిన అన్నిరకాల ఫారాలను పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చేసింది. గత ఆదివారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలను ‘న్యూస్‌లైన్’ బృందం పరిశీలించింది. ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం కల్పించిన ప్రత్యేక కార్యక్రమంలో లోపాలను పట్టిచూపుతూ ‘నూతన ఓటరుకు నిరాశ’ అంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు స్పందించారు. తాజాగా ఈ ఆదివారం జరిగిన ప్రత్యేక ఓటర్ల నమోదులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల వరకు ‘సమర సాక్షి’ సత్ఫలితాలను ఇచ్చింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 251 పోలింగ్ కేంద్రాలున్నాయి. గత రెండు ఆదివారాలు నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదుకు ప్రజలు వచ్చి భంగపడ్డారు. పోలింగ్ కేంద్రాలు మూసివేసి ఉండటం, బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ వారు ఉన్నప్పటికీ ఓటర్ల ఫారాలు లేకపోవడంతో సొంతంగా జిరాక్స్ తీయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానికి కలెక్టర్ విజయకుమార్ స్పందించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్లు విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దాంతో వారిలో కదలిక వచ్చింది. కందుకూరు నియోజకవర్గంలో 220 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నియోజకవర్గ పరిధిలోని లింగసముద్రం మండలంలో 35 పోలింగ్ కేంద్రాల తలుపులు గతంలో తెరుచుకోలేదు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో అన్ని పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. నియోజకవర్గ పరిధిలోని మిగతా మండలాల్లో కూడా బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కనిగిరి నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలున్నాయి. కనిగిరితోపాటు పామూరు, సీఎస్‌పురం, హనుమంతునిపాడు, పీసీపల్లి, వెలిగండ్ల మండలాల్లో గతంలో పదుల సంఖ్యలోనే బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈసారి మాత్రం 90 శాతానికిపైగా పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించారు. వారికి అవసరమైన అన్నిరకాల ఫారాలను సిద్ధంగా ఉంచుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలో 198 పోలింగ్ కేంద్రాలున్నాయి. అక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడొంతులు పోలింగ్ కేంద్రాల తలుపులు తెరుచుకోలేదు. దాంతో నూతనంగా ఓటు హక్కు పొందాలని ముందుకు వచ్చినవారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండటంతో ప్రజలు ఓటు నమోదు ప్రక్రియలో ఆనందంగా పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో 228 పోలింగ్ కేంద్రాలున్నాయి. గత ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదులో మండల అధికారులు బూత్ లెవల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో అలాంటి సమస్యలు తలెత్తలేదు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండటంతో ప్రజలు ఓటరు నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గంలో 198 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే గత వారం నిర్వహించిన ఓటర్ల నమోదు ప్రక్రియలో సగానికిపైగా పోలింగ్ కేంద్రాల తలుపులు తెరుచుకోలేదు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంతో దాదాపుగా బూత్ లెవల్ ఆఫీసర్లంతా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఓటరు ప్రక్రియకు సంబంధించిన అన్నిరకాల ఫారాలను సిద్ధంగా ఉంచారు. పర్చూరు నియోజకవర్గంలో 254 పోలింగ్ కేంద్రాలున్నాయి. గతంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫారాల కొరత ఉంది. ఈసారి నిర్వహించిన ఓటర్ల నమోదులో ఫారాల కొరత ఎక్కడా కనిపించలేదు. బూత్ లెవల్ ఆఫీసర్లు కూడా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో 216 పోలింగ్ కేంద్రాలున్నాయి. రెండు వారాల క్రితం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదులో విధులకు గైర్హాజరైన నలుగురు బూత్ లెవల్ ఆఫీసర్లకు మార్కాపురం ఆర్డీఓ షోకాజు నోటీసు జారీ చేయడంతో ఆ తరువాతి ఆదివారం జరిగిన ఓటర్ల నమోదుపై ప్రభావం చూపింది. ఆ వారంలో చోటు చేసుకున్న సమస్యలను ‘సాక్షి’లో ప్రచురించడంతో పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. దర్శి నియోజకవర్గంలో 240 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ మెజార్టీ పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అంతేగాకుండా అన్నిరకాల ఫారాలను అందుబాటులో ఉంచడంతో ప్రజలు వాటికోసం ఎలాంటి ఖర్చు చేయకుండా ఓటరు నమోదులో పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు గతంలో మూతపడ్డాయి. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో వాటి తలుపులు తెరుచుకున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్లు అన్నిరకాల ఫారాలతో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలున్నాయి. బేస్తవారిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన పోలింగ్ కేంద్రాన్ని మార్చి ఒక మిద్దెపై ఏర్పాటు చేశారు. దాంతో మెట్లు ఎక్కి అంతపైకి వెళ్లలేక ప్రజలు పడిన ఇబ్బందులను ప్రచురించడంతో, ఈసారి నిర్వహించిన ఓటర్ల నమోదులో అక్కడ నుంచి పోలింగ్ కేంద్రాన్ని మార్చి ప్రజలకు అందుబాటులో ఉంచారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో 217 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడి పోలింగ్ కేంద్రాల్లో కొన్ని ప్రజలకు దూరంగా ఉన్నాయి. దాంతో రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చేది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మార్పు వచ్చింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు.