ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్
ఓటరుకు ‘సాక్షి’ చేయూతనిచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఆఫీసర్లను పూర్తి స్థాయిలో ఉంచేందుకు చొరవ చూపింది. ఓటర్లకు సంబంధించిన అన్నిరకాల ఫారాలను పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చేసింది. గత ఆదివారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలను ‘న్యూస్‌లైన్’ బృందం పరిశీలించింది. ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం కల్పించిన ప్రత్యేక కార్యక్రమంలో లోపాలను పట్టిచూపుతూ ‘నూతన ఓటరుకు నిరాశ’ అంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు స్పందించారు. తాజాగా ఈ ఆదివారం జరిగిన ప్రత్యేక ఓటర్ల నమోదులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల వరకు ‘సమర సాక్షి’ సత్ఫలితాలను ఇచ్చింది.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 251 పోలింగ్ కేంద్రాలున్నాయి. గత రెండు ఆదివారాలు నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదుకు ప్రజలు వచ్చి భంగపడ్డారు. పోలింగ్ కేంద్రాలు మూసివేసి ఉండటం, బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ వారు ఉన్నప్పటికీ ఓటర్ల ఫారాలు లేకపోవడంతో సొంతంగా జిరాక్స్ తీయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానికి కలెక్టర్ విజయకుమార్ స్పందించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్లు విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దాంతో వారిలో కదలిక వచ్చింది.
కందుకూరు నియోజకవర్గంలో 220 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నియోజకవర్గ పరిధిలోని లింగసముద్రం
మండలంలో 35 పోలింగ్ కేంద్రాల తలుపులు గతంలో తెరుచుకోలేదు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో అన్ని పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. నియోజకవర్గ పరిధిలోని మిగతా మండలాల్లో కూడా బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
కనిగిరి నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలున్నాయి. కనిగిరితోపాటు పామూరు, సీఎస్‌పురం, హనుమంతునిపాడు, పీసీపల్లి, వెలిగండ్ల మండలాల్లో గతంలో పదుల సంఖ్యలోనే బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈసారి మాత్రం 90 శాతానికిపైగా పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించారు. వారికి అవసరమైన అన్నిరకాల ఫారాలను సిద్ధంగా ఉంచుకున్నారు.
అద్దంకి నియోజకవర్గంలో 198 పోలింగ్ కేంద్రాలున్నాయి. అక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడొంతులు పోలింగ్ కేంద్రాల తలుపులు తెరుచుకోలేదు. దాంతో నూతనంగా ఓటు హక్కు పొందాలని ముందుకు వచ్చినవారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండటంతో ప్రజలు ఓటు నమోదు ప్రక్రియలో ఆనందంగా పాల్గొన్నారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో 228 పోలింగ్ కేంద్రాలున్నాయి. గత ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదులో మండల అధికారులు బూత్ లెవల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో అలాంటి సమస్యలు తలెత్తలేదు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండటంతో ప్రజలు ఓటరు నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నారు.
చీరాల నియోజకవర్గంలో 198 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే గత వారం నిర్వహించిన ఓటర్ల నమోదు ప్రక్రియలో సగానికిపైగా పోలింగ్ కేంద్రాల తలుపులు తెరుచుకోలేదు. తాజాగా నిర్వహించిన కార్యక్రమంతో దాదాపుగా బూత్ లెవల్ ఆఫీసర్లంతా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఓటరు ప్రక్రియకు సంబంధించిన అన్నిరకాల ఫారాలను సిద్ధంగా ఉంచారు.
పర్చూరు నియోజకవర్గంలో 254 పోలింగ్ కేంద్రాలున్నాయి. గతంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫారాల కొరత ఉంది. ఈసారి నిర్వహించిన ఓటర్ల నమోదులో ఫారాల కొరత ఎక్కడా కనిపించలేదు. బూత్ లెవల్ ఆఫీసర్లు కూడా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
మార్కాపురం నియోజకవర్గంలో 216 పోలింగ్ కేంద్రాలున్నాయి. రెండు వారాల క్రితం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదులో విధులకు గైర్హాజరైన నలుగురు బూత్ లెవల్ ఆఫీసర్లకు మార్కాపురం ఆర్‌డీఓ షోకాజు నోటీసు జారీ చేయడంతో ఆ తరువాతి ఆదివారం జరిగిన ఓటర్ల నమోదుపై ప్రభావం చూపింది. ఆ వారంలో చోటు చేసుకున్న సమస్యలను ‘సాక్షి’లో ప్రచురించడంతో పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి.
దర్శి నియోజకవర్గంలో 240 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ మెజార్టీ పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అంతేగాకుండా అన్నిరకాల ఫారాలను అందుబాటులో ఉంచడంతో ప్రజలు వాటికోసం ఎలాంటి ఖర్చు చేయకుండా ఓటరు నమోదులో పాల్గొన్నారు.
కొండపి నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు గతంలో మూతపడ్డాయి. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో వాటి తలుపులు తెరుచుకున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్లు అన్నిరకాల ఫారాలతో ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలున్నాయి. బేస్తవారిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన పోలింగ్ కేంద్రాన్ని మార్చి ఒక మిద్దెపై ఏర్పాటు చేశారు. దాంతో మెట్లు ఎక్కి అంతపైకి వెళ్లలేక ప్రజలు పడిన ఇబ్బందులను ప్రచురించడంతో, ఈసారి నిర్వహించిన ఓటర్ల నమోదులో అక్కడ నుంచి పోలింగ్ కేంద్రాన్ని మార్చి ప్రజలకు అందుబాటులో ఉంచారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో 217 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడి పోలింగ్ కేంద్రాల్లో కొన్ని ప్రజలకు దూరంగా ఉన్నాయి. దాంతో రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చేది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మార్పు వచ్చింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు.
సాక్షి చేయూత
Published Mon, Dec 16 2013 2:30 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement