ఎన్నికల విధుల్లో టీచర్లు
సాక్షి, బెంగళూరు: వేసవి సెలవుల్లో విశ్రాంతి తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు తీరిక లేని పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక వైపు పరీక్షల మూల్యంకనం, మరోవైపు ఎన్నికల విధులు చుట్టుముట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (పదో తరగతి) పరీక్షల మూల్యంకనం దా దా పుగా పూర్తవుతోంది.గత నెలలో మూల్యంకనం వల్ల బిజీబిజీగా గడిపిన టీచర్లు విశ్రాంతి తీసుకుందామనుకునే లోపే ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఈ నెల 12న జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం టీచర్లకు ప్రత్యేక డ్యూటీ వేశారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ విధులను అధికారులు టీచర్లకు కేటాయించారు. ప్రతి రోజు నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి కనీస సౌకర్యాల కల్పనపై వారు పర్యవేక్షణ చేస్తున్నారు.
ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలను సందర్శించి తిరిగి మధ్యాహ్నం నుంచి మూల్యంకనం వైపునకు టీచర్లు వెళ్లిపోతున్నారు. దీంతో తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇటీవలే ఎన్నికల విధులకు గైర్హాజరైన కారణంతో 20 మంది టీచర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో చాలా మంది టీచర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మూల్యాంకనంతో పాటు ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఓటర్ల జాబితా తనిఖీల్లో అలసత్వం వల్ల కొందరు టీచర్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో టీచర్లు ఎప్పుడు ఏ కారణంతో వేటు పడుతుందోననే భయంతో అటు మూల్యంకనం, ఇటు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ అత్యవసర పరిస్థితులు తప్పించితే ఎన్నికల విధులకు డుమ్మా కొట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఒప్పుకోవడం లేదు. దీంతో టీచర్లు తీవ్ర ఒత్తిడిలో పడ్డారు.
మే మాసం.. అందరికీ ముఖ్యం
ఈ మే నెల అందరికీ ముఖ్యంగా మారిపోయింది. పరీక్షల ఫలితాలపై విద్యార్థులు, ఎన్నికల ఫలితాలపై నాయకులు టెన్షన్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ద్వితీయ పీయూసీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక ఎస్‌ఎస్‌ఎల్‌సీ (పదోతరగతి) ఫలితాలు ఈ నెల 7న విడుదలయ్యే అవకాశం ఉంది. సీఈటీ ఫలితాలు కూడా ఇదే తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాలతో కంగారు పడుతుండగా, ఇదే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎలాగైన అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ తదితర పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు సాగిస్తున్నారు. వీరందరి భవితవ్యం ఈ నెల 15న తేలుతుంది. రాజకీయ నేతల మాదిరే విద్యార్థులు కూడా చదువుల్లో శ్రమిస్తున్నారు. జూన్‌లో జరుగబోయే నీట్ పరీక్ష కోసం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment