
17 వరకు ఎమ్మెల్సీ ‘రీ పోలింగ్’ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో పాల్గొనే ఉపాధ్యాయ ఓటర్లకు ఎడమ చేయి మధ్య వేలుపై గుర్తింపు సిరాను వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 19న ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి పోలింగ్ నిర్వహించాలంది. ఈ నెల 9న జరిగిన పోలింగ్‌లో పాల్గొన్నవారితో పాటు పాల్గొనని ఉపాధ్యాయ ఓటర్లు కూడా 19న జరిగే పోలింగ్‌లో పాల్గొనాల్సిందిగా సూచించింది.
ఈ నెల 17 సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చునని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్‌సింగ్ తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తనకు ఫోన్‌చేసి తెలియజేయవచ్చునన్నారు.