శ్రీకాకుళం పాతబస్టాండ్ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, విద్యాశాఖ, కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం సమావేశం నిర్వహించి ఓటర్ల దినోత్సవంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ రోజున బూత్ లెవెల్ అధికారులు నూతనంగా చేరిన ఓటర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించాలని, ర్యాలీలు నిర్వహించాలన్నారు.
విద్యార్థులకు పోటీలు
ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు 23వ తేదీన నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని కళాశాలల్లో పోటీలు నిర్వహించి అందులో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను 24న శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో జరిగే జిల్లాస్థాయి పోటీలకు పంపించాలన్నారు. పోటీలు జూనియర్, సీనియర్ స్థాయిలో ఉంటాయన్నారు. అలాగే 25న రంగోళి పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, డీఆర్వో బీహెచ్‌ఎస్.వెంకటరావు, డీఈవో ఎస్.అరుణకుమారి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బి.పోలీసు, డీఎస్పీ పి. శ్రీనివాసరావు, పురపాలక కమిషనర్ బాపిరాజు, ఓటరు నమోదు అధికారులు దయానిధి, ఎం.వెంకటేశ్వరరావు, కె.సాల్మన్‌రాజు, ఎస్.తనూజారాణి పాల్గొన్నారు.
25న జాతీయ ఓటర్ల దినోత్సవం
Published Wed, Jan 21 2015 4:31 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM
Advertisement