మోర్తాడ్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కార్యకర్తలకు చాలీచాలని వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం.. పనిభారాన్ని మాత్రం అడ్డగోలుగా మోపుతోంది. మూడేళ్లుగా బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌ఓ)గా సేవలు వినియోగించుకుంటున్నా.. ఇప్పటికీ గౌరవ వేతనం నిర్ణయించలేదు. ఇప్పటివరకు రూ. 2 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, ఎన్నికల నిర్వహణ, అవగాహన కార్యక్రమాలకోసం ఎలక్షన్ కమిషన్ మూడేళ్ల క్రితం ప్రతి పోలింగ్ బూత్‌కు ఓ అధికారిని నియమించింది. వారిని బూత్ లెవల్ అధికారులుగా పేర్కొంది. గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించింది. జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 2,005 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక అధికారిని నియమించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారిని బూత్ లెవల్ అధికారులుగా నియమించారు. ఇందులో అంగన్‌వాడీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. కారోబార్‌లు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా బీఎల్‌ఓలుగా ఉన్నారు.
వీరికి పలు దఫాల్లో శిక్షణ ఇచ్చారు. ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోల్ చిట్టీల పంపిణీ కార్యక్రమాన్ని సైతం వీరికే అప్పగించారు. రెగ్యులర్ విధులు నిర్వర్తిస్తూనే ఇన్ని అదనపు పనులు చేస్తున్న బీఎల్‌ఓలకు ఇప్పటికీ గౌరవ వేతనం నిర్ణయించకపోవడం గమనార్హం. మూడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వోలకు అధికారులు కేవలం రూ. 2 వేలను చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిధులు మంజూరవుతాయి కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి బీఎల్‌ఓలకు గౌరవ వేతనాన్ని నిర్ణయించి, చెల్లించాలని పలువురు కోరుతున్నారు.
పని ఫుల్.. ‘గౌరవం’ నిల్
Published Wed, Apr 9 2014 3:20 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement